ఎండుద్రాక్ష, అంజీర్, ఆక్రోట్, చెర్రీస్, ఖర్జూరం మొదలైన ఎండిన పండ్లు చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇక వీటితో పాటు చాలామంది తీసుకునే బాదం, జీడిపప్పు, వాల్నట్స్ కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటన్నింటికి మించిన పోషకాలు కలిగిన గింజలు వేరే ఉన్నాయి. చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కానీ వీటిని తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఏ ఆరోగ్య సమస్య దరిచేరదు. అసలు డాక్టర్ దగ్గరకు వెళదాం అనే ప్రస్తావనే రాదు. ఇంతకీ అంత అద్భుతమైన గింజలు ఏంటో వాటిని ఎలా తినాలో తెలుసుకుంటే..
అవిశె గింజలు..
అవిశె గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. శాఖాహారులలో ఏర్పడే ఒమేగా-3 లోపాన్ని భర్తీ చేస్తుంది. శరీర తత్వాన్ని బట్టి ప్రతి రోజూ 1 నుండి రెండు స్పూన్ల అవిశె గింజలు తీసుకోవచ్చు. వీటిని వేయించి తినవచ్చు. పొడి చేసుకుని చపాతీ పిండి, కూరలలో మిక్స్ చేసుకోవచ్చు.
చియా విత్తనాలు..
చియా సీడ్స్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. కేలరీలు తక్కువగానూ, ఫైబర్ ఎక్కువగానూ ఉండటం వల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. వీటిలో కాల్షియం కూడా మెండుగా ఉంటుంది. ఎముకనలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీవక్రియ మెరుగుపరచడానికి , గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఎంజైమ్ లు హార్మోన్లను చురుగ్గా ఉంచుతాయి. చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినవచ్చు. స్మూతీలు, షేక్స్ లో మిక్స్ చేసుకోవచ్చు. సలాడ్ లలో కూడా కలుపుకోవచ్చు. రోజులో ఒక స్పూన్ విత్తనాలు తినడం మంచిది.
గుమ్మడి గింజలు..
గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను, ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి గింజలు తింటే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. వీటిని వేయించుకుని, నానబెట్టుకుని, ఇతర గింజలతో కలిపి తినవచ్చు.
నువ్వులు..
నల్లనువ్వులు టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది. షుగర్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు మంచిది. జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి. పైబర్ బాగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి. కాలేయాన్ని, శరీర రోగనిరోధక శక్తిని బలపేతం చేస్తుంది. రోజూ 1స్పూన్ వేయించిన నువ్వులను తినాలి. నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలా తయారుచేసుకుని కూడా తినవచ్చు.
పొద్దుతిరుగుడు విత్తనాలు..
పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో బాగుంటాయి. అందువల్ల గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఒక స్పూన్ వేయించిన పొద్దుతిరుగుడు విత్తనాలు తినవచ్చు.
సారపప్పు..
సారపప్పు గురించి చాలామందికి తెలియదు. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు బాగుంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సారపప్పు ఉపయోగపడతాయి. రోజులో సగం నుండి ఒక స్పూను మొత్తం సారపప్పు తినవచ్చు. వీటిని ఎక్కువగా తీపి వంటకాలు, పానీయాలలో ఉపయోగించవచ్చు. ఇవి తియ్యగా ఉంటాయి కాబ్టటి మధుమేహం ఉన్నవారు వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి.
మెంతులు..
మెంతులు చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు. మరికొందరు మొలకెత్తించి తింటారు. ఇవి తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. సెక్స్ హార్మోన్ పెంచడంలో సహాయపడుతుంది. రోజులో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి లేదా మొలకలు తెప్పించి తినవచ్చు.
*నిశ్శబ్ద.