పూర్వకాలం నుండీ పెద్దవాళ్ళు పలుకుతున్నట్లు “నవ్వి, బాగుపడండి" అనే మాటను నేటి వైద్య మానసిక శాస్త్రాలు సమర్థిస్తున్నాయి. అది వ్యర్థమైన మాటకాదు. మానసిక బాధల వలనో, శరీర బలహీనత వలనో బిగ్గరగా నవ్వే దృక్పధం కొందరికి లేకపోవచ్చు. ఇది ఒక లోపం అనుకోవచ్చు. ఆధునిక  వైద్య శాస్త్రం ప్రకారం నవ్వలేని మనిషిని ఏదో రోగం ఆవరించి వుందనుకోవాలి. ఏదో ఒక అనిశ్చలత అతని ఎదలో దాగుడుమూతలాడుతుంటుంది. నవ్వుతూ ఆనందంగా కాలక్షేపం చేయలేని వ్యక్తి సాంఘిక జీవితంలో చెప్పుకోదగ్గ ఫలితాలు తేలేడు.

పారిస్ నగరంలో వివసించే మనో విజ్ఞాన శాస్త్ర నిపుణుడు డాక్టరు పియరీ వాచెట్ ఇలా అన్నారు. “నవ్వు బలమైన ఉత్ప్రేరణలు కలుగజేస్తుంది. అందువలన నరాలు సడలి వ్యక్తి యొక్క శరీరావస్థలో మార్పు వస్తుంది. ఆయన కొన్నాళ్లు. నవ్వు వలన దేహానికి కలిగే లాభాలను గూర్చి వివరించే ఒక తరగతి ప్రారంభించారు. నవ్వు ఒక అంటువ్యాధి వంటిది, అది అందరినీ ఇట్టే మార్చివేస్తుంది. సామూహికంగా ప్రజల మనో ప్రవృత్తిని నవ్వు ద్వారా మార్పు చెందినవచ్చు. మన శరీర మానసిక ఆవేశాలు సడలింపబడటం వల్ల మాత్రమే మన హృదయానికి ఆనందం కలుగుతుంది. మనకు నవ్వు తెచ్చే ఈ ఆనందం  వలన నవ్వుతాము. నవ్వుతాము కాబట్టి మనకు ఆనందం కలుగుతుంది.

రోగం బాగా ముదిరి మరణావస్థలో వున్న ఒక బాలుడు ఇంకా నవ్వుతూనే వున్నాడు. అప్పుడు అతడు బ్రతికి బయటపడే అవకాశాలున్నాయని ఒక వైద్యుడు సాక్షమిచ్చాడు. పెద్దలు పై పైకి నవ్వవచ్చు గానీ చిన్న పిల్లలు దొంగ నవ్వులు నవ్వలేరు గదా! పిల్లలు యదార్థంగా పరిస్థితిని బట్టి ప్రవర్తిస్తారు. రోగగ్రస్తుడైవ బాలుడు ఇంకా నవ్వగల్గితే సగం జబ్బు నయమైనట్లే.

డాక్టరు జి. డబ్ల్యు, నేరెంటీన్ ఫ్రెంచి దేశపు మనో శాస్త్రవేత్త. పిల్లలలో నవ్వు అనే అంశంపై కుణ్ణంగా పరిశీలన చేసి నవ్వు వారి రోగాలను పోగొడుతుందని ధృణీకరించాడు. ప్రధమంగా పసిబిడ్డ చిరునవ్వు నవ్వటం ద్వారా తన ఆనందాన్ని, ఆరోగ్య స్థితిని తెలియజేస్తాడు. పన్నెండు వారాలు పూర్తి కాగానే శిశువులు బిగ్గరగా నవ్వటం ప్రారంభిస్తారు. ఆరు రోజుల ప్రాయం నుండే చిరునవ్వులు నవ్వుతారు. వయస్సు ఎక్కువగల బిడ్డ బిగ్గరగా నవ్వటానికి, కొన్ని దినాల వయస్సుగల బిడ్డ చిరునవ్వు మాత్రమే నవ్వటానికి గల కారణం ఆరోగ్య స్థితిలో మెరుగు కావటం కాదు.  అది మనో అభివృద్ధి. మూడు నెలల వయసులో  కొన్ని ఉచ్ఛారణలు, శబ్దాలు తనకిష్టమని తెల్పుతూ బిడ్డ నవ్వుతాడు. తన ఆనందాన్ని తృప్తిని అలా నవ్వు ద్వారా వెల్లడి చేస్తాడు.

ప్రారంభదశ నుండి మాటలు ఎట్లా అభివృద్ధి అవుతాయో అట్లే నవ్వు కూడ అభివృద్ధి చెందుతూ వుంటుంది. మాటలతో ఎలా మరొకరికి మన భావాలు తెల్పుతామో అట్లే.. నవ్వడం  ద్వారా శిశువు తన భావాలు తెలియజేయగల్గుతాడు.. ఇలా నవ్వు మన ఆరోగ్యానికి, మానసిక మెరుగుదలకు ఒక గొప్ప ఔషదమవుతుంది.

                                    ◆నిశ్శబ్ద.