బడులు తెరిచేశారు. చదువుల పండుగ మొదలైంది. కొత్త పుస్తకాలు కొనుక్కోవడం, వాటికి అట్టలు వేసుకోవడం, యూనిఫారాలను సిద్ధం చేసుకోవడం... ఇవన్నీ తల్లిదండ్రులు దగ్గరుండి సాగించే క్రతువులు. ఇంట్లో పిల్లలను మనం కంటికి రప్పలా కాపాడుకుంటాం. కానీ బడిలో వారు ఎలా ఉంటున్నారో, ఎలాంటి అనారోగ్యాలను కొనితెచ్చుకుంటున్నారో గమనిస్తూ ఉండటం ఏమంత తేలిక కాదు. అసలే పిల్లలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. ఎలాంటి వ్యాధినైనా ఇట్టే పట్టేసుకుంటారు. పిల్లలకు జబ్బు చేస్తే వారికే కాదు, కన్నవారికీ బాధే. అందుకని బడిలో కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరం.

 

- బడులు మొదలవుతూనే వర్షాకాలం కూడా మొదలవుతుంది. ఈ కాలంలో జలుబూ, దగ్గు వంటి అంటువ్యాధులు అతిసాధారణంగా ఒక పిల్లవాడి నుంచి మరో పిల్లవాడికి చేరిపోతాయి. కాబట్టి పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గకుండా చూసుకోవాలి. చ్యవన్‌ప్రాస్, పాలు, బాదం పప్పు, ఆకుకూరలు, పండ్లు వంటి బలవర్ధకమైన ఆహారం మీద మరింత దృష్టి పెట్టాలి.

 

- పిల్లలకి కర్చీఫ్‌ వాడటాన్ని తప్పకుండా అలవాటు చేయాలి. తాము దగ్గేటప్పుడో, ఎదుటివారు దగ్గేటప్పుడో కర్చీఫుని నోటి అడ్డం పెట్టుకోమని గుర్తు చేయాలి. చేతిరుమాలుని బడిసంచిలో కాకుండా జేబులోనే ఉంచుకునే అలవాటు కలిగించాలి.

 

- అన్నం తినేముందరా, ఆటలాడుకున్న తరువాతా, మూత్ర విసర్జన చేశాకా.... శుభ్రంగా చేతులు కడుక్కోమని చెప్పాలి. చేతులు కడుక్కోవడం అంటే అంటురోగాలను సగానికి సగం దూరం చేసుకోవడం అన్న నమ్మకాన్ని కలిగించాలి.

 

- పిల్లవాడికి కండ్ల కలక ఉంటే బడికి పంపకపోవడమే మేలు. ఒకవేళ బడిలో కండ్ల కలకలు ఉంటే... చేతులు తరచూ శుభ్రం చేసుకోమనీ, వీలైనంతవరకూ చేతులతో కంటిని తాకవద్దనీ హెచ్చరించాలి.

 

- పిల్లలకి చర్మవ్యాధులు చాలా సులభంగా అంటుకుంటాయి. ఇతర పిల్లల ద్వారాగానీ, మట్టిలో ఆడుకునే అలవాటు వల్లగానీ ఈ వ్యాధులు రావచ్చు. కాబట్టి సాక్స్‌తో సహా పిల్లల దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి. వారు స్నానం చేసేటప్పుడు చర్మవ్యాధులకు సంబంధించిన కురుపులు కానీ, దద్దుర్లు కానీ ఉన్నాయేమో గమనించుకోవాలి.

 

- పిల్లల్లో ఫ్లూ, ఆటలమ్మ తదితర టీకాలు వేయించారో లేదో గమనించుకోవాలి. ఒకవేళ ఇప్పటివరకూ సంబంధిత టీకాలను వేయించకపోతే వెంటనే వైద్యుని సంప్రదించాలి. దాని వల్ల బడిలోని ఇతర పిల్లల నుంచి అంటువ్యాధులు సోకకుండా నివారించవచ్చు.

 

- పిల్లలకి నీళ్ల బాటిళ్లను కరచుకుని తాగే అలవాటు ఉంటుంది. ఇలాంటి అలవాటు వల్ల కూడా అంటువ్యాధులు వ్యాపించవచ్చు. అందుకని ఎవరి నీళ్ల బాటిల్ వారే వాడుకోమని పిల్లలను హెచ్చరించాలి.

 

- పిల్లలను దింపడానికి వెళ్లేటప్పుడు బడిలోని నీటి లభ్యతా, టాయిలెట్ల సౌకర్యం సరిగా ఉందో లేదో ఓ కన్ను వేయాలి. అపరిశుభ్రమైన పరిసరాలు, సౌకర్యాలూ ఉంటే వాటిని బడి యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లేందుకు జంకకూడదు.

 

- పిల్లవాడు కొత్తబడిలో చేరిఉంటే వీటికి అదనంగా అతని మానసిక ఇబ్బందులను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కొత్తబడిలోని వాతావరణానికి అతను అలవాటుపడేవరకూ అతనికి అండగా ఉండాలి.

 

- నిర్జర.