
శరీరంలో కఫం పేరుకుపోవడం వల్ల చాలామంది నిత్య జీవితంలో ఎన్నో రకాల శ్వాసకోశ ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మారుతున్న కాలం, వాతావరణంలో వచ్చే మార్పులు, వివిధ రకాల అలర్జీల కారణంగా ముక్కు దిబ్బడ, గొంతులో గరగర, ఛాతీలో కఫం గడ్డకట్టుకోవడం వంటి సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్లో లభించే రకరకాల మందులు, యాంటీబయోటిక్స్ వాడుతుంటారు. వీటి వల్ల తాత్కాలికంగా ఫలితం కనిపిస్తుంది కానీ దీర్ఘకాలంలో ఆరోగ్యానికి హాని కలుగుతుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, మన ఇంట్లోనే దొరికే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకునే పానీయం తాగడం వల్ల ఈ సమస్యను శాశ్వతంగా తగ్గించుకోవచ్చు. ఇంతకూ ఈ పానీయం ఏమిటి? దాన్ని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు ఏమిటి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కఫం..
మన శరీరంలో కఫం అనేది ఊపిరితిత్తులు, గొంతు, సైనస్ లేదా ముక్కు భాగాల్లో ఎక్కువగా తయారవుతూ ఉంటుంది. ఇది ఎక్కడ పేరుకుపోయినా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడమే కాకుండా శరీరం ఎంతో అలసటకు గురవుతుంది. దీనిని నివారించడానికి వంటింట్లో లభించే నాలుగు ముఖ్యమైన పదార్థాలతో ఒక అద్భుతమైన పానీయం తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు..
తేనె..
తేనెలో అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతులో ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. గొంతును ప్రశాంతంగా ఉంచుతూ, పేరుకుపోయిన గట్టి కఫాన్ని పల్చగా మార్చడానికి తేనె ఎంతగానో సహాయపడుతుంది.
అల్లం..
అల్లంలో జింజిరాల్స్ అనే శక్తివంతమైన సమ్మేళనాలు ఉంటాయి. ఇది ఒక సహజమైన డికంజస్టెంట్ లా పనిచేస్తుంది. గొంతులో , చాతిలో పేరుకుపోయిన మందపాటి కఫాన్ని కరిగించి, అది సులభంగా శరీరం నుంచి బయటకు వచ్చేలా చేయడంలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇది వాపులను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.
మిరియాలు..
మిరియాలు ముక్కు మార్గాల్లో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అక్కడ చిక్కుకున్న కఫాన్ని కరిగించి బయటకు పంపడంలో ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. అంతేకాకుండా, అల్లం , తేనెలోని పోషకాలు శరీరం త్వరగా గ్రహించేలా మిరియాలు సహాయపడతాయి.
నిమ్మరసం..
నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఇది శరీరానికి మంచి రోగ నిరోధక శక్తిని ఇస్తుంది. కఫానికి కారణమయ్యే అలర్జీలను అరికట్టి, గొంతు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండేలా రక్షణ కల్పిస్తుంది.
పై నాలుగు పదార్థాలను ఉపయోగించి ఈ కింది రెండు పద్ధతుల్లో దేనినైనా ఫాలో అవుతూ మంచి ఫలితం పొందవచ్చు..
మొదటి పద్దతి..
ఒక టీస్పూన్ తేనె తీసుకుని, అందులో తాజా అల్లం రసం లేదా అల్లం పొడి కలపాలి. ఆ తర్వాత చిటికెడు మిరియాల పొడి, కొద్దిగా నిమ్మరసం వేసి బాగా కలిపి నేరుగా తీసుకోవాలి. ఇది గొంతులో కఫం ఎక్కువగా ఉన్నప్పుడు వెంటనే ఉపశమనం ఇస్తుంది.
రెండవ పద్ధతి..
ఒక కప్పు నీటిని కొద్దిగా వేడి చేసి, అందులో అల్లం పొడి లేదా తురిమిన అల్లం, చిటికెడు మిరియాల పొడి, కొంచెం నిమ్మరసం వేయాలి. చివరగా ఒక టీస్పూన్ తేనె జోడించి బాగా కలపాలి.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే తేనె కలిపిన తర్వాత నీటిని మరిగించకూడదు. ఈ డ్రింక్ ను గోరువెచ్చగా ఉన్నప్పుడు నెమ్మదిగా తాగితే గొంతుకు ఎంతో ప్రశాంతత లభిస్తుంది.
పైన చెప్పుకున్న రెమిడీని రోజుకు రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉదయం నిద్ర లేచిన వెంటనే తీసుకుంటే రాత్రంతా పేరుకుపోయిన కఫం కరిగిపోయి శ్వాస తీసుకోవడం సులభం అవుతుంది. అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకుంటే నిద్రలో కఫం అడ్డుపడకుండా ప్రశాంతంగా నిద్రపోవచ్చు. కొద్ది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పద్ధతిని పాటిస్తే ముక్కు దిబ్బడ, గొంతు సమస్యలు పూర్తిగా తగ్గిపోయి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
*రూపశ్రీ.




