ఆయుర్వేదం భారతదేశంలోని ఒక పురాతన వైద్య విధానం. దీనిలో ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి చాలా మార్గాలు, అన్ని వ్యాధులను వాటి మూలాల నుండి నిర్మూలించడానికి తీసుకునే చర్యలు క్షుణ్ణంగా వివరించబడి ఉన్నాయి. ఆహారం తినడానికి సరైన పద్ధతులు కూడా ఆయుర్వేదంలో వివరించబడ్డాయి. ఆహారం తీసుకునేటప్పుడు ఆయుర్వేదం 6 నియమాలను పాటించమని చెబుతుంది. ఈ నియమాలను పాటించడం వల్ల ఆరోగ్యం బాగుండటమే కాకుండా శరీరం చాలా బలంగా కూడా ఉంటుందట.
కడుపు నిండుగా తినకూడదు..
పూర్తీగా ఆకలి తీరేలాగా కడుపు నిండుగా ఎప్పుడూ తినకూడదట. 70-80 శాతం ఆకలి తీరి 75శాతం వరకు కడుపు నిండితే చాలట. అలా చేస్తే ఆహారం జీర్ణరసంలో కలిసి బాగా జీర్ణం కావడానికి కడుపు లోపల కొంత స్థలం ఏర్పడుతుందట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
భోజనం..
తీసుకునే భోజనం ఆ రోజులో అదే ఎక్కువ ఆహారం అయి ఉండాలి. అంటే దీని అర్థం.. రాత్రి భోజనం కంటే మధ్యాహ్నం తీసుకునే భోజనం ఎక్కువ ఉండాలి. ఎందుకంటే మానవ శరీరం సూర్యుడిని అనుసరిస్తుందట. మధ్యాహ్నం సమయంలో జీర్ణాగ్ని బలంగా ఉంటుంది. మధ్యాహ్న భోజనంలో పోషకాలున్న ఆహారాన్ని తినాలి.
సమయం..
రాత్రి ఆలస్యంగా తినకూడదు. రాత్రిపూట జీర్ణక్రియ మందగిస్తుంది, ఆహారం సరిగ్గా జీర్ణం కాదు.
ఆహార స్థితి..
ఆహారం చల్లగా అయిన తరువాత మళ్లీ వేడి చేయడం తప్పు. పాతబడిన లేదా మళ్లీ వేడిచేసిన ఆహారాన్ని తినకూడదు. పగటిపూట తయారుచేసిన ఆహారాన్ని రాత్రిపూట తినవచ్చు. కానీ రిఫ్రిజిరేటర్ లో పెట్టుకుని రోజుల తర్వాత గ్యాస్ తో వేడి చేసిన ఆహారం ఆరోగ్యానికి మంచిది కాదు.
ఉపవాసం..
అజీర్ణంతో బాధపడుతుంటే ఆహారం తినకూడదట. దీనికి బదులుగా ఉపవాసం ఉండటం మంచిదట. అజీర్ణం చేసిందంటే అప్పటికే తీసుకున్న భోజనం సరిగ్గా జీర్ణం కాలేదని అర్థం. దీని వల్ల తరచుగా కడుపు ఉబ్బరం వస్తుంటే భోజనం మానేసి ఎండు అల్లం కలిపిన గోరువెచ్చని నీటిని త్రాగాలి.
ఉష్ణోగ్రత..
తీసుకునే ఆహారం స్థితి ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆహారం పూర్తిగా ఉడికి, వేడిగా ఉండాలి. ఇది త్వరగా జీర్ణమై పోషకాలను అందిస్తుంది.
*రూపశ్రీ
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...