వేసవికాలం వచ్చిందంటే ఆరోగ్య పరంగా మామూలు కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎండ వేడిమి కారణంగా, పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా శరీరంలో ఉష్ణోగ్రత విషయంలో కూడా మార్పులు వస్తాయి.  శరీరంలో తేమ శాతం చాలా వేగంగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా ఏదైనా పనుల మీద బయటకు వెళ్లి వచ్చేవారికి ఈ సమస్య మరింత అధికంగా ఉంటుంది.  దీనికారణంగా  శరీరం డీహేడ్రేట్ కు లోనవుతుంది. తిరిగి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడానికి  వివిధ రకాల పానీయాలు, మంచినీరు తాగుతుంటారు. ఇలా తీసుకునే వాటిలో కొబ్బరినీరు, నిమ్మకాయ నీరు ముఖ్యమైనవి. అయితే ఈ రెండింటిలో ఏది శరీరాన్ని ఎక్కువ హైడ్రేట్ గా ఉంచుతుంది? అసలు శరీరం డీహైట్రేషన్ కు ఎందుకు లోనవుతుంది? వివరంగా తెలుసుకుంటే..

శరీరం ఎందుకు డీహైడ్రేట్ అవుతుంది?


వేడి వాతావరణంలో తీసుకునే ద్రవ పదార్థాల కంటే శరీరం కోల్పోయే ద్రవాలు ఎక్కువ ఉన్నప్పుడు శరీరంలో నీటి శాతం లోపిస్తుంది. ఇది డీహైడ్రేషన్ గా పిలవబడుతుంది.  దీని వల్ల నీరు పొడిబారడం, అలసట, మైకం,  హీట్ స్ట్రోక్ వంటి సమస్యలు ఎదురవుతాయి.

నిమ్మరసం నీరు..

నిమ్మకాయ నీరు ఈ మధ్య కాలంలో చాలా విరివిగా తాగుతున్నారు.  తరచుగా ఆరోగ్యం  మీద స్పృహ ఉన్నవారు,  బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నవారు నిమ్మకాయ నీరు బాగా తాగుతారు.   దానికి తగినట్టే ఇది గొప్ప ఫలితాలు ఇస్తుంది కూడా.  నిమ్మకాయ నీటిలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది.  ఇది విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు,  ఇతర ప్రయోజనకరమైన పోషకాలతో పాటు ఘాటైన రుచిని ఇస్తుంది.

నిమ్మరసం  ప్రధాన ప్రయోజనాల్లో  హైడ్రేట్ గా ఉంచడం మొదటిది.  ఆర్ద్రీకరణకు నీరు చాలా అవసరం. కానీ నిమ్మకాయను జోడించడం వల్ల దాని ప్రయోజనాలను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయలో పొటాషియం, కాల్షియం,  మెగ్నీషియం ఎలక్ట్రోలైట్లు ఉంటాయి.  ఇవి శరీరం కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడతాయి. ఈ ఎలక్ట్రోలైట్‌లు శరీరం  ద్రవ సమతుల్యతను కాపాడుకోవడంలో,  శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

కొబ్బరి నీరు..


కొబ్బరి నీరు ఉష్ణమండల ప్రాంతాలలో శతాబ్దాలుగా వినియోగించబడుతున్న సహజ పానీయం. కొబ్బరినీటిలో  పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం,  సోడియం వంటి అవసరమైన పోషకాలు  ఉంటాయి.  ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.  కొద్దిగా తీపి రుచిని కలిగి ఉంటుంది.

కొబ్బరి నీటిని హైడ్రేటింగ్ డ్రింక్‌గా పరిగణించడానికి ప్రధాన కారణాలలో ముఖ్యమైనది ఏంటంటే.. ఇందులో అధిక స్థాయిలో ఎలక్ట్రోలైట్‌లు ఉంటాయి. ఇది మానవ రక్తంతో సమానమైన ఎలక్ట్రోలైట్ కూర్పును కలిగి ఉన్నట్లు కనుగొనబడింది. ఇది తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట తర్వాత శరీరాన్ని రీహైడ్రేట్ చేయడానికి సమర్థవంతమైన పానీయం.

అంతేకాకుండా కొబ్బరి నీటిలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం  ద్రవ సమతుల్యతను కాపాడుకోవడానికి అవసరమైన ఖనిజం.  శరీరంలోని నీటి స్థాయిలను నియంత్రించడంలో,  డీహైడ్రేషన్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

ఏది బెస్టంటే..

నిమ్మకాయ నీరు,  కొబ్బరి నీరు రెండూ వేసవి నెలల్లో  హైడ్రేట్‌గా ఉంచడంలో సమానంగా ప్రభావవంతంగా ఉంటాయి. నిమ్మ నీటిలో కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో సహాయపడే ఎలక్ట్రోలైట్‌లు ఉండగా, కొబ్బరి నీరు మానవ రక్తంతో సమానమైన ఎలక్ట్రోలైట్ కూర్పును కలిగి ఉంటుంది. ఇది సహజ హైడ్రేటర్‌గా మారుతుంది.

 తక్కువ కేలరీలు కావాలని  చూస్తున్నట్లయితే..  కొబ్బరి నీళ్లతో పోలిస్తే నిమ్మరసం తక్కువ కేలరీలను కలిగి ఉంటుంది.  అయితే..  తీవ్రమైన శారీరక శ్రమ లేదా చెమట పట్టిన తర్వాత త్వరితగతిన శరీరం హైడ్రేట్ కావాలని   చూస్తున్నట్లయితే అధిక ఎలక్ట్రోలైట్ కంటెంట్ కారణంగా కొబ్బరి నీరు మంచి ఎంపిక.

                                         *నిశ్శబ్ద.