ఒకప్పుడు సముద్రంలో ప్రయాణాలు చేసే నావికులు ఆకాశంలోని చుక్కల సాయంతోనే ముందుకు సాగేవారు. రాత్రిపూట నేల మీద సంచరించే బాటసారులు సైతం ఆకాశాన్ని చూసి సమయాన్ని, రుతువునీ చెప్పగలిగేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరం మనిషికి లేకపోయింది. చిన్న చిన్న పడవుల్లో కూడా ఇప్పుడు జీపీఎస్‌ సిస్టంలు వచ్చేశాయి. ఇక నేల మీద ఉండే మనిషి తల ఎత్తి ఆకాశాన్ని చూడటమే మానేశాడు. ఇప్పుడు ఆకాశం కూడా వెలుగుల మయం అయిపోతోంది. నాగరికత పుణ్యమా అని చీకటి రాత్రులు కృత్రిమ వెలుగులతో నిండిపోతున్నాయి. కానీ ఈ స్థితి శృతి మించిపోతోందనీ, కాంతి కాలుష్యానికి దారి తీస్తోందని శాస్త్రవేత్తలు ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్నారు.

 

కాంతి కాలుష్యం వల్ల జీవవైవిధ్యానికి (బయో డైవర్సిటీ) ముప్పు వాటిల్లుతుందన్నది తెలిసిందే! గూళ్లకు చేరుకునే పక్షులు, రాత్రిపూట సంచరించే జీవులు, చెట్టూచేమా, సముద్ర జీవులూ, కోరల్‌ రీఫ్స్‌... వీటన్నింటికీ లెక్కలేనంత నష్టం జరుగుతోందని చెబుతున్నదే! కానీ తన దాకా వస్తేకానీ పట్టిచుకోని మనిషికి... ఈ కాంతి కాలుష్యం తన దాకా వచ్చేసిందని ఇప్పుడు తేలింది. ఈ విషయమై ఐరోపాలో జరుగుతున్న కొన్ని పరిశోధనలు, మనిషి ఆరోగ్యం మీద కాంతి కాలుష్యం తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని తేల్చి చెబుతున్నాయి.

 

మనిషి మీద కాంతి కాలుష్య ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్న వాస్తవాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. వీరి అంచనా ప్రకారం ప్రపంచంలో దాదాపు మూడో వంతు మంది కృత్రిమ కాంతి వల్ల, రాత్రిపూట పాలపుంతని సైతం చూడలేకపోతున్నారట. ఇక ఉత్తర అమెరికాలో అయితే 80 శాతం మంది ఈ దురదృష్టానికి నోచుకుంటున్నారు. రాత్రిపూట నక్షత్రాలని చూసి ఆస్వాదించలేకపోవడం, ఖగోళ శాస్త్రవేత్తలు పరిశోధనలని సాగించలేకపోవడం అటుంచితే.... కాంతి కాలుష్యం మన స్పందనల మీద ప్రభావం చూపుతుందన్నది పరిశోధకుల వాదన.

 

పరిశోధకులు చెబుతున్నదాని ప్రకారం మన శరీరంలో `circadian rhythm’  అనే వ్యవస్థ ఉంటుంది. ఇది ఒక రకంగా జీవగడియారం వంటిదన్నమాట. బయట ఉన్న వెలుతురు, వేడి ఆధారంగా ఇది శరీరానికి అవసరమైన సూచనలు చేస్తుంది. కాంతి కాలుష్యం ఈ సర్కేడియన్‌ రిథమ్‌ మీద ప్రభావం చూపుతుందంటున్నారు. దాంతో నిద్రలేమి, మానసిక క్రుంగుబాటు మొదలుకొని క్యాన్సర్‌, గుండెజబ్బుల వరకూ మన మీద దాడి చేసే అవకాశం ఉందట. మన శరీరంలో పదిశాతానికి పైగా జన్యువులను ఈ సర్కేడియన్‌ రిథమ్‌ ప్రభావితం చేస్తుంది కాబట్టి, శాస్త్రవేత్తలు చెబుతున్న విషయాలని నమ్మక తప్పదు.

 

ఇన్ని నష్టాలకు కారణమైన కాంతికాలుష్యం నుంచి ప్రపంచాన్ని తప్పించడానికి శాస్త్రవేత్తలు చాలా సూచనలే చేస్తున్నారు. అవసరం లేని చోట్ల లైట్లు వేయడం తగ్గించుకోవాలనీ, ఆర్భాటం కోసం విద్యుత్తుని వెలిగించకూడదనీ సలహా ఇస్తున్నారు. వీధి దీపాలు కూడా నేల వైపు వెలుగులు ప్రసరించేలా చూడాలని కోరుతున్నారు. ఇవన్నీ ఏ ఒక్కరో ఆచరిస్తే సాధ్యమయ్యేవి కావు. పౌరులను బెదిరించి సాధ్యం చేసుకునేవీ కావు. కాంతి కాలుష్యాన్ని తగ్గించాలన్న స్పృహ వ్యక్తిగత విచక్షణతోనే సాధ్యపడుతుంది. అప్పటిదాకా రాత్రివేళల్లో బయట నుంచి వచ్చే కాంతి నుంచి కాపాడుకునేందుకు మందపాట కిటికీ తెరలను తెచ్చుకుందాం!

 

- నిర్జర.