ఆరోగ్యానికి తప్పని సరిగా తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు...

1) ఆరోగ్యానికి పండ్ల రసాలు మంచివి అని మనకి తెలుసు.  అయితే మందులు వేసుకున్న వెంటనే మాత్రం పండ్లరసాలు త్రాగకూడదు. అలా తాగితే  మందులు పూర్తిస్థాయి ఫలితాలని ఇవ్వవు అని చెబుతున్నారు వెస్ట్రన్ అంటారియో  విశ్వవిద్యాలయ పరిశోధకులు.

2) క్యారెట్‌లలో ఉండే ఫాల్ కారినల్ కాన్సర్‌ను నిరోధిస్తుందని చాలా అధ్యయనాలలో తేలింది. కానీ వాటిని తరగకుండా ఉడకబెట్టి తింటేనే పూర్తి ప్రయోజనాలు లభిస్తాయని చెబుతున్నారు ఆ పరిశోధకులు. క్యారట్‌ని తరిగి, ఉడకబెట్టడం వలన వాటిలో ఉండే ఇతర పోషకాలు కూడా నీటిలో కలిసిపోతాయట. క్యారట్‌కు ప్రత్యేకమైన తియ్యటి రుచిని ఇచ్చే చక్కెరలు సైతం కరిగిపోతాయి. కాబట్టి  ఆరోగ్యం కోసం క్యారట్ తినాలంటే అలాగే తరగకుండా ఉడికించి తినాలి, లేదా పచ్చిగా తినాలి.  

3) ప్రతీరోజూ పెరుగు తింటే చిగుళ్ళ వ్యాధులు రావు. పెరుగులోని లాక్టోబాసిలి అనే బ్యాక్టీరియా నోటిలో చిగుళ్ళపై పేరుకొని ఉండే తీపి పదార్థాలను తిని జీవిస్తాయి. దానివల్ల చిగుళ్ళు శుభ్రపడి ఆరోగ్యంగా ఉంటాయి .   

4) రోజూ వీలైతే మధ్యాహ్నం భోజనం తరవాత ఒక 45 నిముషాలు చిన్న కునుకు తీయండి. ఆ కునుకు మీ గుండెను కాపాడుతుంది అని అంటున్నారు అమెరికన్ పరిశోధకులు. రోజూ మధ్యాహ్నం 45 నిముషాలు పడుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉంటుందని, దానివల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుందని అంటున్నారు వీళ్ళు. ఈ మధ్యకాలంలో మారిన జీవనశైలి వలన, రాత్రిపూట గాఢంగా నిద్రపోయే సమయం తగ్గడంతో రక్తపోటు, మధుమేహం వంటి అనారోగ్యాలు పెరిగిపోయాయని, ఆ ముప్పు నుండి తప్పించుకోవాలి అంటే, పగటినిద్ర అవసరం అని సూచిస్తున్నారు వీరు.
       
5) సన్నగా కనిపించాలి అన్న ఆరాటంతో గంటలకి గంటలు కఠిన వ్యాయామాలు చేయడం వలన, లాభం కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు నిపుణులు. వ్యాయామం చేసేముందు ఎంతసమయం వ్యాయామం చెయ్యాలి, ఎలా చెయ్యాలి వంటి విషయాలలో నిపుణుల సలహా తీసుకోవటం తప్పనిసరి అట. ఎందుకంటే అవగాహనా లేకుండా ఎక్కువ సమయం కఠిన వ్యాయామాలు చేస్తే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదంఎక్కువంటున్నారు నిపుణులు

-రమ