లవంగాలు వంటింట్లో ఉండే ఒక మసాలా దినుసు.  చాలా రకాల ఆహార పదార్థాల తయారీలోనే కాకుండా ఔషధ గుణాలు ఉన్న కారణంగా ఏవైనా ఆరోగ్య సమస్యల కోసం కూడా లవంగాలను వాడుతుంటారు. చాలామంది రోజూ ఒక లవంగం తినడం లేదా లవంగాలు ఉడికించిన నీటిని తాగడం చేస్తుంటారు. ఇదంతా శరీరం డిటాక్స్ కావాలని, శరీరంలో ఉండే చెడు పదార్థాలు,  మలినాలు తొలగిపోవాలని, రోగనిరోధక శక్తి బలంగా మారాలని చేస్తుంటారు. అయితే మంచి లవంగాలకు బదులు నకిలీ లవంగాలను వాడితే మాత్రం ఆరోగ్యానికి మేలు జరగకపోగా.. బోలెడు నష్టాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అసలు కల్తీ లవంగాలను ఎలా కనిపెట్టాలి? కల్తీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలేంటి? తెలుసుకుంటే..

కల్తీ లేదా నకిలీ లవంగాలు..

మార్కెట్లో లభించేవన్నీ మంచి లవంగాలు అనుకుంటే పొరపాటు.  చాలా వరకు లవంగాలలో నూనెను సేకరించి, వాటిలో వాసన, సారం అనేవి అన్నీ కోల్పోయాక వాటిని అమ్ముతుంటారు. కొందరేమో వాసన, సారం, నూనె కోల్పోయిన లవంగాలకు రసాయనాలు జోడించి వాటిని అమ్ముతుంటారు. ఇవ్నీ కల్తీ లేదా నకిలీ లవంగాలు అని ఆహార నిపుణులు అంటున్నారు. ఈ లవంగాలు ఎటువంటి ప్రయోజనాలను అందించవు.  ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం కూడా ఉంటుంది. కల్తీ లవంగాలు జీర్ణం కావడం కష్టం,  గ్యాస్, కడుపు నొప్పి, ఆమ్లతత్వం,  వికారం వంటి సమస్యలకు ఇవి కారణం అవుతాయి.

కల్తీ లేదా నకిలీ లవంగాలు తినడం వల్ల కలిగే నష్టాలు..

పుఢ్ పాయిజన్..

సరిగ్గా తయారు చేయని లేదా రసాయనాలతో కల్తీ  చేయబడిన లవంగాలు ఫుడ్ పాయిజన్ కు  కారణమవుతాయి. దీని వలన వాంతులు, విరేచనాలు, బలహీనత,  తీవ్రమైన కడుపు తిమ్మిరి వంటి లక్షణాలు కనిపిస్తాయి.

శరీరంలో వాపు, తలనొప్పి..

నిజమైన లవంగాలు మంటను తగ్గిస్తాయి. కానీ నకిలీ లేదా కల్తీ  లవంగాలు ఈ లక్షణాలను కలిగి ఉండవు. బదులుగా అవి శరీరంలో మంటను పెంచుతాయి. కల్తీ లవంగాలకు రంగు,  సువాసన కోసం రసాయనాలను కలిపి ఉంటారు. ఇవి తలనొప్పి,  తలతిరుగుటకు కారణమవుతాయి.

రోగనిరోధక శక్తి మటాష్..

నిజమైన లవంగాలు యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి. కానీ నకిలీ లవంగాలు శరీరానికి ఎటువంటి ప్రయోజనాలను అందించవు. ఎక్కువ కాలం నకిలీ లేదా కల్తీ లవంగాలను ఉపయోగించడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనం అవుతుంది.

లివర్ నాశనమే..

చవకగా లభించే లవంగాలు,  రసాయనాలతో కల్తీ చేసిన సుగంధ ద్రవ్యాలు  కాలేయానికి క్రమంగా హాని కలిగిస్తాయి. ఇవి వెంటనే వాటి దుష్ప్రభావాలు బయటకి కనిపించేలా చేయకపోయినా వీటి నష్టం క్రమంగా బయటపడుతూ ఉంటుంది.

నకిలీ లేదా కల్తీ లవంగాలు గుర్తించడం ఎలా..

ఒక గ్లాసు నీరు తీసుకొని కొన్ని లవంగాలు వేయాలి. లవంగాలు కల్తీ కాకపోతే అవి  మునిగిపోతాయి, కానీ అవి కల్తీ అయితే తేలుతాయి. అంతేకాదు.. లవంగాల నుండి నకిలీ రంగులు,  రసాయనాలు విడుదల కావడం కూడా కనిపిస్తుంది.

నిజమైన లవంగాలు మంచి సువాసన, ఎక్కువకాలం కలిగి ఉంటాయి.  అదే నకిలీ లవంగాలు వాసన ఉండవు,  రంగు కూడా నిజమైన వాటితో పోలిస్తే వేరుగా ఉంటాయి.

నకిలీ లవంగాలు నల్లగా,  పొడిగా,  బరువు లేకుండా తేలికగా,  చాలా సులభంగా విరిగిపోయేలా ఉంటాయి.

                                            *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...