చలికాలంలో వచ్చిందంటే చాలు అనేక అనారోగ్య సమస్యలను వెంటపెట్టుకుని వస్తుంది. అయితే కరోనా కారణంగా ఈ సమస్య తీవ్రత మరింత పెరిగింది. వాతావరణంలో ఉష్ణోగ్రత తగ్గడం, పొగమంచు కమ్ముకోవడం వంటి కారణాలతో అనేక అనారోగ్యాలకు గురవ్వాల్సివస్తుంది. ఈ కాలంలో వైరల్ ఇన్‌ఫెక్షన్, జలుబు, శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, దగ్గు, తలనొప్పిలాంటివి ప్రధానంగా ఏర్పడే అనారోగ్యాలు. కరోనా లక్షణాలు కూడా ఇవే కావడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పడుతుంటే దాన్ని హైపోధెర్మియా అంటారు. ఆ సమయంలో శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతూ, శరీరం చల్లగా మారుతుంది. శరీరంలోని వివిధ అవయవాలు చేసే పనులు మందకొడిగా సాగుతాయి. ఈ అనారోగ్యం ఏర్పడటానికి కారణం చల్లనిగాలి తాకుతున్నప్పుడు వెచ్చని దుస్తులు ధరించకపోవడం, ఆందోళన ఎక్కువగా ఉండటం, సరిగ్గా ఆహారాన్ని తీసుకోకపోవడం, ఎక్కువ సమయం నీళ్ళల్లో నానటం లాంటి వాటివల్ల ఈ అనారోగ్యం ఏర్పడుతుంది. ఈ వ్యాధికి గురయినప్పుడు మాటల్లో స్పష్టత ఉండదు. వణుకు ఏర్పడుతుంది. మెదడుకు ఆలోచించే శక్తి తగ్గిపోతుంది. అశ్రద్ద, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళి తగినవైద్యం చేయించుకోవాలి. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యుని సంప్రదించ టమే కాకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
చల్లనిగాలి శరీరానికి సోకకుండా శరీరాన్ని పూర్తిగా కప్పివుంచి, శరీరానికి వెచ్చదనాన్ని కలిగించాలి. గోరువెచ్చని నీటిని తాగాలి, వేడివేడిగా కాఫీ, టీ, సూప్ లు తాగవచ్చు, హైపోధెర్మియాకు వైద్య చికిత్స ఎంతో అవసరం. లేకపోతే ప్రాణాపాయ పరిస్థితి కూడా ఏర్పడవచ్చు.
ఆస్తమాతో బాధపడుతున్నవారు..
చలికాలంలో ముఖ్యంగా వృద్ధులలో ఆస్తమా, గుండెజబ్బులు, శ్వాసకోశవ్యాధులు ఉన్నవారి పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి. చలిగాలికి రక్షణ చర్యలు తీసుకోకపోతే జలుబు, తుమ్ములు, గొంతు నొప్పివంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యునికి చూపించాలి. ముందుజాగ్రత్తగా పిల్లలకు, వృద్ధులకు చలిగాలి సోకకుండా స్వెట్టర్, మంకీ క్యాప్ లు వాడాలి.
చలికాలంలో ఆస్తమా రోగులకు చాలా ఇబ్బంది కరంగా ఉంటుంది. శ్వాస నాళాలలో ఒత్తిడి ఏర్పడి ఊపిరి పీల్చడం కష్టమవుతుంది. కొంతమందికి ఎలర్జీ, దుమ్ము, పొగ కారణంగా శ్వాసనాళాలలో మెలికలు ఏర్పడి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. పొద్దున, రాత్రి సమయంలో దగ్గు ఎక్కువగా వస్తుంది. వేగంగా నడవలేరు. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. కఫం అధికంగా ఏర్పడుతుంది. దగ్గినపుడు కళ్ళె ఆకుపచ్చరంగులో పడుతుంది. ఆకలి లేకపోవడంతో ఆహారం తీసుకోవడం తగ్గుతుంది. ఆ కారణంగా బలహీనంగా మారుతారు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే తక్కువ మోతాదులో ఎక్కువ ఆహారం తీసుకోవాలి. చలిగాలిలోనూ, మంచు కురిసేటప్పుడు బయటకు వెళ్ళకూడదు.వేడి తగ్గని ఆహారపదార్థాలను మాత్రమే తీసుకోవాలి. చలికాలంలో కూడా రోజుకు 6 నుండి 10 గ్లాసుల వరకూ పరిశుభ్రమైన కాచి చల్లార్చి, వడకట్టిన నీటిని తాగాలి. జలుబు, దగ్గు ఎక్కువగా వుంటే డాక్టర్ ను సంప్రదించాలి. పొగ, దుమ్ము, ధూళి ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండాలి. సిగిరెటు, చుట్టా, బీడి తాగే అలవాటు ఉన్నవారికి దూరంగా ఉండాలి.