మహిళలు చలికాలంలో ఇవి తింటే.. మెనోపాజ్ తర్వాత ఆరోగ్యం సేఫ్..!
మెనోపాజ్ మహిళలు ఎదుర్కోనే కీలక దశ. ఈ దశలో మహిళలకు తమ నెలచక్రం ఆగిపోతుంది. దీని కారణంగా శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. మెనోపాజ్ తర్వాత స్త్రీల శరీరం మునుపటిలా ఉండదు. అకస్మాత్తుగా స్థూలకాయం పెరిగి ముఖంపై ముడతలు రావడం మొదలవుతుంది. ఈ స్థితిలో మహిళలు భయము, అశాంతి, విచారాన్ని అనుభవిస్తారు. ఎముకలు బలహీనంగా మారతాయి. చలికాలం మొదలవ్వగానే కీళ్ల నొప్పులు పెరుగుతాయి. స్త్రీ శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్లు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. అదే చలికాలంలో కొన్ని ఆహారాలు తీసుకుంటే మెనోపాజ్ తర్వాత మహిళల ఆరోగ్యం చాలా బెటర్ గా ఉంటుందట.
వయసు పెరిగే కొద్దీ జీర్ణక్రియ మందగిస్తుంది. ఈ వయస్సులో శరీరం భారీ వస్తువులను జీర్ణించుకోలేకపోతుంది. మెనోపాజ్ తర్వాత మహిళలు ప్రతిరోజూ పండ్లు, కూరగాయలను తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు తినడం వల్ల మహిళలు హాట్ ఫ్లాషెస్, మూడ్ స్వింగ్స్ నుండి ఉపశమనం పొందుతారు. ఊబకాయం పెరగదు. మంచి నిద్ర వస్తుంది. పండ్లు, కూరగాయలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
మెనోపాజ్ తర్వాత స్త్రీల ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. చలికాలంలో కీళ్ల నొప్పులు మొదలవుతాయి. ఎముకలు దృఢంగా ఉండటానికి, చలికాలంలో కీళ్ల నొప్పులను నివారించడానికి, పాల ఉత్పత్తులను ఆహారంలో ప్రతిరోజూ చేర్చుకోవాలి. పాల ఉత్పత్తులలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ డి, కె.. ఎముకలు బలహీనపడకుండా చేస్తాయి. మెనోపాజ్ తర్వాత మహిళలు సాధారణం కంటే ఎక్కువగా పాలు, పెరుగు, జున్ను తీసుకోవాలి.
చలికాలంలో జొన్నలు, బార్లీ, రాగులు వంటి తృణధాన్యాలు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. తృణధాన్యాలు తినడం వల్ల మలబద్ధకం, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు దరిచేరవు. బరువు కూడా పెరగదు. తృణధాన్యాల్లో ఉండే ఫైబర్, ప్రొటీన్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. తృణధాన్యాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. దీనివల్ల గుండె సమస్యలు, మధుమేహం రాకుండా ఉంటాయి.
మెనోపాజ్ సమయంలో స్త్రీల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా మహిళలు హార్మోన్ల అసమతుల్యత నుండి ఉపశమనం పొందుతారు. ఇది మెనోపాజ్ సమయంలో ఏర్పడే మూడ్ స్వింగ్స్, హాట్ ఫ్లాషెస్ నుండి కూడా ఉపశమనాన్ని అందిస్తుంది. 40 ఏళ్ల తర్వాత, మెనోపాజ్ సమస్యలను నివారించడానికి మహిళలకు 3 విటమిన్లు అవసరం . శరీరంలో విటమిన్ల లోపం లేకుంటే వృద్ధాప్యం త్వరగా జరగదు, ఎముకలు దృఢంగా ఉంటాయి.
మెనోపాజ్ తర్వాత, స్త్రీల ఎముకలు బలహీనంగా మారడం ప్రారంభిస్తాయి. వయసు పెరిగే కొద్దీ ఎముకలు దృఢంగా ఉండాలంటే మహిళలు తమ ఆహారంలో ప్రొటీన్‌ను పెంచుకోవాలి. చలికాలంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్య రాకుండా ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారం ఎముకల బలాన్ని పెంచుతుంది. పాలు, పెరుగు, జున్ను, బీన్స్, పప్పులు, సోయాబీన్, డ్రై ఫ్రూట్స్, గుడ్డు, చికెన్ వంటి ప్రోటీన్ పుష్కలంగా ఉన్న ఆహారాలను తీసుకోవాలి.
ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండటం కూడా చాలా ముఖ్యం. ఆరోగ్యకరమైన కొవ్వులలో విటమిన్ ఎ, డి, ఇ పుష్కలంగా ఉంటాయి. మెనోపాజ్ తర్వాత, మహిళలు తమ ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవడం ద్వారా బోలు ఎముకల వ్యాధి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. నువ్వులు, వాల్‌నట్‌లు, వేరుశెనగ, అవిసె గింజలు, చియా గింజలు, నెయ్యి, చేపలు, గుడ్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు మహిళలకు మేలు చేస్తాయి.
మెనోపాజ్ సమయంలో మహిళల్లో ఊబకాయం వేగంగా పెరుగుతుంది. 40 సంవత్సరాల వయస్సు నుండి యోగా, వ్యాయామం చేయడం ద్వారా మహిళలు మెనోపాజ్ వల్ల వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చు. శారీరక దృఢత్వం వల్ల స్త్రీల ఎముకలు త్వరగా బలహీనపడవు. సుదీర్ఘ జీవితం కోసం ఆరోగ్యంగా ఉండటానికి శారీరక వ్యాయామం కోసం ప్రతిరోజూ 30 నుండి 45 నిమిషాలు కేటాయించుకోవాలి.
*రూపశ్రీ.