రోజూ పండ్లు తినడం వల్ల లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మొత్తం శరీరం  మెరుగైన పనితీరుకు అవసరమైన అన్ని పోషకాలను పండ్లు కలిగి ఉంటాయి. పండ్లలో పొటాషియం, ఫైబర్, విటమిన్ సి, ఫోలేట్, ప్రొటీన్, కాల్షియం, విటమిన్లు,  మినరల్స్ ఉంటాయి. పండ్లు క్రమం తప్పకుండా తినడం వల్ల రక్తపోటు తగ్గుతుంది, గుండె జబ్బులు,  పక్షవాతం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది, మధుమేహం నియంత్రణలోనూ, స్థూలకాయాన్ని తగ్గించడంలోనూ, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. కంటి సమస్యలు,  జీర్ణ సమస్యలను నివారించడానికి,  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం ద్వారా వ్యాధులను నివారించడానికి పండ్లు మంచి ఔషదం.

ఆయుర్వేదంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, ఆహారపు అలవాట్లు, జీవనశైలి నియమాలు, కాలానుగుణ నియమాలు ఇలా  మరెన్నో జాగ్రత్తలు ఉంటాయి. పండ్లను సరైన పద్ధతిలో తినడానికి కూడా ఆయుర్వేదం నియమాలను సూచించింది. తద్వారా  పండ్ల నుండి గరిష్ట ప్రయోజనాలను పొందవచ్చు. పండ్లు ప్రపంచంలోనే అత్యంత ఆరోగ్యకరమైన ఆహారాలు.   వాటిని సరైన మార్గంలో  తీసుకుంటే ఆరోగ్యానికి గొప్ప ప్రయోజనం ఉంటుంది. తప్పుడు మార్గంలో,  తప్పు సమయంలో పండ్లు తినడం వల్ల ప్రయోజనాలకు బదులుగా హాని కలుగుతుంది. పండ్లు ఎలా తీసుకోకూడదో ఆయుర్వేదం చెప్పిన నియమాలు ఏంటో తెలుసుకుంటే..


ఆహారంతో పాటు పండ్లు తినకూడదు..


చాలా మంది ఈ తప్పు చేస్తుంటారు. ఆహారంతో పాటు పండ్లు తినడం వల్ల పేగుల్లో విషపదార్థాలు పేరుకుపోతాయి. ఆయుర్వేదంలో కొన్ని విషయాలను 'ఆమ' అంటే విషపదార్థాలు అంటారు. ఆహారంతో పాటు పండ్లను తీసుకోవడం వల్ల అజీర్ణం ఏర్పడుతుంది. ఇది కాకుండా అనేక చర్మ సమస్యలు,  వాపులు వచ్చే ప్రమాదం కూడా ఉంది.


పండ్లను జ్యూస్ చేస్తే  ప్రాణానికే ముప్పు..

చాలా సులువుగా ఉంటుందని ఎక్కువ మంది పండ్లు తినడం కంటే పండ్ల రసాన్ని తీసుకోవడానికి ఇస్టపడతారు. అయితే పండ్ల రసం తీసుకున్నంత  మాత్రాన ప్రయోజనం ఉండదు.  పండ్ల నుండి ఎక్కువ పోషకాలను పొందడానికి  మొత్తం పండు తినాలి.  రసం తాగడం ద్వారా  ఫైబర్ తో పాటు  అనేక ఇతర మూలకాలను కోల్పోతారు.

డిన్నర్‌లో లేదా సాయంత్రం తర్వాత పండ్లు తినవద్దు..

ఆయుర్వేదం ప్రకారం  పండ్లను సాయంత్రం లేదా రాత్రి భోజనం చేసినప్పుడు తీసుకోకూడదు.  ఈ సమయాన్ని కఫా కాలం అని, ఈ కాలంలో పండ్లు జీర్ణం కావడానికి చాలా బరువుగా ఉంటాయని,  ఇది దోష అసమతుల్యతకు దారితీస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు.

పాలలో పండ్లను కలపవద్దు..

పాలతో పండ్లను తినడం విరుద్ధ ఆహారం అని ఆయుర్వేదం చెబుతోంది. చాలామంది పాలను పండ్లను మిక్సీ పట్టి మిల్క్ షేక్ చేసుకుని ఇష్టంగా తాగుతుంటారు.   అరటిపండు తియ్యగా ఉన్నప్పటికీ పేగులకు భారంగా ఉంటుంది. అందుకే అరటిపండ్లు పాలు కలిపి తినకూడదు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి.

ఎల్లప్పుడూ సీజనల్ పండ్లను మాత్రమే తినాలి..

సీజన్‌లో లభించే పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది. ఇతర పండ్లు రసాయనాల ద్వారా ఎక్కువ కాలం భద్రపరచబడతాయి. సీజనల్ లేని పండ్లను తినడం ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది. పైపెచ్చు సీజన్ కాని పండ్లు సహజంగానే ఎక్కువ ధరకు అమ్ముతుంటారు. కాబట్టి సీజన్ లో లభించే పండ్లను తాజాగా ఉన్నట్టే తినాలి.

                                                       *నిశ్శబ్ద.