మానవశరీరంలో అవశ్యకమైన అవయవాలలో గుండె, మెదడు తో పాటు మూత్రపిండాలు ముఖ్యమైనవి. 

మెదడు శరీరంలో అవయవాలకు, శరీర వ్యవస్థకు సమాచారాలు అందిస్తుంది. 

గుండె రక్తాన్ని  శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు సరఫరా అయ్యేలా చేస్తుంది.

మూత్రపిండాలు శరీరంలో రక్తాన్ని వడపోసి అందులో ఉన్న మలినాలను, వ్యర్థాలను, వేరుచేసి మూత్రంలా దారి మళ్లిస్తుంది. 

ఈ మూడింటిలో ఏది సమర్థవంతంగా లేకపోయినా మనిషి శరీరం స్వాధీనం కోల్పోతుంది. 

ముఖ్యంగా మూత్రపిండాల గురించి చెప్పుకుంటే చిన్నప్పుడు సైన్స్ పుస్తకాల్లో చదువుకున్నట్టు చిక్కుడుగింజ ఆకారంలో ఉండే అవయవం మూత్రపిండం. మనిషి శరీరంలో రెండు మూత్రపిండాలు ఉంటాయి. ఇవి నిరంతరం రక్తాన్ని వడపోస్తూనే ఉంటాయి. సుమారు రోజుకు 200 లీటర్ల రక్తాన్ని ఇవి వడపోస్తాయి. ఈ మూత్రపిండాలు డ్యామేజ్ అవడం, ఏదైనా సమస్యకు లోను కావడం జరిగితే రక్తం వడపోతకు అడ్డంకులు ఏర్పడతాయి, రక్తం శుద్ధి కాకపోతే శరీరంలో చెప్పలేని సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా శరీరంలో అధికంగా ఉండే లవణాలు, రక్తంలో వ్యర్థాలు వెళ్లిపోవాల్సిన మార్గమైన మూత్రవిసర్జనకు సమస్య అవుతుంది.

మూత్రపిండాలకు పొంచి ఉండే మరొక ప్రమాదం మూత్రపిండ క్యాన్సర్. ఈ క్యాన్సర్ తో బాధపడుతున్న రోగులలో 60%మందికి మూత్రంలో రక్తం పడటమనే ప్రమాదకరమైన సమస్య ఎదురవుతోంది. అయితే ప్రారంభంలో ఇది నొప్పి లేకుండా ఇతర లక్షణాలు ఏవీ బయటపడకుండా ఉండటం వల్ల ఈ మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించడం కష్టమవుతుంది. 60% మందిలో 50% మందికి అసలు లక్షణాలు ద్వారా నిర్ధారణ జరగలేదనేది విస్తుపోయే అంశం. ఈ కారణాల వల్ల మూత్రపిండాల క్యాన్సర్ గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది.

సాధారణంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకునేటప్పుడు అందులో భాగంగా మూత్రపిండాల సమస్యలు, వాటి తీవ్రత బయటపడుతుంటాయి. అంటే ప్రారంభంలో ఈ మూత్రపిండాల క్యాన్సర్ ఎటువంటి లక్షణాలను కలిగిఉండదు.

మూత్రపిండాల క్యాన్సర్ కొంచెం ముదిరిన తరువాత దాన్ని గుర్తించే అతిముఖ్యమైన అంశం మూత్రంలో రక్తం పడటమే. ఈ లక్షణం ఎవరిలో అయినా కనిపిస్తే వెంటనే మూత్ర పరీక్షలు, రక్త పరీక్షలు చేయించుకోవాలి.

మూత్రంలో రక్తం పడటంతో పాటు బరువు తగ్గిపోవడం, ఆకలి లేకపోవడం కూడా గమనించినట్టైతే వైద్యులను సంప్రదించాలి.

మూత్రపిండాల క్యాన్సర్ ను గుర్తించి నిర్ధారణ చేయడానికి CT స్కాన్( కంప్యుటేడ్ టోమోగ్రఫీ), MRI స్కాన్(మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ )  లేదా అల్ట్రాసౌండ్ స్కాన్ వంటి పరీక్షలు ఉన్నాయి. ఇవి ఖర్చుతో కూడుకున్నవి అయినా ఖచ్చితమైన నిర్ధారణను అందిస్తాయి.

శరీరంలో ఎర్రరక్తకణాలను ఉత్పత్తి చేయడానికి మూత్రపిండాలు మధ్యవర్తిగా వ్యవహరిస్తాయి. అయితే మూత్రపిండాల క్యాన్సర్ వల్ల ఈ పనికి ఆటంకం కలిగి రక్తహీనత ఏర్పడుతుంది. 

మూత్రపిండాలు పూర్తిగా పాడైపోతే వాటిని తొలగించడం తప్ప ప్రత్యామ్నాయం ఉండదు. ఎవరైనా కిడ్నీ దానం చేస్తే అవి కూడా సరిపోయినప్పుడు మాత్రమే ప్రాణాలు నిలబడతాయి. 

కేవలం ఒక కిడ్నీతో అయినా జీవితాన్ని నెట్టుకొస్తున్నవారు ఉన్నారు. కానీ మద్యపానం, ధూమపానం, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, బయటి తిండి వీటివల్ల మూత్రపిండాలు చాలా తొందరగా ప్రమాదంలో పడతాయి కాబట్టి వాటికి దూరంగా ఉండాలి. ఈ శరీరాన్ని నిలబెట్టుకోవాలంటే మూత్రపిండాలని కాపాడుకోవాలి.

                                               ◆నిశ్శబ్ద.