ఇప్పటి తరానికి ఆయిల్ పుల్లింగ్ అంటే తెలుసో లేదో కానీ, ఓ ఇరవైఏళ్ల క్రితం ఇది ఇంటింటిమాటగా ఉండేది. అప్పట్లో ఆయిల్ పుల్లింగ్ ప్రయత్నించని వారు అరుదుగా కనిపించేవారు. ప్రతి ఇంట్లోనూ ఆయిల్ పుల్లింగ్కి సంబంధించిన చిన్నా చితకా పుస్తకాలు కనిపించేవి. ఇంతకీ ఆయిల్ పుల్లింగ్ పనిచేస్తుందా?

 

మనదే! మనదే!

అయిల్ పుల్లింగ్ అనే ప్రక్రియ మూలాలు ఆయుర్వేదంలో కనిపిస్తాయి. నోటిపూత, నోరు పొడిబారిపోవడం వంటి సమస్యలకు నువ్వులనూనెను కొద్ది నిమిషాల పాటు పట్టి ఉంచడమో, పుక్కిలించడమో చేయమని సూచించేవారు. ఆయుర్వేదంలో ఒక తరహా చికిత్సకు మాత్రమే పరిమితమైన ఈ ప్రక్రియను పూర్తిస్థాయి వైద్యంగా తిరిగి 1990వ దశకంలో వెలికితెచ్చారు కొందరు ఔత్సాహికులు.

 

సర్వరోగనివారిణి?

ఆయుర్వేదంలో ఆయిల్ పుల్లింగ్ ప్రక్రియను నువ్వులనూనెతో, అది కూడా కొన్ని సందర్భాలలో మాత్రమే ఉట్టంకించారు. కానీ రక్తపోటు మొదలుకొని కేన్సర్ వరకూ ఎలాంటి రోగమైనా ఆయిల్ పుల్లింగ్తో నయం అయిపోతుందన్న ప్రచారం మొదలైంది. రోజూ ఓ ఇరవైనిమిషాలసేపు ఆయిల్ పుల్లింగ్ చేస్తే మొదటి రోజు ఈ ఫలితం వస్తుంది, రెండో రోజు ఆ ఫలితం వస్తుంది అంటూ గణాంకాలు చెలరేగిపోయాయి. దాదాపు 30 రకాల రోగాలను ఆయిల్ పుల్లింగ్తో చటుక్కున నయం చేయవచ్చన్న మాటలు వినిపించసాగాయి. ఇదే సమయంలో ఇళ్లలో రిఫైన్డ్ ఆయిల్స్ వాడకం ఎక్కువ కావడంతో ఇంటింటా ఆయిల్ పుల్లింగ్ కనిపించేది.

 

పనిచేస్తుందా!

 

ఆయిల్ పుల్లింగ్ ప్రచారకుల వాదన ప్రకారం మన నోట్లో నానారకాల బ్యాక్టీరియా నివసిస్తూ ఉంటుంది. ఆయిల్ పుల్లింగ్తో ఈ హానికారక క్రిములు నశించిపోతాయి. అంతేకాదు, కాసేపు అలా పుక్కిలిస్తూ ఉండటంవల్ల శరీరంలోని విషరసాయనాలన్నీ (టాక్సిన్స్) నూనెలోకి వచ్చి చేరతాయి. తద్వారా శరీరంలోని రోగాలన్నీ నిదానంగా తగ్గిపోతాయి.

 

వాస్తవం ఏమిటి!

 

మిగతా వైద్య విధానాలతో పోల్చుకుంటే ఆయిల్ పుల్లింగ్ మీద జరిగిన పరిశోధనలు తక్కువ. ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల నోటి ఆరోగ్యం (ఓరల్ హైజీన్) కాస్తో కూస్తో మెరుగుపడుతుందని ఈ పరిశోధనల్లో తేలింది. కొబ్బరినూనె, నువ్వులనూనెలతో పుల్లింగ్ చేసినప్పుడు నోటి దుర్వాసన, పంటి గార, చిగుళ్ల నుంచి రక్తం వంటి సమస్యలు తగ్గినట్లు వెల్లడైంది. అంతేకానీ శరీరంలోని ఇతరత్రా సమస్యల మీద ఇది పెద్దగా ప్రభావం చూపలేదని పరిశోధకులు పెదవి విరిచారు. పైగా ఆయిల్ పుల్లింగ్తో పోలిస్తే మౌత్వాష్తో పుక్కిలించడం, రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడం వంటి చర్యలు మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయని తేల్చారు.

 

మరేం చేయడం!

 

శాస్త్రీయంగా ఆయిల్ పుల్లింగ్ ప్రభావానికి సంబంధించి అంతగా ఫలితాలు వెల్లడవనప్పటికీ, ఈ ప్రక్రియ పనిచేస్తుందని నమ్మేవారి సంఖ్య తక్కువేమీ కాదు. ఆయిల్ పుల్లింగ్తో కనీసం నోరన్నా శుభ్రపడుతుంది కాబట్టి ఇది హానికరం అని చెప్పలేం. అలాగని అద్భుతాలు సాధిస్తుందని గుడ్డిగా నమ్మడానికీ లేదు. తీవ్రమైన వ్యాధులు ఉన్నవారు తమ సమస్యలు ఆయిల్ పుల్లింగ్తో తీరిపోతాయనుకుంటే కష్టమే! పైగా ఆయిల్పుల్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తూ దానిని మింగేస్తే వాంతులు, విరేచనాలతో పాటుగా ఊపిరితిత్తుల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది.

- నిర్జర.