నిద్ర గొప్ప ఔషదం అని అంటారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం వంటివి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి, రాత్రి మంచి నిద్ర రావడానికి కూడా ముఖ్యమైనవి. రాత్రి సమయంలో 6-8 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రపోవడం ఎంతో అవసరం. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా రక్తపోటు, హృదయ స్పందన రేటును అదుపులో ఉంచుతుంది. అయితే నిద్ర బాగా పట్టాలంటే శరీరంలో తగినంత మెలటోనిన్ అవసరం. దీన్నే స్లీప్ హార్మోన్ అని కూడా అంటారు. మన శరీరం సహజంగానే ఈ హార్మోన్‌ను ఉత్పత్తి చేస్తుంది. బయట చీకటి పడడం ప్రారంభించినప్పుడు శరీరంలో మెలటోనిన్ ఉత్పత్తి అవుతుంది. కానీ కొందరిలో ఈ హార్మోన్ సరిగా ఉత్పత్తి కాకపోవడం వల్ల నిద్ర విషయంలో పలు ఇబ్బందులు తలెత్తుతాయి.
మంచి నిద్ర లేకపోవడం వల్ల ఏర్పడే సమస్యలేంటి? నిద్ర బాగా పట్టాలంటే అదనంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మెలటోనిన్ తగినంత ఉత్పత్తి కావడానికి ఏం చెయ్యాలి? పూర్తీగా తెలుసుకుంటే..
నిద్రలేమి వల్ల వచ్చే సమస్యలు..
కనీసం ఒక్క రాత్రి అయినా సరే సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు అలసట, కోపం, చిరాకు వంటివి స్పష్టంగా కనిపిస్తాయి. ఇది కొన్ని వారాల పాటు కొనసాగితే నిద్ర సమస్యలు మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ మంచి నిద్ర కోసం ప్రయత్నం చెయ్యాలి. కొన్ని పనులు చేయడం ద్వారా సహజంగా శరీరంలో మెలటోనిన్ స్థాయిని పెంచుకోవచ్చు.
సూర్యరశ్మి..
సూర్యకాంతిలో ప్రతిరోజూ కొంత సమయం గడపడం వల్ల విటమిన్ డి ఉత్పత్తిని మాత్రమే కాదు మెలటోనిన్ కూడా ఉత్పత్తి కావడంలో సహాయపడుతుంది. ఉదయం కనీసం 15 నిమిషాల పాటు ఎండలో ఉండడం చాలా ముఖ్యం. ఇది మెలటోనిన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. కొందరు రాత్రిపూట నిద్ర సరిగా లేకపోవడం వల్ల పగటిపూట కనుకుపాట్లు పడుతుంటారు. అయితే ప్రతిరోజూ తగినంత సేపు సూర్యరశ్మిలో ఉండటం వల్ల ఈ సమస్య తొలగిపోయి రాత్రి పూట మంచి నిద్ర పడుతుంది.
గది వాతావరణం..
మంచి నిద్ర రావాలన్నా, మెలటోనిన్ స్థాయిలను మెరుగుపరచాలన్నా నిద్రపోయే గది వాతావరణాన్ని సరిగ్గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. గదిని చీకటిగా, నిశ్శబ్దంగా ఉంచడం వల్ల మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగవుతుంది. నిద్ర నాణ్యతను మెరుగుపరుస్తుంది. గదిని చీకటిగా ఉంచడం వల్ల రాత్రిపూట తరచుగా నిద్రకు అంతరాయం ఏర్పడే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
స్క్రీన్ సమయం..
స్క్రీన్ సమయాన్ని అంటే మొబైల్-కంప్యూటర్‌లో గడిపే సమయాన్ని తగ్గించడం ద్వారా నిద్ర నాణ్యతను మెరుగుపరచవచ్చు. నిద్రించడానికి కనీసం గంట ముందు కంప్యూటర్, డిజిటల్ పరికరాలను దూరంగా ఉంచాలి. ఈ పరికరాల నుండి వెలువడే నీలి కాంతి మెలటోనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. స్క్రీన్ టైమ్ నిద్ర సమస్యలను పెంచడమే కాకుండా శరీరంలోని అనేక ఇతర సమస్యల ప్రమాదాన్ని కూడా కలిగిస్తుంది.
*నిశ్శబ్ద.