ప్రపంచంలో కొందరికి కుడిచేతి వాటం ఉంటే మరికొందరు ఎడమచేతినే ఎందుకు ఉపయోగిస్తారు? ఈ చిన్న ప్రశ్నకి ఇప్పటివరకూ కూడా సరైన జవాబు కనుక్కోలేకపోయారు శాస్త్రవేత్తలు. జన్యువులో ఉండే ఏదో తేడా వల్లే కొందరికి ఎడమ చేతి వాటం అలవడుతుందని మాత్రం ఊహిస్తున్నారు. కానీ ఆ జన్యువు ఏదో ఇప్పటివరకూ తెలుసుకోలేకపోయారు.
ప్రపంచంలోని ప్రతి వస్తువునీ కుడిచేతివారికి అనుగునంగానే రూపొందించారు. దాంతో ఎడమచేతి వాటం ఉన్నవారు చాలా ఇబ్బందులనే ఎదుర్కోవలసి వస్తుంటుంది. పులి మీద పుట్రలాగా ఇప్పుడు ఎడమ చేతివారికి మరో సమస్య ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. అయితే ఇది మనం ఏర్పరుచుకున్నది కాదు.... స్వతహాగా వారి జన్యువులలో ఉన్నదే!
అమెరికాలోని కొందరు పరిశోధకులు 13,536 మందిని పరిశీలించి తరువాత తేల్చిందేమిటంటే... ఎడమచేతి వాటం ఉన్నవారిలో కోలమొహం ఉండే అవకాశం ఎక్కువ. ఇతరులతో పోలిస్తే వీరిలో కోలమొహం ఉండే అవకాశం 25 శాతం ఎక్కువగా ఉందట! అబ్బే... ఇదీ ఒక పరిశోధనేనా అనుకునేరు. ఎందుకంటే మన శరీరంలోని ప్రతి భాగమూ, ప్రతి మార్పూ ఏదో ఒక లక్షణానికి సూచనగా నిలిచే అవకాశం ఉంది. అలాగే కోలమొహం ఉన్నవారిలో కూడా క్షయవ్యాధి సోకే అవకాశం ఎక్కువని అంటున్నారు.
దాదాపు రెండువేల సంవత్సరాల క్రితమే ఒక గ్రీకు వైద్యుడు... క్షయవ్యాధితో బాధపడుతున్నవారిలో ఎక్కువమందికి కోలమొహం ఉండటాన్ని గమనించాడు. అది నిజమేనని ఆధునిక పరిశోధనలు నిరూపించాయి. ఏ జన్యువులైతే ఎడమచేతి వాటానికీ, కోలమొహానికి కారణం అవుతున్నాయో... అవే జన్యువుల క్షయవ్యాధికి కూడా త్వరగా లొంగిపోతున్నాయని తేల్చారు.
ఎడమచేతి వాటానికీ, క్షయ వ్యాధికీ మధ్య సంబంధం ఉందంటూ చెబుతున్న ఈ పరిశోధనని కొట్టి పారేయడానికి లేదు. ఎందుకంటే ఇంగ్లండులో క్షయ వ్యాధి కేసులు చాలా ఎక్కువగా నమోదవుతూ ఉంటాయి. ఆశ్చర్యకరంగా ఎడమచేతి వాటం ఉన్నవారు కూడా ఇంగ్లండులోనే ఎక్కువ! ఈ పరిశోధన తరువాత ఎడమచేతి వాటం ఉన్నవారు ఊపిరితిత్తుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలేమో!
- నిర్జర.