మనిషి జీవితానికి ఆరోగ్యం ఎంతో ముఖ్యమైనది. కానీ ఆరోగ్యం అనేది డబ్బుతో కూడుకున్న వ్యవహారం అవుతోందిప్పుడు. ఏ ఆరోగ్య సమస్యలు వచ్చినా వాటికి వైద్యం చేయించుకోవాలి అంటే డబ్బులేనిది పని జరగదు. దీనివల్ల ఆరోగ్యం అనేది దిగువ వర్గాల వారికి అందని ద్రాక్షగా మిగిలిపోతోంది. ఆరోగ్య భద్రత కొందరికి మాత్రమే పరిమితం అవుతోంది. దీని గురించి అందరికీ అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఆరోగ్య సంరక్షణ అనేది ఒకరికి మాత్రమే పరిమితమైన, పరిమితమవ్వాల్సిన అంశం కాదు. మనిషి ఆరోగ్యం ఎంత బాగుంటే, అంత ఆరోగ్యవంతమైన ప్రపంచం అభివృద్ధి చెందుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఐక్యరాజ్యసమితి యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని ప్రకటించింది.
ఇంతకూ ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ఎప్పుడు మొదలయ్యింది?? దీని సందర్భంగా జరిగే కార్యక్రమాలు ఏమిటి?? వంటి విషయాలలోకి వెళితే…
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే!!
ఎన్నో విషయాలకు ప్రాముఖ్యత ఇస్తూ వాటి గురించి అవగాహన కల్పించాలని ఐక్యరాజ్య సమితి వాటికి సంబంధించి దినోత్సవాలను నిర్వహిస్తోంది. వాటిలో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే కూడా ఒకటి. దీన్ని 2017 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత!!
ప్రపంచ వ్యాప్తంగా మాకూ ఆరోగ్య సంరక్షణ కావాలి అని గొంతెత్తి చెప్పలేని పరిస్థితులలో చాలామంది ఉన్నారు. వారందరూ పేదరికమనే వృత్తంలో చిక్కుకుపోయి కనీస ఆరోగ్య సంరక్షణను పొందలేకపోతున్నారు. వారి పక్షాన నిలబడి వారికీ ఆరోగ్య సంరక్షణ అవసరమే అనే విషయాన్ని వ్యాప్తం చేయడమే ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత.
మనిషికి ఉన్న హక్కులలో భాగంగా ఆరోగ్యాన్ని పొందడం కూడా ఒకటి అని అందరూ గుర్తించేలా చేయడం. అన్ని దేశాలలో ప్రజలందరూ కూడా తమ ఆరోగ్యాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, కనీస అవగాహన పెంచుకోవడం ఎంతో ముఖ్యం. ఈ ప్రాముఖ్యతను అందరికీ తెలియజేయడమే యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ప్రాముఖ్యత.
ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు కొన్ని ఇతర సంస్థలు కలిసి ఈ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే ని నిర్వహిస్తాయి.
దీని ప్రణాళికలు ఏమిటంటే…
యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే 2015 సంవత్సరంలో డవలప్మెంట్ గోల్స్ లో చేర్చబడింది. ఆ సందర్భంగా 17 లక్ష్యాలను అందులో పొందుపరిచింది. వాటిని 2030 సంవత్సరానికల్లా సాధించే దిశగా నిర్ణయం తీసుకుంది. వాటిలో పేదరికాన్ని నిర్మూలించడం, ఆకలితో అలమటించే వారి సంఖ్యను తగ్గించడం. అందరికీ ఆరోగ్యం సాధ్యమయ్యేలా చేయడం, లింగ సమానత్వంతో సరిపోయేలా విద్య, ఇతర అవసరాలు అందేలా చేయడం. అందరికీ స్వచ్ఛమైన నీరు, పారిశుద్ధ్యం, అవసరమైన వనరుల లభ్యతతో పాటు, ఆర్థిక వృద్ధి, పరిశ్రమల వృద్ధి, మౌలిక సదుపాయాలు, స్థిరమైన అభివృద్ధికి తగ్గట్టు అందరి జీవితాల్లోనూ అభివృద్ధి మొదలైనవి ప్రణాళికగా రూపొందించబడ్డాయి.
అందరికీ న్యాయం, అందరి మధ్య ఆరోగ్యకరమైన శాంతి వాతావరణం మొదలైనవి ఇందులో భాగంగా ఉన్నాయి.
ఇలా యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే రోజున జరిగే కార్యక్రమాలు ప్రజల జీవితంలో ఆరోగ్య ప్రాధాన్యత గురించి, ఆరోగ్య సంరక్షణ గురించి వ్యాప్తం చేస్తాయి. ప్రతి ఒక్కరూ ఆరోగ్య భద్రత, ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేస్తే ఈ రోజు ప్రాముఖ్యతను నిజం చేసినవారం అవుతాము.
◆నిశ్శబ్ద.