ఒకప్పుడు నూటికో కోటికో ఊబకాయం అనే మాట వినిపించేది. ఎవరన్నా మరీ లావుగా ఉంటే వాళ్లు సంపన్నులన్నా అయి ఉండాలి లేకపోతే ఏదన్నా వ్యాధితోనన్నా బాధపడుతూ ఉండాలి అనుకునేవారు. కానీ ఇప్పుడు ఊబకాయం ఇంటింటి మాట. లెక్కలు తీస్తే మూడింట రెండు వంతులమంది తలకు మించి ‘భారం’తో కనిపిస్తున్నారు. ఇలాంటి ఊబకాయానికి ముఖ్యకారణం ఏమిటో, దానికి నివారించడం ఎలాగో తేలిపోయిందంటున్నారు పరిశోధకులు.
కేలిఫోర్నియా విశ్వవిద్యాలయంలోని శాస్త్రవేత్తలు చేసిన పరిశీలనలో తేలిందేమిటంటే... పాశ్చాత్యుల తరహా తిండితో ఊబకాయపు సమస్య ఎక్కువయ్యే ప్రమాదం ఉందట. విపరీతమైన కొవ్వు, చక్కెరలతో కూడిన ఈ ఆహారంతో ఒంట్లో వృధాగా కెలోరీలు పేరుకుపోవడం మాట అటుంచితే, ఇలాంటి ఆహారంతో మరో సమస్య కూడా ఉన్నట్లు బయటపడింది. మన శరీరంలోని peripheral endocannabinoid signalling అనే వ్యవస్థని ఈ ఆహారం విపరీతంగా ప్రభావితం చేస్తోందట. ఆహారం తీసుకోవడం, శరీరంలోని తగినంత శక్తి ఉందా లేదా అన్నది గమనించుకోవడం వంటి చర్యలకు ఈ వ్యవస్థే కారణం.
ఈ వ్యవస్థ మీద పాశ్చాత్య ఆహారం ప్రభావం చూపడం వల్ల మనం ఏం తింటున్నామో ఎంత తింటున్నామో తెలియకుండా పోతుందట. ఈ విషయంలో ఎంతవరకూ వాస్తవం ఉన్నదో గ్రహించేందుకు సదరు పరిశోధకులు కొన్ని ఎలుకల మీద ఓ ప్రయోగం చేశారు. ఇందులో భాగంగా కొన్ని ఎలుకలకు కొవ్వు, చక్కెరలు తక్కువగా ఉండే ఆహారాన్ని అందించారు. మరికొన్ని ఎలుకలకు పాశ్చత్య తరహా ఆహారాన్ని తినిపించారు. పాశ్చాత్య ఆహారానికి అలవాటుపడిన ఎలుకలు hyperphagia అనే లక్షణాన్ని ప్రదర్శిస్తున్నాయని తేలింది. ఆహారాన్ని ఎక్కువగా, అది కూడా ఆబగా తొందర తొందరగా తీసుకోవడమే ఈ hyperphagia.
endocannabinoid signallingని సరిదిద్దేందుకు ఇప్పటికే మందులు మార్కెట్లో ఉన్నాయి. వీటి వల్ల ఆహారాన్ని అతిగా, ఆబగా తీసుకోవడం అనే అలవాటు తగ్గేమాట వాస్తవమే! అయితే ఈ మందులు కేవలం జీర్ణవ్యవస్థకు మాత్రమే పరిమితం కాలేదు. నేరుగా మెదడు మీద కూడా ప్రభావం చూపుతున్నాయని తేలింది. తద్వారా ఊబకాయం మాట అటుంచి, లేనిపోని మానసిక సమస్యలు తలెత్తసాగాయి. అయితే తాజా పరిశోధన ద్వారా కేవలం జీర్ణవ్యవస్థ మీద మాత్రమే ప్రభావం చూపగల కొన్ని మందులను కనుగొన్నారు. వీటివల్ల ఎలాంటి దుష్ప్రభవాలూ లేకుండా ఊబకాయం నుంచి విముక్తులం కావచ్చునని చెబుతున్నారు. మరి ఆ మందులు మనకు అందుబాటులోకి రావాలంటే కొద్దికాలం ఆగాల్సిందే! అప్పటివరకూ పాశ్చత్యుల తరహా జంక్‌ఫుడ్‌కి కాస్త దూరంగా ఉంటే సరి!
- నిర్జర.