అందం అంటే చర్మం తెల్లగా ఉండటం అని చాలామంది అనుకుంటారు. అందుకే చర్మం తెల్లగా అవ్వడం కోసం చాలా రకాల స్కిన్ క్రీములు, స్కిన్ ట్రీట్మెంట్లు ట్రై  చేస్తూ ఉంటారు. మార్కెట్లో  కూడా చర్మాన్ని తెల్లబరిచే సోపులు,  క్రీములు అంటూ చాలా రకాల ఉత్పత్తులు ఉంటాయి.  ఇలాంటి క్రీములు, సోపులు వాడటం వల్ల చర్మంలో చాలా మార్పు వచ్చిందని సోషల్ మీడియాలో కూడా చాలా రివ్యూస్ వస్తూ ఉంటాయి.  వీటిని చూసి మరెంతో మంది వీటిని వాడటానికి ఆసక్తి చూపిస్తారు. అయితే చర్మం తెల్లగా మారాలని స్కిన్ క్రీములు వాడేవారికి చర్మ సంరక్షణ నిపుణులు షాకింగ్ నిజాలు చెబుతున్నారు. అవేంటో తెలుసుకుంటే..

క్రీముల వెనుక రహస్యం..

చర్మం చాలా తొందరగా తెల్లబడటం కోసం ఉపయోగించే క్రీములలో సాధారణం కంటే ఎక్కువ మోతాదులో పాదరసం, సీసం వంటివి కలుపుతారట.   ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది. దీని ఫలితంగా 10 నుండి 15 రోజులలో చర్మం తెల్లగా కనిపిస్తుంది. ఈ కారణంగా ఈ క్రీములు, సోపులు చాలా ప్రబావవంతంగా పని చేస్తాయని అందరూ అనుకుంటారు. అయితే పెద్ద మొత్తంలో సీసం, పాదరసం కలపడం చట్టవిరుద్ధం.  ఇలాంటి క్రీములు, సోపులు ఎక్కువ కాలం లేదా రోజులో ఎక్కువ సార్లు వాడటం వల్ల మూత్రపిండాలు, మెదడు , ఇతర అవయవాలకు తీవ్రమైన నష్టం వాటిల్లవచ్చు. అధిక స్థాయిలో ఉన్న పాదరసం 10 నుండి 12 రోజులలోనే మూత్రపిండాలపై ప్రభావం చూపడం ప్రారంభిస్తుందని, అదే తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ, చాలా నెలల పాటు ప్రతిరోజూ వాడటం వల్ల క్రమంగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.

చర్మం మాత్రమే కాదు..

చర్మం తెల్లబడటానికి ఉపయోగించే క్రీముల వల్ల కలిగే   ప్రభావాలు చర్మానికి మాత్రమే పరిమితం కావు. పాదరసం చర్మం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మూత్రపిండాలు , ఎముక మజ్జలో పేరుకుపోతుంది. వైద్యుల ప్రకారం, ఇది క్రమంగా మూత్రపిండాల పనితీరును ప్రభావితం చేస్తుంది.   ఇది తీవ్రంగా మారితే  డయాలసిస్‌కు కూడా దారితీయవచ్చు. ఇది చేతులు వణకడం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఆందోళన, నిద్రలేమి, చిరాకు , ఏకాగ్రత తగ్గడం వంటి నాడీ సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. కొన్ని సందర్భాల్లో, వినికిడి సమస్యను,  కంటిచూపును  కూడా ప్రభావితం చేస్తుంది.

ఇలాంటి క్రీములు వాడకూడదు..

సీసం స్థాయిలు  పరిమితికి మించి ఎక్కువగా ఉండే క్రీములు వాడకూడదు. చర్మాన్ని తెల్లగా చేయడంలో సీసానికి ప్రాధాన్యత లేదు.  దీని వాడకం  ఉపయోగం ఏమీ లేదని నిపుణులు అంటున్నారు. పాదరసం, సీసం.. లేదా వాటి ముడి పదార్థాలు ఉండే ఉత్పత్తులు అసురక్షితమైనవని చెబుతారు.  సీసం శరీరంలో పేరుకుపోయి మెదడు, మూత్రపిండాలు, రక్తాన్ని ఉత్పత్తి చేసే అవయవాలు , పునరుత్పత్తి వ్యవస్థకు హాని కలిగించగలదని చెబుతారు. ఏ కొంచెం  సీసం కూడా  సురక్షితం కాదని, అది పాదరసంతో కలిస్తే ఆరోగ్య ప్రమాదాలు మరింత పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కేవలం నిగారింపు కోసం ఎలాంటి క్రీమ్‌ను ఉపయోగించవద్దని చర్మ నిపుణులు సలహా ఇస్తున్నారు.  ముఖంపై మచ్చలు లేదా పిగ్మెంటేషన్ సమస్యలు ఉంటే, ముందుగా చర్మ సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం మంచిది.

                              *రూపశ్రీ.