వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) పిలుపు మేరకు 2015, ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నాం. ఈ ఏడాది హెల్త్ డేని పురస్కరించుకుని మన ఆరోగ్యానికి హానికి కలిగించే ఆహార పదార్ధాలను మనం దూరం పెట్టాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సూచిస్తోంది. ఆహారం ద్వారా అనారోగ్యం ప్రబలకుండా చూసుకోవాలని హెచ్చరిస్తోంది. ఇటీవలి కాలంలో ఆహారం కారణంగా అనారోగ్యం బాగా పెరుగుతోందని, ఈ విషయంలో అందరూ అప్రమత్తంగా వుండాల్సిన అవసరం వుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. ఈ సందర్భంగా “From farm to plate, make food safe.” అనే స్లోగన్‌ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇస్తోంది. ఒక ఆహార పదార్ధం తోట లేదా పొలంలో వున్నప్పటి నుంచి అది రకరకాల ప్రాసెస్‌కి గురై మన నోటి దగ్గరకు వచ్చే వరకూ అనేక రకాల విధ్వంసాలకు గురవుతోంది. మొదట స్వచ్ఛంగా వున్న ఆహారం మనవరకూ వచ్చేసరికి అనేక రసాయన ప్రక్రియలకు గురవుతోంది. ఫలితం.. అమృతం లాంటి ఆహారం విషతుల్యమైపోతోంది. పైకి రుచిగా వున్నప్పటికీ, అలాంటి ఆహారం లోపల విషం వుంటోంది. ఈ విషయం గురించే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది.
‘‘ఆహార తయారీ అనేది పరిశ్రమగా మారిపోయిన తర్వాత, గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల ప్రపంచం చిన్నదైపోయిన తర్వాత ఏ దేశంలో తయారైన ఆహారపదార్ధాలైనా ఏ మారుమూల వున్న దేశానికి అయినా సులభంగా వెళ్ళిపోతున్నాయి. తయారీలో మాత్రమే కాకుండా ఆహార పదార్ధాల నిల్వ, రవాణా... ఇలా అనేక సందర్భాలలో ఆహార పదార్ధాలు విషపూరితం అవుతున్నాయి. బ్యాక్టీరియా, వైరస్, పరాన్నజీవులు, రసాయనాలు మనం తినే ఆహారం ద్వారా మనలో చోటు సంపాదించుకుంటున్నాయి. ఈ విషయంలో మనం అప్రమత్తంగా వుండకపోతే అది చాలా విపరిణామాలకు దారితీసే అవకాశం వుంది’’ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనర్ డాక్టర్ మార్గరెట్ చాన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆహార పదార్ధాల ద్వారా మనలోకి సరఫరా అవుతున్న బ్యాక్టీరియా, వైరస్, పరాన్న జీవులు, రసాయనాల ద్వారా దాదాపు 200 రకాల అనారోగ్య సమస్యలకు మనుషుల్ని గురిచేస్తున్నాయని ఆయన వెల్లడించారు. కేవలం మాంసాహారాల విషయంలో మాత్రమే కాకుండా పళ్ళు, కూరగాయల ద్వారా కూడా ఇలాంటి విషాలు మన శరీరంలోకి చేరుతున్నాయని ఆయన వివరిస్తున్నారు.