బ్రిటన్ లో ఓ జంటకి చాలాకాలంగా పిల్లలు పుట్టట్లేదు. 30 ఏళ్ల స్కాట్ రీడ్, పాతికేళ్ల లారా.. డాక్టర్ దగ్గరికెళ్లి అన్నిపరీక్షలూ చేయించుకున్నారు. మొగుడికి స్పెర్మ్ కౌంట్ చాలా తక్కువగా ఉందని తేలింది. అదికూడా సహజసిద్ధంగా ఉన్నది కాదు. ఎందువల్లో అతనికి స్పెర్మ్ కౌంట్ విపరీతంగా పడిపోతోందని డాక్టర్లు కనిపెట్టారు. రోజువారీ అలవాట్ల గురించి అడిగితెలుసుకున్నారు. అసలు విషయం బైటపడింది. శుక్రకణాలు బాగా తగ్గిపోవడానికి అసలు కారణం ల్యాప్ టాప్ ని తొడమీద పెట్టుకుని పనిచేయడమేనని తేలింది. ల్యాప్ టాప్ ని తొడమీద కాకుండా టేబుల్ మీద ఉంచి పనిచేసుకోమని డాక్టర్లు స్కాట్ కి సలహా ఇచ్చారు. కొన్నాళ్లపాటు గమనించి చూశాక స్మెర్మ్ కౌంట్ మాములుస్థాయికి పెరగడం కనిపించింది. అంతేకాదు.. అతి తక్కువ కాలంలో స్కాట్, లారాలు తల్లిదండ్రులుకూడా అయ్యారు. లారా పండండి మగ బిడ్డని ప్రసవించింది. అచ్చం తండ్రిలాగే ఉన్న పిల్లాడు తెగ అల్లరి చేసేస్తున్నాడుకూడా..
తమ అనుభవాన్ని అందరితోనూ పంచుకునేందుకు, ల్యాప్ టాప్ ని తొడమీద పెట్టుకుని పనిచేయడంవల్ల కలిగే అనర్ధాలగురించి వివరించి చెప్పేందుకు ఈ జంట పెద్దఎత్తున ఓ క్యాంపెయిన్ కి కూడా ప్లాన్ చేస్తోందట. ఏళ్లపాటు పిల్లలు పుట్టడానికి కారణం తెలీక అల్లాడి పోయిన స్కాట్, లారాలు చివరికి తమ దుస్థితికి కారణం ల్యాప్ టాప్ అన్న విషయాన్ని తెలుసుకుని తెగ నవ్వుకున్నారట.