చలికాలంలో విపరీతమైన దగ్గు,జలుబు కారణంగా గొంతులో కఫం ఏర్పడుతుంది.  కొన్నిసార్లు గొంతు లోపల పేలుతుంది. దీనికారణంగా   రక్తస్రావం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన కషాయాలను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ కషాయాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, ఇమ్యూన్-బూస్టర్ లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా  వీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్ అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలసుకుంటే..

అల్లం, పసుపు..

అల్లం  పసుపు కలపడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ డికాషన్ జలుబుతో పోరాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది.

తయారు విధానం..

తురిమిన అల్లం, పసుపు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. వడపోసి త్రాగే ముందు, కొద్దిగా తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవాలి.

తులసి

తులసిని ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలిక అంటారు. తులసి కషాయం అద్భుతమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది, కఫాన్ని తొలగించడం ద్వారా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

తయారు విధానం..

తాజా తులసి ఆకులను తీసుకుని, మిరియాలు, లవంగాలు,  అల్లం ముక్క వేసి  నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి తాగాలి.

దాల్చిన చెక్క

ఒక అధ్యయనం ప్రకారం దాల్చినచెక్కలో పాలీఫెనాల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు కూడా  ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది.

తయారు విధానం..

దాల్చిన చెక్క,  ఏలకులు, అల్లం ముక్క  కొన్ని లవంగాలను నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత వడకట్టి అందులో ఒక చెంచా తేనె వేసి సిప్ బై సిప్ తాగాలి.

ఆయుర్వేద త్రిఫల..

ఉసిరి, కరక్కాయ, తానికాయల  మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదంలో ఇది శరీరాన్ని శుద్ది చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుందని చెబుతారు. రోజూ దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

తయారు విధానం..

ఒక చెంచా త్రిఫల పొడిని నీటిలో వేసి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి.

మెంతులు,ధనియాలు..

ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెరను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది.  టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర, పొట్ట కొవ్వు,  వేగంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

తయారు విధానం..

మెంతి గింజలు, దనియాలు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. దీన్ని కాసేపు ఉడకబెట్టాలి.  తరువాత ఫిల్టర్ చేసి తాగాలి.

                                       *నిశ్శబ్ద.