ఆరోగ్యం అనగానే ప్రతి ఒక్కరికి శరీరం ఫిట్ గా ఉండటమే గుర్తొస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో  శారీరక సమస్యల కంటే మానసిక సమస్యలతో ఇబ్బంది పడేవారే ఎక్కువ. అందుకే మానసిక ఆరోగ్యం మీద రానురానూ అవగాహన పెరుగుతోంది. మానసిక సమస్యల కారణంగా చాలామంది సంతోషకరమైన జీవితానికి దూరం అవుతున్నారు.  విచారించాల్సిన విషయం ఏమిటంటే  తాము మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని చాలామందికి తెలియదు. కొందరు ఈ విషయాన్ని అర్థం చేసుకున్నా దానికి  తగిన వైద్యం తీసుకోలేకపోతున్నారు. మానసిక సమస్య అంటే అదేదో తప్పనే భావన, అంటరానితనంలా చూసే చూపు చాలామంది ఈ సమస్యను బయటకు చెప్పుకోవడానికి అడ్డుకుంటుంది. ఈ కారణంగానే అధికశాతం మంది మానసిక సమస్యలు అధిగమించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మానసిక ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్తలు తీసుకోలేకపోతే దాని కారణంగా తీవ్రమైన శారీరక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రపంచ స్థాయిలో మానసిక ఆరోగ్య సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటారు .

మానసిక ఆరోగ్య సమస్యలలో  ఒత్తిడి, ఆందోళన,  నిరాశ వంటి సమస్యలు చాలా సాధారణమైనవి. అయితే ఈ మూడు ఒకటి కాదు, ఇవి  ఒకదానికొకటి భిన్నమైనవి. వాటి మధ్య తేడా ఏమిటో తెలుసుకుని, వాటిని అర్థం చేసుకుంటే.. ఈ సమస్యలను అధిగమించడం కూడా సులువు అవుతుంది.

మానసిక ఒత్తిడి..

 ఒత్తిడి  ఒక సాధారణ పరిస్థితి.  అది సందర్భానుసారం వస్తూ ఉంటుంది. ఇది  మానసిక లేదా శారీరక సమస్యల వల్ల కూడా సంభవించవచ్చు.  కొన్ని సంఘటనలు లేదా ఆలోచనల కారణంగా ఒత్తిడికి గురవుతూ ఉంటారు. చాలా సందర్భాలలో ఇది దానంతటదే వెళ్లిపోతుంది. అయితే ఒత్తిడి సమస్య చాలా కాలం పాటు కొనసాగితే, అది సాధారణంగా తగ్గకపోతే   ఖచ్చితంగా  వైద్యుడిని సంప్రదించాలి.

ఒత్తిడి  అనే విషయాన్ని అర్థం చేసుకుంటే.. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా ప్రమాదం అనిపించినప్పుడు, పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు  శరీరంలో కలిగే  ప్రతిస్పందనను ఒత్తిడి అంటారు. పరిస్థితులు డీల్ చేయడం   లేదా నియంత్రించడం కష్టంగా మారుతున్నట్లు అనిపించినప్పుడు ఒత్తిడిలో ఉన్నట్టు చెబుతారు.  సహజంగా పరిస్థితులు మారడంతోనే ఒత్తిడి కూడా తగ్గిపోవడం జరుగుతుంది.

ఆందోళన ..

ఆందోళనను యాంగ్జిటీ  అని కూడా అంటారు. ఆందోళన ఉన్నవారిలో   భయం, నిలకడగా లేకపోవడం ముఖ్యంగా కలుగుతాయి. ఆందోళలనలో ఉన్నప్పుడు  చెమటలు పట్టడం, చిరాకు,  నాడీ వ్యవస్థలో మార్పులు  అనుభూతి చెందుతారు.  మరీ ముఖ్యంగా   గుండె కొట్టుకోవడం పెరుగుతుంది. ఆందోళన సమస్య తాత్కాలికం. ఇది పరిస్థితులు చక్కబడటంతో పాటే తగ్గిపోతుంది.  అయితే కొన్ని సందర్భాల్లో ఇది దీర్ఘకాలిక దుష్ప్రభావాలను కూడా  కలిగి ఉంటుంది.  ఆందోళన సమస్య మెరుగుపడకపోగా కాలక్రమేణా మరింత తీవ్రమైతే, దానిని యాంగ్జిటీ అని  అంటారు. ఈ సమస్య  రోజువారీ కార్యకలాపాలపై కూడా ప్రభావం చూపుతుంది. చాలా కాలం పాటు కొనసాగే ఈ సమస్య డిప్రెషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

డిప్రెషన్..

డిప్రెషన్ (డిప్రెసివ్ డిజార్డర్). డిప్రెషన్ ను తీవ్రమైన మానసిక ఆరోగ్య సమస్యగా పరిగణిస్తారు. ఇది ఆలోచనల నుండి పనితీరు వరకు ప్రతి విషయాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. డిప్రెషన్ విచారాన్ని పెంచుతుంది. సంతోషకరమైన జీవితం పట్ల ఆసక్తి కోల్పోయేలా చేస్తుంది. డిప్రెషన్ సమస్య పెరగడం వల్ల ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతాయి. ఇది తీవ్రమైన సమస్య, దీనికి తక్షణమే మానసిక వైద్యుడిని కలవడం చాలా అవసరం.  లేకపోతే పూర్తీ జీవితం మీద దారుణమైన ప్రభావాన్ని చూపిస్తుందిది.

ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు?

ఆందోళన,  డిప్రెషన్ మధ్య ప్రధాన వ్యత్యాసం దాని లక్షణాలే అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. డిప్రెషన్ లో ఎప్పుడూ విచారంగా ఉండటం, కుంగుబాటుకు లోనుకావడం జరుగుతుంది. అయితే ఒత్తిడి,  ఆందోళన చాలా వరకు  తాత్కాలికంగా ఉంటాయి.  కొన్ని సందర్భాల్లో వీటి వల్ల కూడా దీర్ఘకాలిక దుష్ప్రభావాల ప్రమాదం  ఉండవచ్చు. ఈ రుగ్మతలకు అనేక కారణాలు ఉండవచ్చు.  వాటిని తొలగించుకోవడానికి చాలా ఓపిక అవసరం. అన్ని వయసుల వారు ఈ సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ  మనస్సును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆరోగ్యకరమైన జీవనశైలి, మనసుకు ప్రశాంతత చేకూర్చే పనులు చేయడం అలవాటు చేసుకోవాలి.

                                                                *నిశ్శబ్ద.