మధుమేహం చాలా తేలికగా అనిపించే సమస్య. ఇది చాలామందిలో కామన్ అనే ఫీలింగ్ కూడా వచ్చేసింది. కానీ మధుమేహంతో బాధపడేవారికే ఈ సమస్య ఎంత దారుణంగా ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆహారం దగ్గర చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. మధుమేహం ఉన్నవారు ఏం తినాలన్నా, తాగాలన్నా సతమతం అయిపోతుంటారు. దీనికి తగినట్టు మధుమేహం   ఉన్నవారిలో బరువు పెరగడం అనే సమస్య కూడా ఉంటుంది.  కానీ కొన్ని ఆహారాలు రుచితో పాటూ రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతాయి. అవేంటో తెలుసుకుంటే..


స్ట్రాబెర్రీలు, గ్రీన్ యాపిల్స్..

స్ట్రాబెర్రీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ పండు. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండు ఆకలిని నియంత్రించడం  ద్వారా బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గ్రీన్ యాపిల్ కరిగే ఫైబర్‌ను అందిస్తుంది.  జీర్ణక్రియను నెమ్మదిస్తుంది.  రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది బరువు నియంత్రణకు గొప్ప పండు.

బ్లూ బెర్రీస్, గుమ్మడికాయ..

బ్లూ బెర్రీస్ విదేశాలలో పండటం మూలానా ఇవి భారతీయులకు అరుదుగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే బ్లూబెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా మధుమేహానికి మేలు చేస్తాయి. ఇందులో ఉండే అధిక ఫైబర్ బరువు తగ్గడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. అదేవిధంగా గుమ్మడికాయలో పిండి పదార్థాలు, కేలరీలు తక్కువగా ఉంటాయి. దీనిలో నీటి కంటెంట్ ఎక్కువ.  దీని కారణంగా బరువు తగ్గడానికి ఇది సహాయపడుతుంది.

పెసలు..

  పెసలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది.  రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్ శరీరానికి శక్తిని ఇస్తూ నెమ్మదిగా జీర్ణమవుతుంది. ఈ కారణంగా ఎక్కువసేపు ఆకలిని నియంత్రించి బరువును నియంత్రణలో ఉంచుతుందియ.

కాల్చిన శనగలు, శనగపిండి..

శనగపిండి అయినా, కాల్చిన లేదా వేయించిన శనగలు అయినా మధుమేహం ఉన్నవారికి మంచివి. శనగలలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది.  ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. డయాబెటిక్ రోగులకు ఇది మంచి ఆహారం కావడానికి ఇదే కారణం. ఇది శరీరానికి శక్తిని అందించడానికి,  బరువును నియంత్రించడానికి చక్కని ఎంపిక.

బీట్రూట్..

బీట్రూట్  తీసుకోవడం ద్వారా  అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. దీని వినియోగం రక్తపోటును తగ్గిస్తుంది,  ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరుస్తుంది. తక్కువ కేలరీలు,  పోషకాలు పుష్కలంగా ఉండే ఈ పదార్థాన్ని తీసుకోవడం బరువు నిర్వహణలో సహాయపడుతుంది.

మిల్లెట్స్..

అధిక ఫైబర్ కంటెంట్ కారణంగా మిల్లెట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఇది శక్తిని ఇస్తుంది,  బరువు తగ్గాలనుకునే వారికి  మంచి ఎంపిక. ఈ ఆహార పదార్థాలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో  బరువును మైంటైన్ చేయడంలలో  సహాయపడుతుంది.

                              *నిశ్శబ్ద.