కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’.

 

ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌!

 

 

మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్.

 

ఏం జరుగుతుంది

కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే!

 

ప్రమాదం

కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది.

 

మరేం చేయడం!

- ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట.

 

- ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి.

 

- ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి.

 

- నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి.

 

- వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది.

 

- మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి.

- నిర్జర.