ధూమపానం ఆరోగ్యానికి హానికరం అనే మాట అన్నిచోట్లా చెబుతారు. చివరాఖరికి సిగరెట్ ప్యాకెట్ మీద కూడా అదే విషయం రాసి ఉంటుంది.  చాలామంది ఈ ధూమపానం తెచ్చే చేటును దృష్టిలో ఉంచుకుని దాన్ని మానేయాలని ప్రయత్నిస్తుంటారు. కానీ ఇలా ప్రయత్నించేవారిలో విఫలమయ్యేవారే అధికం. ధూమపానం మానేయాలనే నిర్ణయం  జీవితాన్ని మార్చేదే అయినా ఆ ప్రయత్నంలో వైఫల్యం మళ్ళీ దానివైపు వెళ్ళేలా చేస్తుంది.నికోటిన్ తీసుకోవాలనే  కోరిక ధూమపానాన్ని  విడిచిపెట్టడానికి అతిపెద్ద అడ్డంకులలో ఒకటి. నికోటిన్ తీసుకోకుండా ఉండటానికి సహాయపడే కొన్ని చిట్కాలు తెలుసుకుంటే..

 ధూమపానం చెయ్యాలని అనిపించినప్పుడు దృష్టి మరల్చడానికి ప్రయత్నించాలి. సినిమా చూడటం,  సంగీతం వినడం వంటి మీరు ఇష్టపడే పనిని చేయడం లేదా వాకింగ్ వెళ్లడం. ఏదైనా ఇతర పనులను చేయడానికి ప్రయత్నించడం చేయాలి. ఇలా చేస్తే  ధూమపానం గురించి ఆలోచించే అవకాశం తక్కువ.

నీరు త్రాగడం వల్ల ధూమపానం కోరికలను తగ్గించవచ్చు. కొన్నిసార్లు బాగా  దాహం వేసినప్పుడు అది ధూమపానం చెయ్యాలనే కోరికగా భావిస్తారు.  ఎప్పుడైనా అలా అనిపించినప్పుడు సిగరెట్ వైపు వెళ్ళకుండా.. ఒక గ్లాసు నీరు త్రాగడానికి ప్రయత్నించండి. ఇది మిమ్మల్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో సహాయపడటమే కాకుండా, శరీరంలో పేరుకుపోయిన  నికోటిన్‌ను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది.

రెగ్యులర్ వ్యాయామం ధూమపానం కోరికలను తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం ఎండార్ఫిన్‌లను విడుదల చేస్తుంది. ఈ ఎండార్పిన్లు  శరీరం  సహజ అనుభూతి ద్వారా వెలువడే మంచి రసాయనాలు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మీరు మంచి అనుభూతి చెందుతారు అలాగే ధూమపానం చేయాలనుకునే కోరిక తగ్గుతుంది.

చూయింగ్ గమ్ నమలడం లేదా షుగర్ లేని స్వీట్ ను తినడం  వల్ల నోటికి సాటిసిఫాక్షన్ లభిస్తుంది. ఇది  మెదడు చేసే పనిమీద  దృష్టి కేంద్రీకరించడానికి, ఆ పనిమీద ఏకాగ్రత  అందించడానికి కూడా సహాయపడుతుంది.

ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చుట్టుప్రక్కల వారి  సహాయం చాలా అవసరమవుతుంది.  కుటుంబ సభ్యులు  మరియు స్నేహితులతో మాట్లాడి  వారి మద్దతు తీసుకోవాలి. 

ధూమపానం మానేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నికోటిన్ రీప్లేస్‌మెంట్ థెరపీ (NRT) సహాయక సాధనంగా ఉంటుంది. NRT గమ్, ప్యాచ్‌లు, లాజెంజ్‌లు, ఇన్‌హేలర్‌లతో సహా వివిధ రూపాల్లో వస్తుంది. అవి ఓవర్-ది-కౌంటర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా ఉపయోగించాలో తెలియకపోతే వైద్యులను అడిగి తెలుసుకుని వాడాలి.

నీరసం ధూమపానం చేయాలనే కోరికకు  దారి తీస్తుంది. ఎప్పుడూ చురుగ్గా ఉండేలా చూసుకోవాలి. మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకోవడానికి ఏదో  ఒకట్ చేయడానికి  ప్రయత్నించాలలి. బిజీగా ఉండటం వల్ల  మనస్సును ధూమపానం గురించి ఆలోచించకుండా చేసుకోవచ్చు. 

                                            - నిశ్శబ్ద