డెలివరీ తర్వాత ఎన్ని రోజులకు పీరియడ్స్ రావాలి.. ఎంత కాలం రాకపోతే వైద్యుడిని కలవాలి!

గర్భం దాల్చడం వివాహం అయిన ప్రతి మహిళ జీవితంలో చోటు చేసుకునే ప్రక్రియ. ఇది మహిళల శరీరంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. మొదటిసారి గర్బం దాల్చిన మహిళలకు ఈ ప్రయాణం చాలా కొత్తగా, మరెంతో గందరగోళంగా అనపిస్తూ ఉంటుంది. గర్బం దాల్చినప్పుడు నెలసరి రాకపోవడం జరుగుతుంది. అయితే డెలివరీ తర్వాత మళ్లీ నెలసరి రావడం మొదలు అవుతుంది. కానీ ఈ విషయంలో చాలా మంది మహిళలు ఎంతో గందరగోళం ఫీలవుతూ ఉంటారు. డెలివరీ తర్వాత పీరియడ్స్ ఎప్పుడు తిరిగి వస్తాయనే ప్రశ్నకు సమాధానం ప్రతి స్త్రీకి భిన్నంగా ఉంటుంది. ఇది మహిళల శరీరంలో కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..
సర్వే ఏం చెప్తోందంటే..
2023 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-5) ప్రకారం.. భారతదేశంలో దాదాపు 65 శాతం మంది స్త్రీలకు ప్రసవించిన ఆరు నెలల్లోపే మళ్లీ నెలసరి మొదలైంది. అయితే పూర్తిగా తల్లిపాలు ఇచ్చే స్త్రీలలో నెలసరి 18 నెలల వరకు ఆలస్యం కావచ్చని నివేదికలు చెబుతున్నాయి.
డెలివరీ తర్వాత పీరియడ్స్ తిరిగి రావడాన్ని ప్రభావితం చేసే అంశాలు..
డెలివరీ తర్వాత తిరిగి పీరియడ్స్ రావడం అనే దాని మీద తల్లిపాలు ఇవ్వడం కీలక పాత్ర పోషిస్తుంది. తల్లిపాలు ఇచ్చే సమయంలో శరీరం ప్రోలాక్టిన్ అనే హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పాల ఉత్పత్తికి సహాయపడుతుంది, అండోత్సర్గమును అణిచివేస్తుంది. అందుకే క్రమం తప్పకుండా, పగలు, రాత్రి పాలిచ్చే స్త్రీలకు పీరియడ్స్ ఆలస్యంగా వస్తాయి. ఇది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ అని వైద్యులు అంటున్నారు. ఇది తదుపరి గర్భధారణ మధ్య అంతరాన్ని నిర్వహించడానికి సహాయపడుతుందని చెబుతున్నారు. డెలివరీ తర్వాత వచ్చే పీరియడ్స్ చాలా బాధాకరంగా ఉంటుందని చెబుతున్నారు. తీవ్రమైన సమస్య ఉంటే వైద్యులను తప్పక సంప్రదించాలి.
మళ్ళీ పీరియడ్స్ రెగ్యులర్ గా రావాలంటే ఏం చేయాలంటే..
ప్రసవం తర్వాత శరీరం తిరిగి బాలెన్స్డ్ గా మారడానికి సరైన జాగ్రత్త అవసరం. పోషకాహారం, హైడ్రేషన్ ఇందులో కీలక పాత్ర పోషిస్తాయి. సమతుల్య, పోషకమైన ఆహారం హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవడానికి, శరీరం కోలుకోవడానికి సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు, పప్పుధాన్యాలు, ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారాలు, ఐరన్ అధికగా ఉన్న ఆహారాలు కోల్పోయిన రక్తాన్ని తిరిగి నింపడానికి సహాయపడతాయి.
చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లు వంటి ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉండే ఆహారాలు మంటను తగ్గించడానికి, శరీరాన్ని బలోపేతం చేయడానికి సహాయపడతాయి. తగినంత నీరు త్రాగడం కూడా చాలా అవసరం. ఎందుకంటే శరీరంలో అన్ని విధులు సరిగా జరగడానికి ఇది సహాయపడుతుంది.
వ్యాయామం కూడా..
ప్రతి రోజూ తేలికపాటి శారీరక శ్రమ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజువారీ నడక లేదా తేలికపాటి వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. డెలివరీ తర్వాత యోగా, సున్నితంగా శరీరాన్ని సాగతీసే వ్యాయామాలు శరీర ప్లెక్సిబిలిటీ పెంచడానికి హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరచడానికి, క్రమంగా పీరియడ్స్ నార్మల్ గా రావడానికి సహాయపడతాయి.
*రూపశ్రీ




