ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆ ఆటలలో అలసిపోతే కాస్త దాహం తీర్చుకోవాలని ఎందుకనిపించదు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఆటల మధ్యలో అలసట కలిగితే దాహం తీర్చుకునేందుకు స్పోర్ట్స్ డ్రింక్స్ అందుబాటులోకి వచ్చేశాయి. మోజుతోనో, దాహం తీరుతుందన్న నమ్మకంతోనో వీటిని తాగేవారి సంఖ్య ఎక్కువైపోతోంది. కొన్నాళ్లు పోతే కూల్‌డ్రింక్స్ తాగినంత తేలికగా స్పోర్ట్స్ డ్రింక్స్ తాగే రోజులు వచ్చేస్తాయి. ఇంతకీ వీటి వల్ల ఉపయోగమేనా అంటే... కొంచెం ఆలోచించాల్సిందే మరి!
- అధికంగా వ్యాయామం చేసినప్పుడో, ఆటలు ఆడినప్పుడో... అలసిపోయేవారి శరీరంలో తిరిగి కావల్సిన నీటిని, శక్తిని అందించడమే ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ లక్ష్యం. కానీ అలా తీవ్రంగా అలసిపోయే ప్రొఫెషనల్ ఆటగాళ్లకి మాత్రమే ఈ పానీయాలు ఉపయోగపడతాయనీ, మిగతావారికి అనవసరమనీ హెచ్చరిస్తున్నారు నిపుణులు.
- అధిక శక్తిని ఇచ్చేందుక స్పోర్ట్స్ డ్రింక్స్‌లో మోతాదుకి మించి చక్కెర పదార్థాలు ఉంటాయి. ఈ చక్కెర వల్ల పళ్లు దెబ్బతినడం ఖాయమంటున్నారు నిపుణులు. ఒక పరిశోధన ప్రకారం, ఈ పానీయాలు తాగినవారిలో దాదాపు 98 శాతం మంది పంటి పై పొర దెబ్బతిన్నట్లు తేలింది. పంటి పై పొర దెబ్బతింటే అది తిరిగి సరికావడం అంటూ ఉండదు. అంటే స్పోర్ట్స్ డ్రింక్స్ వల్ల పంటికి శాశ్వతమైన నష్టం కలుగుతుందన్నమాట.
- వీటిలోని అధిక చక్కెరల వల్ల త్వరగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉందని తేలింది. వ్యాయామం వల్ల కోల్పోయే శక్తికంటే వీటి నుంచి లభించే శక్తి అధికంగా ఉండటంతో, అదంతా కొవ్వు కిందకి పేరుకుకోవడం సహజమే కదా!
- పెద్దల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే ఇక పిల్లల సంగతి చెప్పేదేముంది! ఈ స్పోర్ట్స్ డ్రింక్స్‌కి అలవాటు పడిన పిల్లలో 90 శాతం మంది పిల్లల పళ్లు దెబ్బతినిపోయినట్లు తేలింది. పైగా ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ తియ్యగా ఉండటంతో పిల్లలకి ఇది ఒక వ్యసనంలా తయారవుతోందట.
- వ్యాయామం చేసేటప్పుడు శరీరం నుంచి కొంత నీరు చెమట రూపంలో బయటకి పోవడం మంచిదే! కానీ స్పోర్ట్స్ డ్రింక్స్‌లో ఉండే సోడియం, పొటాషియం వంటి పదార్థాల వల్ల ఇలా శరీరం నుంచి మలినాలు బయటకు పోకుండా ఉండిపోతాయి.
- స్పోర్ట్స్ డ్రింక్స్ చల్లగా తియ్యగా ఉండటంతో కాస్త తాగగానే దాహం తీరినట్లు అనిపిస్తుందే కానీ, శరీరానికి అవసరమైన నీరు లభించదు. దీంతో శరీరానికి తగినంత నీటిని అందించడం అనే అసలైన లక్ష్యం నెరవేరకుండా పోతుంది.
- ఈ పానీయాలలో సోడియం నిల్వలు మోతాదుకి మించి ఉంటాయి. మన రోజువారీ ఆహారంలో తీసుకునే సోడియం (ఉప్పు) శాతమే ఎక్కువగా ఉందంటూ వైద్యులు గోలపెడుతున్నారు. వాటికి ఈ స్పోర్ట్స్ డ్రింక్స్ కూడా తోడైతే ఇక చెప్పేదేముంది. ఇలా స్పోర్ట్స్ డ్రింక్స్‌ని అధికంగా తీసుకోవడం వల్ల వాటిలో ఉండే సోడియం అధిక రక్తపోటుకీ, గుండెజబ్బులకీ దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
- స్పోర్ట్స్ డ్రింక్స్‌లో చక్కెర, సోడియం, పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ వంటి పదార్థాలే కానీ విటమిన్లు, ఖనిజాల వంటి పోషక పదార్థాలు ఉండవు. అందుకని శరీరానికి శక్తి లభిస్తుందన్న మాటే కానీ బలం చేకూరదు.
వీటన్నింటివల్లా... సాధారణ వ్యాయామం చేసేవారికి స్పోర్ట్స్ డ్రింక్స్ వల్ల పెద్దగా ఉపయోగం లేదనీ... వాటికంటే మంచినీరు, పాలు, కొబ్బరిబోండాలు, పళ్లరసాలు తీసుకోవడం మేలనీ అర్థమవుతోంది. గంట లోపల వ్యాయామం చేసేవారు కాస్త మంచినీరు పుచ్చుకుంటే సరిపోతుందని మేయో క్లినిక్ వంటి సంస్థలు సైతం సూచిస్తున్నాయి.
- నిర్జర.