ఎండాకాలం వస్తే చాలు బార్లన్నీ కిటకిటలాడిపోతాయి. చల్లటి బీరుతో గొంతు తడుపుకోవాలని జనాలంతా ఉత్సాహపడిపోతుంటారు. బీరులో నీటి శాతం ఎక్కువ, ఆల్కహాల్ శాతమేమో తక్కువ. కాబట్టి వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు బీరుని మించిన దారి లేదని చాలామంది అభిప్రాయం. ఇదెంత వరకు నిజం!
బీర్‌ని పుచ్చుకోవడం జనాలకి కొత్తేమీ కాదు. వేల ఏళ్ల నుంచి ఈ అలవాటు వస్తున్నదే! అయితే ఒకప్పుడు బీర్ పుచ్చుకునే ఉద్దేశం వేరు. మంచినీటిలో ఉండే సూక్ష్మజీవులని చంపేందుకు అందులో ఓ నాలుగు చుక్కలు ఆల్కహాల్ వేసేవారట. అందులో మహా అయితే .5 శాతం మాత్రమే ఆల్కహాల్ ఉండేది. కానీ ఇప్పడు పరిస్థితి మారిపోయింది. కనీసం 4 నుంచి 5 శాతమన్నా ఆల్కహాల్ లేనిదే బీరు తయారవ్వడం లేదు. బీరు తాగే అలవాటు మాత్రం తగ్గలేదు సరికదా... మంచినీళ్లు, టీ తర్వాత మనుషులు ఎక్కువగా తాగేది బీరే!
బీరులో ఉండే ఆల్కహాల్ వల్ల లివర్ దెబ్బతింటుందన్న విషయం తెలిసిందే! ఇందులో ఆల్కహాల్ శాతం తక్కువే అయినప్పటికీ, గుండెజబ్బుల వంటి సమస్యలు ఉన్నవారికి ఇది తప్పకుండా చేటు చేస్తుందని చెబుతున్నారు. ఇక ఎండాకాలం బీర్ తీసుకోవడం వల్ల డీహేడ్రేషన్ రాదన్నది కూడా ఉత్త మాటే!
మన శరీరంలో anti-diuretic (ADH) అనే హార్మోను ఉంటుంది. మనం తీసుకునే నీరు వీలైనంతవరకూ శరీరంలోనే ఉండేలా ఈ హార్మోను రక్షిస్తుంది. బీరు తాగినప్పుడు ఈ ADH పనితీరు దెబ్బతింటుంది. అందుకే ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఇదంతా బీరులో ఉన్న నీరు వల్ల అనుకుంటారు. కానీ ADH హార్మోను పనితీరు మందగించడం వల్ల అని గమనించలేరు. 200 ఎం.ఎల్ బీరు తాగితే 320 ఎం.ఎల్ నీరు శరీరంలోంచి పోతుందని ఓ అంచనా! అంటే శరీరంలోకి వెళ్లే నీటికంటే, బయటకి వచ్చే నీరే ఎక్కువన్నమాట!
ఎండాకాలం చల్లటి బీరుతో మరో ఇబ్బంది కూడా ఉంది. మన శరీరం ఎప్పుడూ ఒకే తరహా ఉష్ణోగ్రతలో ఉండే ప్రయత్నం చేస్తుంది. ఈ body temperature కంటే దిగువన ఉండే చల్లటి పదార్థాలు శరీరంలోకి చేరినప్పుడు, డీహైడ్రేషన్ సమస్య మరింతగా పెరుగుతుంది. ఇక జలుబులాంటి ఇతరత్రా సమస్యలు సరేసరి!
ఇక మీదట దాహం తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏ మంచినీరో, కొబ్బరినీరో పుచ్చుకోవాలి కానీ మద్యం జోలికి పోవద్దన్నది నిపుణుల మాట. కాదూ కూడదూ అంటే అందుకు తగినంత ఆహారం, నీరు తీసుకోమని సూచిస్తున్నారు.
- నిర్జర.