అనారోగ్యం రావడానికి కారణం ఏంటి?? ఆలోచిస్తే.. సరియైన ఆహారము, క్రమబద్ధమైన జీవన విధానము లేనివారికి అనారోగ్యం రావడం జరుగుతుందనే విషయం తెలుస్తుంది. ఆ సమయాల్లో చాలామంది చేసే తప్పు ఒకటి ఉంటుంది. మనకు వచ్చినవన్నీ చిన్న రోగాలే అనే అపోహతో కొందరు, పెద్ద జబ్బు సూచనలు కనిపించినా ఇది చిన్నదే అనే అపోహతో మరికొందరు ఏ మెడికల్ స్టోర్ కో వెళ్లి మందులు తెచ్చుకుని సొంత వైద్యం చేసుకుంటారు. అది చాలా పెద్ద తప్పు.
కొన్ని జబ్బుల లక్షణాలు ఒకే విధంగా ఉన్నా ఆ జబ్బు మాత్రం వేరేగా ఉంటుంది. ఇలాంటి సమస్యను దృవీకరించాల్సింది వైద్యులు తప్ప మనం కాదు కదా.. కానీ చాలామంది ఇదిగో ఇదే నాకు వచ్చిన సమస్య అని డిసైడ్ చేసేస్తూ ఉంటారు. ఏ వ్యాధి అనే విషయం తెలుసుకోకుండా పైన కనుపించే లక్షణాలను బట్టి మందులు వాడుకోవటం వల్ల వ్యాధి తగ్గకపోగా కొన్ని సమయాలలో వాడబడిన మందులవల్ల శరీరంలో అనేక దుష్పరిణామాలు సంభవించే అవకాశం కూడా ఉంటుంది. కొన్ని పరిస్థితులల్లో ఇలాంటి దుష్పరిణామాలను నివారించటం వైద్యులకు కూడా సాధ్యం కాకపోవచ్చు. అందువల్ల మందులనేవి స్వయంగా వాడుకోవటం చాలా చెడ్డ అలవాటు.
ప్రస్తుతకాలంలో అందరూ ఓ అలవాటుగా సేవించే కాఫీ,టీ, లాంటివి కూడా శరీరానికి అనారోగ్యం కలిగించేవే.. వీటిని తీసుకున్నందువల్ల తాత్కాలికంగా శరీరానికి ఉత్తేజము, ఉత్సాహము కలుగవచ్చు కానీ వాటి ప్రభావం శరీరానికి ఏమంత లాభకరమైందికాదు. అధికంగా కాఫీలు, టీలు తీసుకునేవారికి కొంతకాలమైన తరువాత అవి తీసుకోకపోతే నిస్సత్తువ, చిరాకు, పనులమీద ఏకాగ్రత కుదరకపోవడం వంటివి ఏర్పడతాయి. ఇలాంటి వాటికి అలవాటు పడటం వల్ల నాడీ బలహీనత సమస్య ఎదురై, నిత్యం తలనొప్పితో బాధ పడటం జరుగుతుంది. ఈ ప్రభావం జీర్ణకోశంపై కూడా పడి కడుపు ఉబ్బరం, గ్యాస్ లాంటి వ్యాదులకు లోనయ్యే ప్రమాదముంది.
గుండెవ్యాధులు, కాన్సర్ లాంటి భయంకర వ్యాధులు రావడానికి ధూమపానం వాడకాలు ముఖ్యమని చెప్పాలి. సిగరేట్, చుట్ట, బీడీ లాంటివి త్రాగటంవల్ల ఆ పొగను కొంత బైటికి వదలటం వల్ల వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. పొగాకు పొగత్రాగే వారికెంత హానికరమో, బైటగాలిలో వదలిన పొగను వారికి తెలియకుండా పీల్చే వారికి కూడా అంతే హానికరంగా పరిణమిస్తుంది. పొగాకు నమలటం, జరదా కిళ్ళీలు వేయటం వల్ల కూడా హృద్రోగాలు, కాన్సర్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ప్రధానంగా ధూమపానం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతిని దాని కారణంగా కాన్సర్, హార్ట్ ఎటాక్ లాంటివి సంభవిస్తుంటాయి. పొగాకు నమిలేవారికి నోరు, పళ్ళు, గొంతు, స్వరపేటికలకు సంబంధించిన తీవ్రవ్యాధులు సంక్రమించే ప్రమాదం ఎక్కువ.
మన శరీరానికి జబ్బు తెచ్చిపెట్టే కొన్ని అలవాట్లు గమనిస్తే…
ప్రతిరోజు స్నానం చెయ్యకుండా ఉండటం మొదటి అలవాటు. శరీర శుభ్రత లేకపోతే జబ్బులు రావడానికి మొదటి మార్గం మనమే ఇచ్చినట్టు. క్రమబద్దము లేని భోజనము చేయడం. రోజుకొక వేళలో భోజనం చేయడం వల్ల శరీరం ఏ సమయానికి శక్తిని తయారు చేసుకోవాలో నిర్ణయించుకోలేదు.
అధికంగా ఉపవాసములు చేయడం పెద్ద సమస్యలకు కారణం అవుతుంది. నిజానికి ఉపవాసం అనేది కూడా ఆరోగ్య ప్రయోజనం కోసం ఏర్పాటు చేసిందే అయినా దాన్ని అతిగా పాటిస్తే శరీరానికి నష్టం చేకూరుతుంది.
బయట తయారుచేసిన పదార్థాలు తినడం వల్ల కలిగే నష్టం అందరికీ తెలిసిందే. అలాగే శీతల పానీయాలు, చల్లని పదార్థాలు తినడం కూడా నష్టమే. ప్యాకేజ్డ్ ఫుడ్స్ లో ఫుడ్ చెడిపోకుండా వాయువులు నింపుతారు కాబట్టి వాటిని తిన్నా అనారోగ్యం వెంట వస్తున్నట్టే..
చాలామంది శారీరక సమస్యల విషయంలో సంకోచం చెందుతారు. కానీ అతిగా శృంగారంలో పాల్గొనడం ఎంత చేటు చేస్తుందో.. అసలు శృంగారం జోలికి పోకుండా సన్యాసిలా బ్రతకడం ఈకాలంలో అంతే చేటు చేస్తుంది.
ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకునేటప్పుడు నోరు శుభ్రంగా లేకపోతే జబ్బులు వస్తాయి.
సౌకర్యవంతమైన దుస్తులు కాకుండా ఫ్యాషన్ పేరుతో బిగుతుగా ఉన్నవి ధరించడం. శరీరంలో అవయవాల ఒత్తిడికి కారణమై తద్వారా వాటి క్రమబద్ధత తప్పేలా చేస్తుంది. ఆకుకూరలు–పౌష్టికాహారములు వాడకుండా ఉండటం కూడా అనారోగ్యానికి మూలకారణమే.
మన శరీరానికి అనారోగ్యం దాపురించడానికి ఇన్ని కారణాలు ఉన్నాయి చూడండి.
◆నిశ్శబ్ద.