హోళీకి రసాయనాలతో చేసిన మందులు వాడవద్దు, వీలైనంతవరకూ సహజసిద్ధంగా దొరికే మందులనే వాడండి. పిచికారీ చేసేటప్పుడు జాగ్రత్త, బెలూన్లను వాడవద్దు, పిల్లలని ఓ కంట గమనించుకోండి... అంటూ రకరకాల సూచనలు వినిపిస్తూ ఉంటాయి. మనం వాటిని పాటించినా, నలుగురిలోకి వెళ్లి హోళీ ఆడేటప్పుడు రసాయనాల రంగులతో ముద్ద కాక తప్పుదు. అందుకోసం ఈ జాగ్రత్తలు తీసుకుని తీరాల్సిందే...
ఇలాంటి బట్టలు
హోళీ అడేటప్పుడు పాతబట్టలు వేసుకున్నామో లేదో గమనిస్తామే కానీ... అవి రంగుల నుంచి ఏమేరకు అడ్డుగా నిలుస్తాయో పట్టించుకోము. హోళీ అడేటప్పుడు ఒంటిని వీలైనంత కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. అవి కూడా కాటన్ దుస్తులైతే మరీ మంచిది. ఎందుకంటే పాలిస్టర్ బట్టల మీద పడిన రంగులను అవి పీల్చుకోవు సరికదా... వాటి మీద మరోసారి నీటిని కుమ్మరించగానే ఆ రంగులన్నీ మళ్లీ ఒంటి మీదకి జారతాయి.
శరీరానికి తగినంత తేమ
పొడబారిన చర్మం మీద పడే రంగుల చర్మరోగాలకు దారితీస్తాయి. అందకనే చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అందుకోసం ఒంటినిండా కాస్త నూనెని పట్టించడం మేలు. అది మరీ అతిగా కనిపిస్తుందనుకుంటే... అందుబాటులో ఉన్న మాయిశ్చరైజింగ్ లోషను ఏదన్నా రాసుకోవచ్చు. జుట్టు పాడవకూడదనుకుంటే, తలకి మాత్రం నూనె పట్టించాల్సిందే! ఇక హోళీ ఆడేముందు వీలైనంత మంచినీరు తాగడం వల్ల చర్మం లోపలినుంచి తేమగా ఉంటుంది.
అదే పనిగా తిరగొద్దు
హోళీ ఆడిన తరువాత చాలామంది అవే రంగులతో గంటల తరబడి కాలక్షేపం చేస్తుంటారు. కానీ వీలైనంత త్వరగా ఆ రంగులను వదిలించుకోవడమే మేలంటున్నారు. పైగా ఒంటినిండా రంగులతో ఎండలో కనుక తిరిగితే వాటిలోని రసాయనాలు మన చర్మానికి అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి... హోళీ ఆడిన వెంటనే నేస్తాలకు గుడ్బై చెప్పేసి స్నానం చేసేయమంటున్నారు.
నయనం ప్రధానం
కాపర్ సల్ఫేట్, మెర్యురీ, లెడ్, క్రోమియం.... ఇలా హోళీ రంగుల కోసం వాడే రసాయనాల జాబితా చాలా పెద్దది. ఇవి నోట్లోకి వెళ్లినా, కంట్లో పడినా కూడా హాని జరుగుతుందని వేరే చెప్పనవసరం లేదు. అందుకనే కళ్లజోడు పెట్టుకుని హోళీ ఆడితే మంచిది. అలా కుదరని పక్షంలో కంట్లో ఏవన్నా రంగులు పడినప్పుడు, వెంటనే వీలైనంత నీటితో కంటిని కడుక్కోవాలి. కళ్లని శుభ్రం చేసుకున్న తరువాత కూడా కళ్లు మండుతున్నా, కళ్ల వెంబడి నీరు కారుతున్నా, దృష్టి మసకగా ఉన్నా... వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాల్సిందే!
స్నానం ఇలా
హోళీ ముగిసిన తరువాత చేసే స్నానం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒంటి మీద పడిన రంగులను తక్షణం శుభ్రం చేసుకునేందుకు చాలామంది పెట్రోల్, కిరసనాయిల్ వంటి పదార్థాలు వాడతారు. వీటితో చర్మం మరింత పొడిబారిపోతుంది. వీలైతే మామూలు సబ్బుతో కాకుండా పిల్లల సబ్బుతో రుద్దుకోవడం మంచిదంటారు. స్నానం ముగిసిన తరువాత కూడా మరోసారి ఒంటికి మాయిశ్చరైజింగ్ లోషను పట్టిస్తే మరీ మంచిది.
- నిర్జర.