రోజులు మారిపోతున్నాయి. రోజులతో పాటుగా అలవాట్లూ మారిపోతున్నాయి. కాస్త ఆకలి వేసినప్పుడు ఇడ్లీలో, పకోడీలో తినే పరిస్థితి దాటిపోయి... బ్రెడ్డు మీద వెన్న రాసుకునే అలవాటు మొదలైంది. కానీ ఇలా దేని మీద పడితే దాని మీద వెన్నని రాస్తే ఆకలి తీరడం మాట అటుంచి అనారోగ్యం పాలవుతామని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
వెన్న భారతీయులకి కొత్తేమీ కాదు. మన రోజువారీ జీవితంలో పాలు, వెన్న, నెయ్యి శుభ్రంగా కలిసిపోయాయి. ఈ పదార్థాలు లేనిదే మన ఆహారాన్ని ఊహించుకోవడమే కష్టం. కానీ కొద్ది రోజులుగా వెన్న మీద పరిశోధకుల కన్ను పడింది. ఇందులో ఉండే విపరీతమైన కొవ్వు వల్ల గుండెపోటు, చక్కెర వంటి సమస్యలు ఏర్పడతాయంటూ హెచ్చరించడం మొదలుపెట్టారు. ఇలాంటి మాటలు విన్న భారతీయులు కూడా అనాదిగా వస్తున్న తమ అలవాట్లలో లోపం ఏదన్నా ఉందేమో అని భయపడి అసలు వెన్నకే దూరంగా ఉంటూ వస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారు వెన్న జోలికే పోవడం మానుకున్నారు.
నిజానికి ఆయుర్వేదం ప్రకారం వెన్నకి అద్భుతమైన గుణాలెన్నో ఉన్నాయి. ఆకలిని పెంచడంలోనూ, వాతపిత్త దోషాలను నివారించడంలోనూ, జీర్ణవ్యవస్థని మెరుగుపరచడంలోనూ, శక్తిని అందించడంలోనూ... వెన్నకు తిరుగులేదంటారు ఆయుర్వేద నిపుణులు. ఇక పిల్లలపాలిట అయితే ఇది అమృతంలా పనిచేస్తుందట. మరి అలాంటి వెన్నకి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారేంటా అని జనం సందిగ్థంలో పడిపోయారు. కానీ బోస్టనుకు చెందిన డా॥లారా చేసిన ఒక పరిశోధనతో అసలు విషయం బయటపడింది. వెన్నకీ గుండెజబ్బులు, చక్కెర వంటి వ్యాధులకీ పెద్దగా సంబంధం లేదని తేల్చిపారేశారు లారా. నేరం వెన్నది కాదనీ, దాంతో పాటుగా పుచ్చుకునే బ్రెడ్, బంగాళదుంపలు వంటి పదార్థాలదే అంటున్నారు ఈ పరిశోధకురాలు. దేని మీద పడితే దాని మీద వెన్నని పూసేసుకొని, ఆ తరువాత వచ్చే అనారోగ్యాలకు వెన్నను దోషిగా నిలబెట్టడం మంచిది కాదంటున్నారు. లారా తన పరిశోధన కోసం దాదాపు ఆరు లక్షలమంది ఆరోగ్యవిధానాలను నిశితంగా పరిశీలించారు.
అదీ విషయం! రోజుకి కాస్తో కూస్తో వెన్నని మితంగా పుచ్చుకోవడంలో తప్పులేదనీ... అయితే ఆ వెన్నని దేని మీద పూస్తున్నారో కూడా గమనించుకోవాలని ఈ పరిశోధనతో తేలుతోంది. పైగా వెన్న పేరుతో బయట లభించే కృత్రిమ వెన్న (margarine) పట్ల కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ కృత్రిమ వెన్నని తయారుచేసేందుకు రకరకాల నూనె పదార్థాలని ఉపయోగిస్తారనీ, ఇవి శరీరంలోనే పేరుకుపోతాయని చెబుతున్నారు. అచ్చు వెన్నలాగే ఉండే ఈ margarineని బేకరీలలో విచ్చలవిడిగా వాడేస్తూ ఉంటారు. సహజమైన వెన్నని చూసి భయపడేకంటే ఇలాంటి కృత్రిమ పదార్థాలకు, బేకరీ ఆహారాలకు దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నారు.
- నిర్జర.