భారతదేశంలో డయాబెటిస్ ఉన్నవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 45 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 20% మంది దీని బారిన పడ్డారు. దీని అర్థం భారతదేశంలో 50 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటిస్ కలిగి ఉన్నారు. అయితే డయాబెటిస్ ఉంది కదా అని కొన్ని సంతోషాలు వదిలేసుకోలేం. వాటిలో పండుగ నాడు తీసుకునే ఆహారం ప్రథమ స్థానంలో ఉంటుంది. సాధారణ రోజుల్లో నోరు కట్టేసుకున్నా.. పండుగ రోజుల్లో మాత్రం తప్పనిసరిగా నోటికి రుచులతో వింధు చేయాల్సి వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు ఆహారం తీసుకునే విషయంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటిది ఏకంగా స్వీట్లు తినాలి,  ఆరోగ్యం పాడవ్వకూడదు అంటే కొన్ని చిట్కాలు పాటించాలి.  అవేంటో తెలుసుకుంటే..

షుగర్  షాక్..

దీపావళి వంటి పండుగల సమయంలో ఇంట్లో చాలా స్వీట్లు ఉంటాయి. రసగుల్లా, గులాబ్ జామున్ లేదా లడ్డులో చక్కెర,  నెయ్యి ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలు శరీరంలోకి గ్లూకోజ్‌ను త్వరగా విడుదల చేస్తాయి, దీనివల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది.  డయాబెటిస్ ఉన్నవారిలో ఇది ఇన్సులిన్ సమతుల్యతను దెబ్బతీస్తుంది.

ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తే, మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర స్థాయిలు పండుగల సమయంలో 20-30% పెరుగుతాయి. స్వీట్లతో పాటు, వేయించిన చిరుతిళ్లు,  ఒత్తిడి కూడా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే ముందుగానే ప్లాన్ చేసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు.

పండుగ సందర్భంలో స్వీట్లు తినే మార్గం..

ఆరోగ్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేయకుండా రుచికరంగా ఉండే విధంగా స్వీట్లు  తినడం ముఖ్యం. దీనికి ఉత్తమ మార్గం మితంగా స్వీట్లు తినడం. ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు.  స్వీట్లు తినడం  కోసం ఒక నిర్దిష్ట సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. వాటిని తినడానికి ముందు తగినంత ప్రోటీన్,  ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంటే  సలాడ్ లాంటివి  తిన్న తర్వాత కొద్దిగా స్వీట్లు తినవచ్చు.

స్వీట్లు తినడానికి మంచి చిట్కాలు..

ఖాళీ కడుపుతో స్వీట్లు తినకూడదు..

ఖాళీ కడుపుతో స్వీట్లు తినడం వల్ల గ్లూకోజ్ త్వరగా రక్తప్రవాహంలోకి విడుదలై చక్కెర పెరుగుదలకు కారణమవుతుంది. కడుపులో కొంత ప్రోటీన్ లేదా ఫైబర్ ఉన్నప్పుడు స్వీట్లు తింటే చక్కెర నెమ్మదిగా విడుదల అవుతుంది.

భోజనంలో ముందుగా స్వీట్లు తినకూడదు..

ప్రధాన భోజనానికి ముందు స్వీట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర వేగంగా పెరుగుతుంది. కూరగాయలు, పప్పులు లేదా సలాడ్లు ముందుగా తినడం వల్ల గ్లూకోజ్ శోషణ నెమ్మదిస్తుంది.

ఒకేసారి ఎక్కువ స్వీట్లు తినకూడదు..

ఎక్కువ తీపి పదార్థాలు తినడం వల్ల ఇన్సులిన్ పై అకస్మాత్తుగా ఒత్తిడి పడుతుంది. శరీరం దానిని నియంత్రించలేకపోతుంది.  చక్కెర స్థాయిలు వేగంగా పెరుగుతాయి.

భోజనానికి ముందు ప్రోటీన్, ఫైబర్ తినాలి..

ప్రోటీన్,  ఫైబర్ చక్కెర శోషణను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెర పెరుగుదలను తగ్గిస్తాయి.  ఇన్సులిన్ బాగా పనిచేయడానికి సహాయపడతాయి.

కొవ్వు తక్కువగా ఉండే స్వీట్లను ఎంచుకోవాలి..

డ్రైఫ్రూట్స్,  స్వచ్ఛమైన నెయ్యితో తయారు చేసిన స్వీట్లు వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు చక్కెరను నెమ్మదిగా రక్తప్రవాహంలోకి విడుదల చేస్తాయి. అకస్మాత్తుగా  చక్కెర పెరగడాన్ని నివారిస్తాయి.

కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు వద్దు..

కొవ్వు లేకుండా చక్కెర మాత్రమే ఉన్న స్వీట్లు రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతాయి. ఇది ఇన్సులిన్ నిరోధకత,  బరువు పెరగడానికి దారితీస్తుంది.

కృత్రిమ తీపి పదార్థాలు కలిగిన స్వీట్లు వద్దు..

కృత్రిమ తీపి పదార్థాలు కొంతమందిలో గ్లూకోజ్ జీవక్రియను ప్రభావితం చేస్తాయి. సహజమైన,  తక్కువ చక్కెర కలిగిన స్వీట్లు మంచివి.

పడుకునే ముందు స్వీట్లు తినకూడదు..

రాత్రిపూట రక్తంలో చక్కెర తక్కువగా ఉంటుంది. రాత్రి స స్వీట్లు తినడం వల్ల ఉదయం హైపర్గ్లైసీమియా వస్తుంది. నిద్రలో ఇన్సులిన్ స్థాయిలు  సరైనవి కావు.

భోజనం తర్వాత 1 టీస్పూన్ వెనిగర్ తీసుకోవాలి..

 ఎక్కువగా స్వీట్లు తిన్నట్లయితే.. తిన్న తర్వాత అర కప్పు నీటిలో ఒక టీస్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ కలిపి త్రాగాలి. ఇది రక్తంలో చక్కెర వేగంగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా మెరుగుపరుస్తుంది.

                        *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...