బాగా చదువుకోరా మంచి ఉద్యోగం వస్తుంది! అని చెబుతుంటారు తల్లిదండ్రులు. మంచిగా చదువుకుంటే నలుగురూ గౌరవిస్తారు అని హెచ్చరిస్తుంటారు శ్రేయోభిలాషులు. చదువుకుంటే విచక్షణ, విజ్ఞానం అలవడతాయి అని ఊరిస్తుంటారు పెద్దలు. కానీ బాగా చదువుకోండి నాయనా, మీకు గుండెపోటు రాకుండా ఉంటుంది అని చెబుతున్నారు పరిశోధకులు.

 

భారీ పరిశోధన

ఆస్ట్రేలియా అభివృద్ధి చెందిన దేశమే కావచ్చు. కానీ అక్కడ గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య నానాటికీ పెరిగిపోతోందట. అక్కడ ప్రతి 27 నిమిషాలకీ ఒకరు గుండెపోటుతో మరణిస్తున్నారు. పరిస్థితి ఇలా అదుపు తప్పిపోవడంతో, గుండె ఆరోగ్యానికి సంబంధించి అక్కడ ఓ భారీ పరిశోధన మొదలైంది. ఇందులో భాగంగా 2,67,153 మంది ఆరోగ్యాలను పరిశోధకులు గమనించారు. వీరంతా కూడా 45 నుంచి 64 ఏళ్ల వయసువారే!

 

డిగ్రీ - గుండెపోటు

డిగ్రీ చదివినవారితో పోలిస్తే, హైస్కూలుతో చదువుని ఆపేసినవారు గుండెపోటుకి లోనయ్యే ప్రమాదం ఎక్కువని పరిశోధనలో తేలింది. వీరు గుండెపోటుకి లోనయ్యే అవకాశం, ఏకంగా 150 శాతం ఎక్కువగా ఉన్నట్లు బయటపడింది. ఇక ఇంటర్మీడియట్‌ చదువుని ముగించినవారేమో దాదాపు 70 శాతం ఎక్కువగా గుండెపోటుకి లోనవుతున్నట్లు గమనించారు.

 

ఇవీ విశ్లేషణలు

చదువుకీ, గుండెపోటుకీ మధ్య ఉన్న సంబంధం స్పష్టంగా తేలిపోవడంతో... అందుకు కారణం ఏమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. ఉన్నత చదువుతో మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఉంటుంది. అలా ఆర్థికంగా మంచి స్థితిలో ఉండటంతో పోషకాహారాన్ని, మెరుగైన వైద్యాన్ని స్వీకరించే అవకాశం ఉంది. ఇక చదువు వల్ల ఆరోగ్యపు అలవాట్ల మీద, రకరకాల వ్యాధుల మీదా ఓ అవగాహన ఏర్పడే సౌలభ్యం ఎలాగూ ఉంటుంది.

 

ప్రయోగం వల్ల ఉపయోగం

ఈ పరిశోధన ద్వారా చిన్నిపిల్లలకైతే  ‘బాగా చదువుకోండిరా బాబూ! మీ ఆరోగ్యాలు కూడా బాగుంటాయట’ అని చెప్పగలం. కానీ ఓ నలభై ఏళ్లు దాటినవారికి ఏం చెప్పాలి. అందుకనే ఈ పరిశోధన లక్ష్యం చదువు ఆవశ్యకత గురించి చెప్పడమే కాదు. చదువుకోనివారిలో అనారోగ్య సమస్యలు ఎక్కువని తేలితే... వారిలో తగిన అవగాహననీ, వైద్య సదుపాయాలనీ కల్పించే ప్రయత్నం చేయడం.

 

 

- నిర్జర.