టీ అనేది భారతీయలకు చాలా ఎమోషన్. ప్రతిరోజూ టీ తాగనిదే పనులను అణువంత కూడా ముందుకు కదలవు. అయితే టీ పొడిలో నాణ్యత కూడా కీలక పాత్ర పోషిస్తుంది. టీ పొడిని చాలా సులభంగా కల్తీ చేస్తారు. టీ పొడి నాణ్యమైనదా లేదా కల్తీదా తెలుసుకోవాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఫాలో కావాలి..
ఫిల్టర్ పేపర్ తో..
టీ ఆకులు కల్తీ అయ్యాయా లేక నాణ్యమైనవా అనే విషయం కనుగొనడానికి ఫిల్టర్ పేపర్ ను ఉపయోగించ వచ్చు. ఫిల్టర్ పేపర్ తీసుకుని ఆ పేపర్ పైన టీ పొడిని వేయాలి. ఫిల్టర్ పేపర్ ను కొద్దిగా తడిపి దాని మీద కొంచెం నీరు చిలకరించాలి. తరువాత ఫిల్టర్ పేపర్ ను తీసుకుని లైట్ దగ్గర పరిశీలించాలి. మీరు వాడినది కల్తీ టీ పొడి అయితే ఫిల్టర్ పేపర్ మీద నల్లని, గోధుమ రంగు మరకలు కనిపిస్తాయి. కల్తీ లేని టీ ఆకులు అయితే ఫిల్టర్ పేపర్ పైన ఎలాంటి మరకలు ఉంచవు.
నీటితో..
ఒక గ్లాసులో నీరు తీసుకోవాలి. ఈ నీటిలో టీ ఆకులు వేయాలి. నీటిలో టీ ఆకులు వేయగానే అవి రంగు మారుతుంటే.. ఆ టీ ఆకులకు కలర్ మిక్స్ చేశారని అర్థం. స్వచ్చమైన టీ ఆకుల రంగు చాలా నెమ్మదిగా రిలీజ్ అవుతుంది.
రుచి..
స్వచ్చమైన, తాజా టీ ఆకులు అయితే ఫ్రెష్ గా రుచికరంగా ఉంటాయి. కానీ చేదుగా లేదా చప్పగా ఉన్నా.. లేదా తీపిగా లేదా కారంగా అనిపిస్తున్నా అవి కల్తీ చేసిన టీ ఆకులు అని అర్థం. మార్కెట్ లో దొరికే వివిధ రకాల ఫ్లేవర్ లలో ఉండే టీ ఆకులు చాలా వరకు పాత బడినవే అయి ఉంటాయి. వాటికి ఇలాంటి ఫ్లేవర్ జోడించి తాజాదనం అనుభూతిని జొప్పించి అమ్మేస్తుంటారు.
రంగు..
స్వచ్చమైన టీ ఆకులు ఆకుపచ్చ రంగులో లేదా నల్లగా ఉంటాయి. కానీ కల్తీ టీ ఆకులు గోధుమ లేదా ఎరపు లేదా పసుపు వంటి ఇతరలతో కూడా ఉండే అవకాశం ఉంది.
స్వభావం..
నిజమైన టీ ఆకులు పొడిగా, మృదువుగా, ముట్టుకుంటే పగిలిపోయేలా ఉంటాయి. అంటే విరిగిపోయేలా ఉంటాయి. ముఖ్యంగా వీటి సైజ్ చాలా పెద్దగా ఉంటాయి.
కల్తీ టీ ..
చాలా వరకు కల్తీ టీ ఆకులను టీ బ్యాగ్ ల రూపంలో అమ్మేస్తారు. ఎందుకంటే టీ బ్యాగ్ లలో ఉన్న ఆకులను బయటకు తీసి పరిశీలించే అవకాశం ఉండదు కాబట్టి. పైగా ఈ టీ బ్యాగుల తయారీలో కాగితానికి మైనం పూత ఉంటుంది. ఇది నీటిలో కరికి కడుపులోకి వెళ్లడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం కలుగుతుంది.
*రూపశ్రీ.