ఆరోగ్యం మీద స్పృహ ఉన్న ఎంతోమంది వాకింగ్ వెళుతుంటారు. ముఖ్యంగా మార్నింగ్ వాక్ చేయడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని నమ్ముతారు. ఇది శరీరానికి మేలు చేస్తుంది, కండరాలను బలపరుస్తుంది, ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది, బరువును నియంత్రిస్తుంది,  గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. కానీ మార్నింగ్ వాక్ సరిగ్గా చేయకపోతే అది  ఆరోగ్యానికి  హానికరం. తప్పుగా చేసే  మార్నింగ్ వాక్ వల్ల శరీరానికి  ప్రయోజనాలు అంతగా  అందవు. అందుకే మార్నింగ్ వాక్ వెళ్లేముందు చెయ్యవలసిన, చెయ్యకూడని పనులేంటో తెలుసుకున్న తరువాత మార్నింగ్ వాక్ వెళ్లడం మంచిది.

చెయ్యవలసిన పనులు..

నీళ్ళు తప్పక త్రాగాలి:

మార్నింగ్ వాక్ కి వెళ్ళే ముందు కొంచెం మొతాదులో నీరు త్రాగటం అవసరం. నడక సమయంలో శరీరంలో సరైన ఆర్ద్రీకరణను నిర్వహించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఉదయాన్నే నడకకు వెళ్లేముందు నీళ్లు తాగడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవెల్ పెరిగి చురుగ్గా ఉంటుంది. అందుకే మార్నింగ్ వాక్ కు వెళ్లే ముందు నీళ్లు తాగడం మంచిది.

సరైన పాదరక్షలను ఎంచుకోవాలి:

ఉదయం నడకకు సరైన పాదరక్షలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. దీని కోసం, సౌకర్యవంతమైన, పాదాలకు సరిపోయే వాకింగ్ షూస్  ఎంచుకోండి. ఇవి కాళ్ళకు సరిగ్గా సెట్టవ్వాలి. చిన్న సైజు షూస్ లో పాదాలను ఇరికించడం చేయకూడదు, బాగా లూజుగా ఉన్నవి అస్సలే ఎంచుకోకూడదు. దీనివల్ల నడవడానికి బదులు షూస్ సవరించకోవడానికి, కాళ్ళను విదిలించుకోవడానికి సమయం సరిపోతుంది.  అందుకే మంచి గ్రిప్ ఉన్న బూట్లు ఎంచుకోవాలి.

వార్మప్ కావడం తప్పనిసరి:

ఉదయం నడకకు ముందు వార్మప్ కావడం  అవసరం. వార్మప్   శరీరాన్ని వేడి చేస్తుంది.  నడక కోసం  శరీర కండరాలను సిద్ధం చేస్తుంది. వైద్య శాస్త్రం ప్రకారం నడకకు ముందు 5-10 నిమిషాలు శరీరాన్ని  వార్మప్ చేయడం   అవసరం. ఇది  శరీరాన్ని వాకింగ్ కు సన్నద్దం  చేయడంలో సహాయపడుతుంది వాకింగ్ కారణంగా శరీరంలో గాయాలు కావడం, కండరాల నొప్పులు రావడం వంటి సమస్యలకు దారితీసే అవకాశాలు తగ్గిస్తుంది.   అందుకే వాకింగ్ కు ముందు వార్మప్ తప్పనిసరి.

వాకింగ్ కు ముందు చెయ్యకూడనివి..

వేగం వద్దు:

వాకింగ్ చేసేవారు మొదట గుర్తుపెట్టుకోవలసిన విషయం వార్మప్ తరువాత  వాకింగ్ ను మెల్లగా మొదలుపెట్టి ఆ తరువాత వేగం పెంచాలి. అంతేకానీ వార్మప్ అవ్వగానే రాముడు వదిలిన బాణంలా వేగంగా పరిగెడుతున్నట్టే నడవడం మంచిది కాదు. వేగవంతమైన నడక వల్ల లాభాలు ఉన్నప్పటికీ వాకింగ్ విషయంలో ప్రారంభంలోనే వేగం ఎప్పుడూ మంచిది కాదు.

ఆహారం:

చాలామంది మార్నింగ్ వాక్ వెళ్లేముందు డైటింగ్ పేరుతో బాగా తింటుంటారు. ఇందులో పోషకాహారాలే ఉన్నప్పటికీ భారీ ఆహారం తినడం వాకింగ్ కు ముందు విరుద్దమైన పని. ఒకవేళ వాకింగ్ సమయంలో నీరసంగా అనిపిస్తుందనే ఫీలింగ్ ఉంటే అరటిపండు, ఓట్స్, చిలగడదుంపలు, మంచినీళ్ళు, కొబ్బరినీళ్లు వంటి తేలికపాటి   అల్పాహారం తీసుకోవచ్చు. కానీ అల్పాహారం పేరుతో వీటిని భారీగా తీసుకోకూడదు.

చాలా సింపుల్ గా అనిపించే ఈ  విషయాల గురించి అవగాహన లేకుండా వాకింగ్ చేస్తే వీటి వల్ల  ఫలితాలు లేకపోగా శరీరం దుష్ఫ్రభావాలకు లోనవుతుంది. ఒక్కోసారి పోషకాహార లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది.

                                                      *నిశ్శబ్ద.