Vasovagal syncope- ఈ పేరు మనం ఎప్పుడూ విని ఉండము. కానీ మనలో దాదాపు 15 శాతం మందికి ఈ సమస్య ఉంటుంది తెలుసా! రక్తం చూడగానే కళ్లు తిరిగి పడిపోవడం ఈ వ్యాధి లక్షణం. చూసేందుకు చాలా చిన్నగా కనిపించినా... చెప్పుకోవడానికి చాలా వివరాలే ఉన్నాయి.
ఆదిమానవుల జ్ఞాపకాలు
రక్తం చూడగానే కొందరికి కళ్లు ఎందుకు తిరుగుతాయో సరైనా కారణాలు ఇప్పటికీ తెలియవు. ఒక ఊహ ప్రకారం ఈ వ్యాధి మన పూర్వీకుల నుంచి వస్తూ ఉండవచ్చు. ఆదిమానవులు వేటాడేటప్పుడో, శత్రువులతో యుద్ధం చేసేటప్పుడో తీవ్రంగా గాయపడతారు కదా! అలా గాయపడినప్పుడు వారు జంతువులు లేదా శత్రువుల బారిన చిక్కే ప్రమాదం ఉంది. ఇలాంటప్పుడు వారు స్పృహ తప్పి పడిపోవడం వల్ల చనిపోయినట్లుగా కనిపిస్తారు. వారు నిజంగానే చనిపోయారనుకుని శత్రువు తన దారిన తను వెళ్లిపోతాడు. కాలం మారినా.... రక్తానికి స్పృహ తప్పే జన్యువులు ఇంకా కొందరిలో ఉండటం వల్ల ఈ వ్యాధి వస్తోందని భావిస్తున్నారు. మరో అంచనా ప్రకారం దెబ్బ తగిలిన తర్వాత కళ్లు తిరిగిపడిపోవడం, రక్తస్రావం ఆగిపోయేందుకు దోహదపడుతుంది.
సమస్యలు లేకపోలేదు
ఈ వ్యాధి ఉన్నవారిలో రక్తం చూడగానే రక్తపోటు ఒక్కసారిగా పడిపోతుంది. గుండె బలహీనంగా కొట్టుకుంటుంది. దాంతో మెదడుకి వెళ్లే రక్తప్రసారం కూడా తగ్గిపోతుంది. చర్మం పాలిపోవడం, కళ్లు బైర్లు కమ్మడం, తల భారంగా మారడం, చెమటలు పట్టడం.... లాంటి లక్షణాలు కనిపించి మనిషి ఒక్కసారిగా కూలబడిపోతాడు. ఇలా కళ్లు తిరిగి పడిపోయిన మనిషి కాసేపటిలోనే మళ్లీ మామూలు మనిషి అయిపోతాడు కాబట్టి పెద్ద సమస్యగా అనిపించకపోవచ్చు. కానీ ఒక్కసారిగా కళ్లు తిరిగి పడటం వల్ల తీవ్రమైన గాయాలు కావచ్చు, ఎదుటివారికి తీవ్ర గాయమైన సందర్భంలో వారిని ఆదుకోవాల్సిన మనమే కళ్లు తిరిగి పడిపోవచ్చు. గుండె బలహీనంగా ఉండేవారిలో ఒక్కసారిగా ఇలా రక్తపోటు పడిపోవడం వల్ల ప్రాణాంతకంగానూ మారవచ్చు. కాబట్టి ఈ వ్యాధి నిరుపాయకరం అనుకోవడానికి వీల్లేదదు.
ఇలా చేయాలి!
రక్తం చూస్తే కళ్లు తిరుగుతున్నట్లు ఉంటే... వెంటనే పడుకోవడం చాలా అవసరం. దీని వల్ల రోగికి విశ్రాంతి లభించడమే కాకుండా, మెదడులోని రక్తప్రసారం సాధారణ స్థితికి చేరుకుంటుంది. అలా కాకుండా వెంటనే బలవంతంగా నిలబడే ప్రయత్నం చేస్తే... మళ్లీ కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుంది. Vasovagal syncope తాత్కాలికమే! కానీ దీని నుంచి ఉపశమనం పొందాలనుకుంటే మార్గాలు లేకపోలేదు. applied tension అనే ఒక చికిత్స ద్వారా వైద్యులు ఈ వ్యాధిని తగ్గించగలరు. ఇందులో భాగంగా ఒక 10 నుంచి 15 సెకన్ల పాటు కండరాలని బిగపట్టమని చెబుతారు. దాని వల్ల రక్తపోటు కాస్త పెరుగుతుంది. ఆ వెంటనే రక్తాన్ని గుర్తుచేసే దృశ్యాలను చూపిస్తారు. ఇలా రోగిని నిదానంగా రక్తాన్ని ‘కళ్ల చూసే’ పరిస్థితికి తీసుకువస్తారు.
మన చుట్టపక్కల ఎవరికన్నా రక్తాన్ని చూస్తే కళ్లు తిరిగే సమస్య ఉంటే... వారిని ఎగతాళి చేస్తుంటాం. వారు మానసికంగా బలహీనమైనవారని అంచనా వేస్తుంటాం. కానీ ఇది కూడా ఒక సమస్య అని గుర్తించిన రోజున వారి ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం తెలుస్తుంది.
-నిర్జర