కాలుష్యం నేటి కాలంలో ప్రజలకు అతిపెద్ద ముప్పు తెచ్చిపెడుతోంది.  గాలి, నీరు, ఆహారం తో పాటు జీవనవిధానం కూడా చాలా వరకు కలుషితమైపోయింది.  చాలామంది జీవినశైలి చాలా అధ్వానంగా మారింది. ఇంటి నుండి బయటకు వెళితే వాహనాల పొగ, ఫ్యాక్టరీల నుండి వెలువడే పొగ.. మొదలైన వాటి వల్ల గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటోంది.  దీని వల్ల ఊపిరితిత్తులు చాలా దారుణంగా దెబ్బతింటాయి.  నిజానికి ధూమపానం కారణంగా ఊపిరితిత్తులు దెబ్బతింటాయని అనుకునేవారు. కానీ నేటికాలం వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఊపిరితిత్తులు ప్రమాదంలో పడుతున్నాయి. అయితే గాలి కాలుష్యం వల్ల ఊపిరితిత్తులలో పేరుకున్న మురికి శుభ్రం చేసుకోగలిగితే ఊపిరితిత్తులను జాగ్రత్తగా చూసుకోవచ్చు.  ఇందుకోసం కొన్ని మూలికలు తీసుకోవాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే..

తులసి..

తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.  ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి. దగ్గు, జలుబు,  ఉబ్బసం వంటి సమస్యలలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. నాలుగైదు తులసి ఆకులను ప్రతిరోజూ ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో మరిగించి ఆ నీటిని తాగాలి. లేదా తులసి ఆకుల రసాన్ని తీసి అందులో కొద్దిగా తేనె కలిపి తీసుకోవాలి. ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది.

అల్లం..

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం అల్లంలో యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులలో వాపును తగ్గిస్తుంది.  ప్రతిరోజూ అల్లాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవాలి.  ఇది చాలా బాగా సహాయపడుతుంది.

అతి మధురం..

అతి మధురం ఆయుర్వేదంలో చాలా శక్తివంతమైన మూలిక.  ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది.  ఇది ఊపిరితిత్తులను శుభ్రం చేయడంలో సహాయపడుతుంది.  ఇది మాత్రమే కాకుండా దగ్గు,  గొంతు నొప్పి, ఉబ్బసం వంటి సమస్యల నుండి ఉపశమనం అందిస్తుంది.

తిప్పతీగ..

తిప్పతీగ లో యాంటీ ఆక్సిడెంట్లు, ఇమ్యునోమోడ్యులేటరీ లక్షణాలు ఉంటాయి.  ఇవి ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. పైగా మధుమేహం ఉన్నవారికి కూడా చాలా మంచిది.  తిప్పతీగను పొడి రూపంలో లేదా జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు.


                                                  *రూపశ్రీ.