నేటి కాలంలో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్ లు, కంప్యూటర్లు మన దైనందిన జీవితంలో ప్రధాన భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు స్క్రీన్ వైపు చూడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది. సోషల్ మీడియా వాడకం, ఆఫీస్ పని లేదా వినోదం కోసం గంటల తరబడి డివైజ్‌ల ముందే గడపడం సర్వసాధారణం అయింది. ఈ నేపథ్యంలో స్క్రీన్ టైమ్ ఎక్కువైతే దుష్పభావాలు ఉంటాయని వైద్యులు కూడా చెబుతున్నారు. అయితే తాజాగా..  ఈ విషయం గురించి  వైద్య నిపుణులు , పరిశోధకులు చెబుతున్న విస్తుపోయే నిజాలేంటో వివరంగా తెలుసుకుంటే..

నిపుణుల అభిప్రాయం ప్రకారం కేవలం స్క్రీన్ ముందు గంటల తరబడి కూర్చోవడం వల్ల నేరుగా పక్షవాతం వస్తుందని చెప్పలేము. అయితే ఎక్కువ సమయం స్క్రీన్ చూస్తూ గడపడం అనేది ఒక రకమైన నిశ్చల జీవన శైలితో ముడిపడి ఉంటుంది. ఈ విధంగా శారీరక శ్రమ లేకుండా రోజంతా ఒకే చోట కూర్చునే అలవాటు వల్ల క్రమంగా అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడతాయి. ముఖ్యంగా బరువు పెరగడం, హై బ్లడ్ ప్రెషర్, మధుమేహం , చెడు కొలెస్ట్రాల్  వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇవన్నీ కూడా పక్షవాతం ముప్పును పెంచే ప్రధాన కారణాలలో ముఖ్యమైనవిగా వైద్యులు స్పష్టం చేస్తున్నారు.

అమెరికన్ స్ట్రోక్  అసోసియేషన్  కు చెందిన జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం అరవై  సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువ వయస్సు ఉన్న వారు రోజులో కనీసం ఎనిమిది గంటల పాటు శారీరక శ్రమ లేకుండా కేవలం కూర్చునే పనులలో  గడిపితే, వారిలో పక్షవాతం వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందని తేలింది. అయితే ఇది నేరుగా స్క్రీన్ వల్ల జరిగే నష్టం కాకపోయినా, ఎక్కువ సమయం కదలకుండా కూర్చునే స్వభావం వల్ల కలిగే దుష్పరిణామం అని పరిశోధకులు పేర్కొంటున్నారు. కాబట్టి స్క్రీన్ చూసే గంటలను మాత్రమే లెక్కగట్టి ప్రమాదాన్ని అంచనా వేయలేము. ఎందుకంటే రోజంతా కంప్యూటర్ ముందు పని చేసే వ్యక్తి క్రమం తప్పకుండా వ్యాయాయం చేస్తుంటే, అస్సలు శారీరక శ్రమ లేని వ్యక్తితో పోలిస్తే అతనిలో ప్రమాదం కొంత తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.

అలాగే రాత్రి సమయాల్లో ఎక్కువ సేపు మొబైల్ లేదా ల్యాప్టాప్ వాడటం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుంది. నిద్రలేమి సమస్య ఏర్పడినప్పుడు అది రక్తపోటును , జీవక్రియలను నియంత్రించడం కష్టం చేస్తుంది. దీనివల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా హైపర్ టెన్షన్, డయాబెటిస్, ఊబకాయం , గుండె జబ్బులు ఉన్నవారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలి. అధిక రక్తపోటు అనేది పక్షవాతానికి దారితీసే అత్యంత ముఖ్యమైన కారకాల్లో ఒకటి కాబట్టి, బీపీని ఎప్పుడూ అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.

యువత కూడా ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. పక్షవాతం కేవలం వృద్ధులలోనే వస్తుందని అనుకోవడం  పొరపాటు. మారుతున్న జీవన శైలి కారణంగా నేడు యువతలో కూడా ఇలాంటి ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. అయితే ఉద్యోగరీత్యా లేదా చదువురీత్యా ఎప్పుడూ స్క్రీన్ ముందు పనిచేయాల్సిన వారు పూర్తిగా డివైజ్ లను పక్కన పెట్టడం సాధ్యం కాదు. అలాంటి వారు కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

జాగ్రత్తలు..

రోజూ గంటల తరబడి ఒకే చోట కదలకుండా కూర్చోకుండా మధ్యమధ్యలో చిన్న బ్రేక్ లు  తీసుకోవడం మంచిది.

కుర్చీలోంచి లేచి కొద్దిసేపు నడవడం, ఫోన్ మాట్లాడేటప్పుడు గదిలో తిరగడం, అలాగే రోజూవారీ జీవితంలో తగినంత శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

పెద్దలు ప్రతి వారం కనీసం నూట యాభై నిమిషాల పాటు ఏదైనా వ్యాయామం లేదా నడక వంటి శారీరక కార్యకలాపాలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

 వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, పొగత్రాగడం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం , ప్రశాంతమైన నిద్ర  చాలా అవసరం.

గుర్తుంచుకోవాల్సిన విషయం..

కేవలం స్క్రీన్ టైమ్ తగ్గించడం వల్ల మాత్రమే పక్షవాతం రాకుండా నివారించలేము. ముఖ్యంగా బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక సమస్యలు ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పక్షవాతం బారిన పడకుండా ఉండాలంటే శరీరానికి తగిన వ్యాయామం ఇస్తూ, ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడం ఎంతో ముఖ్యం. ఒకవేళ ఎవరికైనా ముఖం ఒకవైపు వంకరపోవడం, శరీరంలో అకస్మాత్తుగా బలహీనత రావడం, మాట తడబడటం, చూపు మందగించడం లేదా విపరీతమైన తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం.

                                                                                                                                         *రూపశ్రీ*