ప్రతి సీజన్ శారీరంగా కొన్ని సవాళ్లను వెంట బెట్టుకుని వస్తుంది. వేసవి కాలం రాగానే ఎక్కడ వడదెబ్బ కొడుతుందో.. ఎక్కడ శరీరం నీరస పడిపోతుందో అని అల్లాడిపోతారు ప్రజలు. ముఖ్యంగా శరీరానికి తగినంత నీటి అవసరాన్ని తీర్చడానికి నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీరు.. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు.. ఇలా చాలా తీసుకుంటారు. కానీ చలికాలం దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుంది. నీరు తాగాలన్నా, నీరు అధికంగా ఉన్నపండ్లు తినాలన్నా అస్సలు ఇష్టపడరు. దీని వల్ల కొంప కొల్లేరు అవుతుందని చాలా మంది తెలుసుకోరు. వేసవి కాలంలో కంటే చలికాలంలోనే నీరు తాగడం తగ్గుతుంది. ఇది చాలా ప్రమాదరమైన పరిస్థితి. చలికాలంలో కూడా కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి.
శరీరం డీహైడ్రేట్ అయితే..
శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది. కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, బలహీనత, పెదవులు పగిలిపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా హైడ్రేట్ గా ఉండటం, శరీరానికి శక్తి అధికంగా ఇచ్చే ఆహారాలు తినడం చేయాలి.
చలికాలంలోనే కాదు వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది, శరీరం శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిమ్మ, పుదీనా, తేనె వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగవచ్చు.
హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆహారంలో నీరు మాత్రమే కాకుండా నీరు అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి. రోజువారీ ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ఆకుకూరలు టమోటాలు తీసుకోవాలి.
డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి. ఎక్కడికైనా బయటకు వెళ్లినా.. బ్యాగ్‌లో లేదా కారులో బాటిల్ ఉంచుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు నీరు త్రాగడానికి గుర్తు చేస్తు ఉంటుంది. ప్రతిసారీ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా వ్యాయామం తర్వాత వాటర్ బాటిల్‌లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగడం వల్ల ఎఫెక్టివ్ హైడ్రేషన్ లభిస్తుంది.
రాత్రి పడుకునే ముందు కొంచెం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగవద్దు. లేకుంటే నిద్రలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లవలసి ఉంటుంది, దీని కారణంగా నిద్రకు భంగం కలగవచ్చు. అదే సమయంలో ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. ఇలా నీరు తాగుతుంటే శరీరం చలికాలంలో కూడా హైడ్రేట్ గా ఉంటుంది.
*రూపశ్రీ.