ఆరోగ్యంగా ఉండటానికి తరచుగా ఆరోగ్యకరమైన ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ఉండాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు అందరూ చెప్తారు.  సాధారణంగా  ఆరోగ్యం మెరుగ్గా ఉన్న ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారాలు, పానీయాలను తప్పనిసరిగా తమ ఫుడ్ మెనూలో చేర్చుకుంటారు.  అయితే చాలా మంది రోజూ తింటున్న కొన్ని ఆహారాలు శరీరానికి ఎంతో మంచిదనే భ్రమలో ఉన్నారు. కానీ నిజం చెప్పాలంటే ఇలా తీసుకుంటున్న కొన్ని ఆహారాలు  ఆరోగ్యానికి మంచి చేయకపోగా చెడు చేస్తయని ఆహార నిపుణులు అంటున్నారు.  అందరూ ఆరోగ్యం అనుకుంటున్న ఏ ఏ ఆహారాలు ఆరోగ్యానికి చేటు చేస్తాయో.. అసలవి ఎందుకు మంచివి కాదో తెలుసుకుంటే..

డైజెస్టీవ్ బిస్కెట్స్..

డైజెస్టివ్ అనే పేరును బట్టి ఈ బిస్కెట్లు చాలా ఆరోగ్యకరం అని అనుకుంటారు. చాలా మంది ఆకలిగా అనిపించినప్పుడు, అల్పాహారంలోనూ  ఈ బిస్కెట్లకు ప్రాధాన్యత ఇస్తుంటారు. నిజానికి డైజెస్టివ్ బిస్కెట్లు పిండి, చక్కెరతో నిండి ఉంటాయి. వీటిలో చాలా కేలరీలు ఉంటాయి. వీటిని రోజూ తీసుకుంటే, బరువు చాలా సులభంగా పెరుగుతారు. 

ఖఖ్రా..

ఈ రోజుల్లో డైట్ ఖఖ్రా మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంది. చాలామంది సాయంత్రం టీతో పాటు వీటిని  చాలా ఉత్సాహంగా తింటారు. అయితే డైట్ ఖఖ్రాలో 'డైట్' లాంటిది ఏమీ ఉండదనేది విస్తుపోవాల్సిన విషయం. ఈ వేయించిన స్నాక్స్ లో చాలా కేలరీలు ఉంటాయి.

హెల్త్ డ్రింక్స్..

ఇప్పట్లో హెల్త్ డ్రింక్స్  చాలా విరివిగా ఉపయోగిస్తున్నారు. పిల్లలకు ఈ హెల్త్ డ్రింక్స్ వాడకం మరీ ఎక్కువ ఉంటోంది.  ఎందుకంటే పిల్లలకు పాలు ఇవ్వాలంటే ఈ హెల్త్ డ్రింక్స్  పౌడర్లు ఉండాల్సిందే.  అయితే కంపెనీలు పేర్కొన్నట్టు విటమిన్లు, DHA కలిగిన ఈ హెల్త్ డ్రింక్స్ పౌడర్లు చాలా అనారోగ్యకరమైనవి.  వీటిలో చక్కెర శాతం ఎక్కువ ఉంటుంది.

వీట్ బ్రెడ్..

వైట్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్, లేదా గోధుమ బ్రెడ్  ఆరోగ్యకరమైనదని చాలా మంది అనుకుంటారు. అయితే ఈ బ్రౌన్ బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్ లాగా అనారోగ్యకరమైనది.  ఎందుకంటే ఇందులో రంగులు ఉపయోగించబడతాయి,  దీని తయారీలో ఆరోగ్యకరమైన పదార్థాలేవీ ఉపయోగించరు.  

                              *నిశ్శబ్ద.