శరీరానికి విటమిన్లు చాలా అవసరం. విటమిన్లలో చాలా రకాలు ఉన్నాయి.  వాటిలో కొన్ని ఆహారం నుండి లభిస్తాయి.  కొన్ని ఆహారం తీసుకున్న తరువాత శరీరంలో విటమిన్ గా రూపాంతరం చెందుతాయి. కానీ విటమిన్-డి మాత్రం అలా కాదు.. ఇది ఎక్కువగా సూర్యకాంతి ద్వారా లభిస్తుంది.  చాలామంది ఉదయాన్నే సూర్యుడి లేత కిరణాలలో కనీసం 10 నుండి 30 నిమిషాల వరకు గడపాలి అని చెప్పడం వెనుక కారణం ఇదే.. అయితే నేటి జీవనశైలి,  బిజీ జీవితాలు,  గదులలోనే కూర్చుని ఉద్యోగాలు చేయడం వంటి కారణాల వల్ల విటమిన్-డి లభించడం కష్టం అవుతుంది. అందునా చలికాలంలో సూర్య కాంతి మరీ ప్రభావవంతంగా ఉండదు.  ఈ కారణంగా కూడా విటమిన్-డి లోపం ఏర్పడుతుంది.  అయితే.. విటమిన్-డి లోపం వల్ల డిప్రెషన్ సమస్య వస్తుందని అంటున్నారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే..


ఎవరైనా సరైన కారణాలు లేకుండా డిప్రెషన్ సమస్యతో ఇబ్బంది పడుతున్నట్టైతే అది విటమన్-డి లోపం కారణంగా వచ్చిన సమస్య కావచ్చని అంటున్నారు వైద్యులు.  విటమిన్-డి ఎముకలకు మాత్రమే కాదు.. మెదడు సరైన పనితీరుకు కూడా చాలా ముఖ్యం. శరీరంలో సంతోషకరమైన హార్మోన్ ను ఉత్పత్తి చేసేది విటమిన్-డి నే.. దీవినల్లే మెదడు సరిగ్గా పనిచేస్తుంది.

విటమిన్-డి మెదడులోని సెరోటోనిన్ స్థాయిని పెంచుతుంది. ఇది మానసిక స్థితిని నియంత్రిస్తుంది. తద్వారా మెదడు ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ఆరోగ్యకరంగా ఉంటుంది. మెదడు పనితీరు కూడా చురుగ్గా ఉంటుంది. అంతేనా.. మెదడులో ఆందోళన కలిగించే ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో కూడా విటమిన్-డి సహాయపడుతుంది.


మెదడు ఆరోగ్యానికి, మానసిక స్థితికి ఇంత అవసరమైన విటమిన్-డి లోపం ఏర్పడితే  సెరోటోనిన్ స్థాయిలు తగ్గుతాయి.  ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.  మానసిక పరిస్థితి అప్పటికే సరిగా లేని వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. విటమిన్-డి లోపిస్తే ఎమోషన్స్ కంట్రోల్ లో ఉండవు.  దీని వల్ల ఎప్పుడూ నిరాశ, నిర్లక్ష్యం,  చిరాకు, అసహనం వంటి సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి.  ముఖ్యంగా విటమిన్-డి లోపం ఏర్పడే వారిలో డిప్రెషన్ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి.

సూర్యుడి లేత కిరణాలలో సమయం గడపడం,  చేపలు, గుడ్లు, విటమిన్-డి కలిగిన పాలు.. వంటి ఇతర పదార్థాలు కూడా రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే విటమిన్-డి పుష్కలంగా లభిస్తుంది. శీతాకాలంలో విటమిన్-డి అంతగా లభ్యం కాదు కాబట్టి ఈ సీజన్ లో విటమిన్-డి కోసం చేపలు, గుడ్లు, పాలు బాగా తీసుకోవాలి.


                                            *రూపశ్రీ.