చాలా రకాల వంటలలో నూనె వినియోగం తప్పనిసరి. అస్సలు నూనె ఉపయోగించకుండా చేసే వంటల రుచి బాగుండదనే మాట వాస్తవం. నూనె వినియోగానికి బాగా అలవాటు పడిపోవడం వల్ల అలా అనిపిస్తుంది. వంట చేయడానికి  వినియోగించే నూనెలలో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నూనెలు ఆరోగ్యానికి మంచివి కావని, మరికొన్ని ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతుంటారు. అయితే అందరూ ఆరోగ్యానికి చాలా మంచివని అనుకునే అయిదు రకాల నూనెలతో వంట చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని తేలింది. డైటింగ్ చేసేవారు, ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు ఉపయోగించే కొన్ని రకాల నూనెలు కూడా వంటల్లో వినియోగించడం మంచిది కాదని తేలింది. ఆ నూనెలేంటంటే..

ఆవనూనె..

ఆవనూనె వంటల తయారీలో ఆరోగ్యకరమైనదిగా  పరిగణిస్తారు.  అయితే ఈ నూనెను చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఇందులో  ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది.  కల్తీ లేని ఆవనూనె మాత్రమే వంటకు ఉత్తమమైనది. లేని పక్షంలో మంచి ఫలితాల కంటే కలిగే నష్టాలే ఎక్కువ.

సోయాబీన్ నూనె..

సోయాబీన్ నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ చాలా పుష్కలంగా ఉంటాయి. దీని కారణంగా శరీరంలో ఒమేగా -6,  ఒమేగా -3 నిష్పత్తి అసమతుల్యమవుతుంది. దీని వల్ల శరీరంలో వాపు, కీళ్లనొప్పులు,  కొన్ని రకాల క్యాన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉంది. సోయాబీన్ నూనెను రోజూ వంటల్లో వినియోగించడం  వల్ల ఊబకాయం,  మధుమేహం తొందరగా వస్తుంది.

మొక్కజొన్న నూనె..

వెజిటబుల్  నూనె మాదిరి మొక్కజొన్న నూనెలో కూడా ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు అధిక స్థాయిలో ఉంటాయి. ఆహారంలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటే వాపుకు కారణమవుతుంది. దీన్ని తీసుకుంటే   100% కొవ్వులు శరీరంలో చేరతాయి.  ఇకపోతే ఈ నూనెలో ప్రోటీన్ లేదా కార్బోహైడ్రేట్లు ఏమీ ఉండవు. మొక్కజొన్న నూనె వంట విషయంలో ఆరోగ్యకరమైన ఎంపిక కాదు.

ఆలివ్ నూనె..

ఆలివ్ నూనె ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. సలాడ్‌లు,  ఆహారంలో నూనెను జోడించడం విషయానికి వస్తే ఆలివ్ నూనె అత్యంత ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. అయితే  ఈ నూనె వేడెక్కే ఉష్టోగ్రత ఇతర నూనెల కంటే తక్కువగా ఉంటుంది, అంటే ఇది అధిక మంట మీద  వంట చేయడానికి తగినది కాదు. ఆలివ్ నూనెను ఎప్పుడూ పైపైన వాడాలే తప్ప నేరుగా మంటమీద వేడి చేసి ఆహారాన్ని వండకూడదు. అలా వండితే  దాని పోషకాలు చెడిపోతాయి, అలాంటి  నూనె శరీరానికి హానికరం అవుతుంది.

పామాయిల్..

ఒకప్పుడు పామాయిల్ చాలా విరివిగా వాడేవారు. ఈ పామాయిల్ లో  సంతృప్త కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే గుండె జబ్బులు వస్తాయి. ఈ నూనెను ఎక్కువగా స్నానపు సబ్బు తయారీలో ఉపయోగిస్తారు . ఇది చాలా ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరుగుతుంది, అందుకే దీనిని రెస్టారెంట్లలో లేదా టాఫీ చాక్లెట్ మొదలైన వాటి తయారీలో ఉపయోగిస్తారు, తద్వారా ఇది నోటిలోకి వెళ్ళిన వెంటనే కరిగిపోతుంది.

ఆరోగ్యం బాగుండాలంటే పైన చెప్పిన నూనెలను ఆహారం వండటానికి అస్సలు వినియోగించకూడదు. దీనికి బదులుగా కొబ్బరి నూనె, అవకాడో నూనె, నువ్వుల నూనె వంటి ఆరోగ్యకరమైన నూనెలు వినియోగించవచ్చు. అయితే ఆహారం తయారీలో నూనెల వినియోగం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉండటం సాధ్యమవుతుంది.

                                       *నిశ్శబ్ద.