ఏ జబ్బు వచ్చినా దాన్ని నయం చేయడానికి మందులు చాలా అవసరం. మందులను సరైన సమయంలో తీసుకోవాలి.  అలాగే వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం అస్సలు మంచిది కాదు.  అయితే  కొన్ని మందులను డాక్టర్ల సలహా లేకుండా ఎలాంటి సంకోచం లేకుండా ఎక్కువ కాలం పాటు సమస్య అనిపించినప్పుడల్లా వాడుతూనే ఉంటారు. మరీ ముఖ్యంగా ఎక్కువకాలం పాటు మధుమేహం,  గ్యాస్ సమస్యలకు మందులు వాడుతూనే ఉంటారు. ఈ మందుల వాడకం వల్ల విటమిన్ లోపాలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. అందులోనూ విటమిన్-బి12 చాలా అరుదుగా లభించే విటమిన్.  ఈ విటమిన్-12 విటమిన్ డయాబెటిస్,  అసిడిటి మందుల వాడకం వల్ల తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి వివరంగా తెలుసుకుంటే..

డాక్టర్ దగ్గరకు వెళ్లి వైద్యుల వద్ద రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే అలవాటు భారతదేశంలో చాలా తక్కువ. మరీ ముఖ్యంగా గ్యాస్ సంబంధిత సమస్యలు,  డయాబెటిస్ వంటి   సమస్యలకు ఎక్కువ సార్లు వైద్యులను కలవాల్సిన అవసరం లేదని అనుకుంటారు.  ఈ సమస్యలు ఉన్నప్పుడు ఒకసారి వైద్యులను కలిస్తే వారు రాసిచ్చిన మందులను అలా జీవితాంతం అయినా మింగుతూ సమస్యను నిద్రపుచ్చే ఆలోచనలో ఉంటారు. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ మందులను డాక్టర్ ను కలిసిన ప్రతి సారి డోస్ తగ్గించడం, ఎక్కించడం జరుగుతుంది.  ఇది తెలియకుండా ఒకే డోస్ ను దీర్ఘకాలం వాడటం విటమిన్ స్థాయిల మీద ప్రమాదం చూపిస్తుంది.

 గ్యాస్, డయాబెటిస్ కు సంబంధించిన మందులను సంవత్సరాల తరబడి డాక్టర్ సలహా లేకుండా రెగ్యులర్ గా వాడుతూ ఉంటే అది శరీరంలో విటమిన్-బి12 లోపానికి కారణం అవుతుందని వైద్యులు చెబుతున్నారు.

లక్షణాలు ఇవే..

అలసట,  తలతిరుగుడు,  తిమ్మిరి, చేతులు కాళ్లలో జలదరింపు వంటి సమస్యలు విటమిన్-బి12 లోపిస్తే వస్తాయి. మెట్లు ఎక్కడం కష్టంగా అనిపించడం,  మతిమరుపు వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.

విటమిన్-బి12 ఎంత ఉండాలి..

నేషనవ్ ఇన్స్టిట్యూట్ ఆప్ హెల్త్ ప్రకారం సీరం,  ప్లాస్మా లో విటమిన్-బి12 స్థాయిలు 200 లేదా 250pg/ml కంటే తక్కువగా ఉంటే ల్యాబ్ రిపోర్ట్ లలో అది చాలా తక్కువగా ఉన్నట్టు.  ఇది విటమిన్-బి12 లోపాన్ని సూచిస్తుంది.

గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కవ కాలం వాడటం వల్ల పేగులలో  విటమిన్-12 శోషణ దెబ్బతింటుంది. అలాగే కడుపు ఆమ్లాన్ని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల   ఆహారం నుండి ప్రోటీన్ విడుదల జరగదు.  అందుకే గ్యాస్, డయాబెటిస్ మందులను ఎక్కువ కాలం డాక్టర్ సలహా లేకుండా వాడటం మంచిది కాదని అంటున్నారు.  

                          *రూపశ్రీ.


గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...