చేపలు చాలా శక్తి వంతమైన ఆహారం. సమతుల ఆహారంలో చేపలకు కూడా స్థానం ఉంది. చేపలను తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, విటమిన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి. వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతారు. అయితే చేపల కంటే ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే 10 రెట్ల పోషకాలు లభిస్తాయట. ఇంతకీ ఇవేం గింజలు. వీటి ప్రయోజనాలేంటి తెలుసుకుంటే..
గుమ్మడి..
గుమ్మడి కాయ వినియోగం భారతదేశంలో ఎక్కువ. గుమ్మడి కాయను కట్ చేసిన తరువాత చాలా మంది అందులో విత్తనాలు పడేస్తుంటారు. అయితే గుమ్మడి గింజలు పోషకాల నిధి. గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే అధిక శక్తి, శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయట.
100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాలో గుమ్మడి గింజలు ఆరవ స్థానం పొందాయి. ఇక ఎంతో మేలు అని చెప్పుకునే చేపలు 77వ స్థానంలో నిలిచాయి. గుమ్మడికాయ గింజలలో పోషకాల విలువ 84 అయితే.. చేపలలో ఎంతో మంచిదని చెప్పుకునే సాల్మన్ చేపల పోషక విలువ 52 మాత్రమే. అందుకే గుమ్మడికాయ గింజలను అస్సలు మిస్ చేసుకోకుండా తినమని చెబుతున్నారు.
పోషకాలు..
గుమ్మడికాయ గింజలలో ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి.
గుమ్మడి గింజలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3, ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించి, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి. మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి.
గుమ్మడి గింజల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి.
మెగ్నీషియం, భాస్వరం, జింక్ ఎముకల సాంద్రతను పెంచడానికి, బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా అవసరం. ఈ మూడు మూలకాలు గుమ్మడి గింజల్లో మంచి పరిమాణంలో ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి.
గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి. డయాబెటిస్ సమస్యలను నివారిస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా బరువును నియంత్రిస్తాయి. ముఖ్యమైన విషయం ఏమిటంటే 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో కేలరీలు తక్కువ.
*రూపశ్రీ.