ప్రజలు ఆరోగ్యం కోసం మూడు పూటలా ఆహారం తీసుకుంటారు. ఇందులో ఉదయం బ్రేక్ పాస్ట్, మద్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటాయి. చాలామందికి ఉదయం 9లోపు అల్పాహారం, మధ్యాహ్నం 2 గంటల లోపు భోజనం చేస్తారు. ఇక రాత్రి సమయంలో కొందరు 8 గంటలకు, మరికొందరు 9 గంటలకు, ఇంకొందరు 10 గంటలకు కూడా భోజనం చేస్తారు. అయితే రాత్రి భోజనం విషయంలో వైద్యులు చాలా అసక్తికర విషయాలు వెల్లడించారు. రాత్రి భోజనం 7 గంటలలోపు తింటే ఏం జరుగుతుందో కింది విధంగా వివరించారు.
రాత్రి 7 గంటలలోపు భోజనం చెయ్యడం వల్ల ఆహారం తినడానికి, నిద్రపోవడానికి మధ్య తగినంత సమయం దొరుకుతుంది. ఈ సమయం తిన్న ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. దీనివల్ల రాత్రి సమయంలో కడుపు ఉబ్బరం, కడుపు భారంగా అనిపించడం, అజీర్ణం వంటి సమస్యలు లేకుండా హాయిగా నిద్ర పడుతుంది.
కొందరిలో ఆకలి వేళలు క్రమ పద్దతిలో ఉండవు. ఎప్పుడంటే అప్పుడు తింటూ ఉంటారు. రాత్రి 7 గంటలలోపు తింటే ఆకలి వేళలు కూడా క్రమ పద్దతిలో ఉంటాయి. రాత్రి తొందరగా తినడం వల్ల ఉదయాన్నే తొందరగా ఆకలి వేస్తుంది. ఇది బ్రేక్పాస్ట్ స్కిప్ చేయకుండా ఉండటంలో సహాయపడుతుంది.
చాలామంది రాత్రి 9 గంటలు దాటిన తరువాత భోజనం విషయంలో చాలా హడావిడి పడుతూ ఉంటారు. ఇలా హడావిడిగా తినేటప్పుడు ఆహారం నమలరు. అప్పటికే సమయం గడవడం వల్ల ఆ ఆహారం కూడా జీర్ణం కావడం కష్టంగా ఉంటుంది. 7గంటలలోపు తినడం వల్ల హడావిడి ఉండదు. నెమ్మదిగా ఆహారాన్ని ఆస్వాదిస్తూ తింటారు. దీనివల్ల తిన్న ఆహారం శరీరానికి ఒంటబడుతుంది. 7గంటలలోపు ఆహారం తినడం ద్వారా అది సరిగా జీర్ణం అవుతుంది. యాసిడ్ రిఫ్లక్స్, మలబద్దకం, జీర్ణ అసౌకర్యం వంటి సమస్యలు ఉండవు.
బరువు తగ్గాలని అనుకునేవారు ఆహార వేళలు పర్పెక్ట్ గా ఫాలో అవ్వాలి. ముఖ్యంగా రాత్రి సమయంలో 7గంటలలోపు తినడం వల్ల బరువు తగ్గడం సులువుగా ఉంటుంది. జీవక్రియ సజావుగా జరుగుతుంది. పడుకునేలోపు చాలా ఆహారం జీర్ణం అవుతుంది. దీనివల్ల బరువు తగ్గడం సులభం అవుతుంది. అంతే కాదు రాత్రి 7గంటల లోపు తింటే సిర్కాడియన్ రిథమ్ సిస్టమ్ సమన్వయంగా ఉంటుంది. ఇది నిద్రా చక్రం. అంటే నిద్ర చక్రం చక్కగా పనిచేస్తుంది.
*రూపశ్రీ.