ప్రపంచాన్ని వణికించిన మహా భూతం మళ్లీ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి తయారైంది. కరోనా ప్రపంచ దేశాలలో ఎంత మృత్యు తాండవం చేసిందో అందరికీ తెలిసిందే. దేశాలకు దేశాలు కరోనా కారణంగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని దారుణంగా చవి చూశాయి. 2020, 2021 సంవత్సరాలలో కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అందరూ మర్చిపోకముందే మళ్లీ మళ్లీ కొత్త రూపాలలో ఇది ప్రపంచం మీద దండ యాత్ర చేస్తూనే ఉంది. 2023 ముగియడానికి ముందు ఇప్పుడు మళ్లీ ప్రాణాలను బలిగొనడానికి కరోనా సిద్దమైంది. కోవిడ్ కొత్త వెరియంట్ JN.1 ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యూఎస్ లో నమోదైంది. అప్పటినుండి ఈ కేసులు పెరుగుతూ వస్తన్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది.
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవా నుండి వచ్చిన నమూనాలో 15కరోనా కేసులు కొనుగొన్నారు. చివరిసారిగా వచ్చిన కరోనా వేరియంట్ కంటే ఈసారి వచ్చిన వేరియంట్ ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది.
కరోనా కొత్త వేరియంట్ JN.1 లక్షణాలు.. సంకేతాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే..
COVID-19 మహమ్మారి ప్రపంచానికి పరిచమైన నాలుగేళ్లు గడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇది బలితీసుకున్న ప్రాణాలు ఎన్నో.. దీని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇది రూపం మార్చుకుని వ్యాప్తి చెందుతూనే ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో తాజాగా బయటపడిన JN.1 వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.Omicron XBB సబ్‌వేరియంట్ నుండి JN.1 వేరియంట్ పుట్టిందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో ముక్కు కారటం, గొంతు నొప్పి , పొడి దగ్గు వంటి చిన్న లక్షణాలు కనిపిస్తాయట. కానీ దీన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం ముప్పు తప్పదని అంటున్నారు.
JN.1 ప్రధాన సంకేతాలు, లక్షణాలు..
కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్ లక్షణాలు జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట. ఈ లక్షణాలు ఫ్లూ, ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి వేరు చేయలేవు. రోగికి ఈ లక్షణాలు ఉంటే అవి తేలికపాటివి అయితే కేవలం ఈ జబ్బులకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కొత్త వేరియంట్ పరిస్థితి విషమించితే మాత్రం శ్వాస ఆడకపోవడం అనే ప్రమాదకర సమస్య ఎదురవుతుంది.
కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకర లక్షణాలు తెలుసుకుంటే..
దగ్గు: నిరంతరం దగ్గు రావడం కొత్త వేరియంట్ లో సాధారణ లక్షణం.
జలుబు : ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.
గొంతు నొప్పి: గొంతు నొప్పి లేదా గొంతులో అసౌకర్యం ఉంటుంది.
తలనొప్పి: JN1 వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు.
జీర్ణాశయ సమస్యలు.. అతిసారం, ఆహారం సహించలేకపోవడం, ఆకలి లేకవోవడం జీర్ణశయాంతర లక్షణాలు సంభవించవచ్చు.
తేలికపాటి శ్వాస ఆడకపోవడం: కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తేలికగా శ్వాస ఆడకపోవడం గమనించవచ్చు.
గతంలో కరోనా కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పై లక్షణాలలో ఏవైనా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లో ఉండటం ముఖ్యం. ఇప్పుడు కరోనా గురించి భయాందోళనలు పుడుతున్న పరిస్థితులలో జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని విస్మరించడం వల్ల ఆ వ్యక్తికే కాదు, కుంటుంబ సభ్యులకు చుట్టుప్రకక్ల వారికి కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగడం మానుకోవడం, భౌతిక దూరాన్ని పాటించడం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం వంటి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. ఎవరిని వారు కాపాడుకోవడానికి ఉన్న శక్తివంతమైన మార్గం ఇదే.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా దాన్ని తీసుకోవడం ద్వారా కరోనా ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.
*నిశ్శబ్ద.