ఉదయం బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యానికి ఏoతో మంచిదని డాక్టర్లు చెబుతుంటారు . అయితే టైం లేదనో, బద్ధకించో బ్రేక్ ఫాస్ట్ మిస్ చేస్తుంటాం. కానీ ఎట్టి పరిస్థితులలోనూ బ్రేక్ ఫాస్ట్ తీసుకోకుండా ఉండద్దు.  అది కోరి అనారోగ్యాలని కొని తెచ్చుకోవటమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే సాధారణంగా రాత్రి భోజనానికి, పొద్దున్న చేసే బ్రేక్ ఫాస్ట్ కి మధ్య దాదాపు పన్నెండు గంటల సుదీర్ఘ విరామం వుంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయులు తగ్గిపోతాయి. ఆ శక్తిని మళ్ళీ పుంజుకోవాలంటే బ్రేక్ ఫాస్ట్ తీసుకుని తీరాలి.

* బ్రేక్ ఫాస్ట్ చేయని వారితో పోలిస్తే చేసిన వారి మెదడు పనితీరు చురుగ్గా ఉంటుందని పలు అధ్యయనాలలో తేలింది.

* బరువు తగ్గాలనుకునేవారు బ్రేక్ ఫాస్ట్ అస్సలు మానకూడదు. పొద్దున్నే ఏమన్నా తినటం వల్ల జీవక్రియల వేగం పెరుగుతుంది .

*  మాంసకృత్తులు , పిండి పదార్దాలు, ముఖ్యంగా పీచు పదార్థాలు అధికంగా ఉండే ఆహరం తీసుకోవాలి.

*  ఉదయం బ్రేక్ ఫాస్ట్‌తో పాటు పండ్లు, పండ్ల రసాలు, తప్పనిసరిగా తీసుకోవాలి.

*  ఏ రోజన్నా బ్రేక్ ఫాస్ట్ చేసే టైం లేదు అనిపిస్తే పూర్తిగా ఏమి తినకుండా ఉండటం కన్నా, కీరా , క్యారట్ , ఆపిల్ , అరటిపండు వంటివన్నా తినాలి. గుప్పెడు వేరుసెనగలు లేదా కాసిని జీడిపప్పుతో పాటు ఓ గ్లాసు మజ్జిగ తాగినా చాలు.

*  ఖాళీ కడుపుతో ఉండకుండా ఏదో ఒకటి తీసుకుంటే శరీరానికి శక్తి, మెదడుకు చురుకు  వస్తాయి.

-రమ