నీటి ఉనికి ఉన్న చోట మానవ మనుగడ సాధ్యమవుతుందని అంటారు. మనుషులకే కాకుండా సకల జీవకోటికి నీరు అవసరం.  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే..  ప్రతిరోజూ  8 గ్లాసుల నీరు తాగాలని చెబుతూ ఉంటారు. ఇక లీటర్లలో అయితే 2 నుండి 3 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలని కూడా అంటారు.  కానీ చలికాలంలో చాలా మంది నీరు తాగడం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటారు. చలికారణంగా చాలా మందికి దాహం అనిపించదు.  దీని కారణంగా నీరు ఎక్కువగా తాగరు. అయితే చలికాలంలో ఎన్ని గ్లాసుల నీరు తాగానే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు.


శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు నీరు కూడా బాగా తాగాలి.  నీరు శరీరానికి ఇంధన వనరు లాంటిది. నీరు బాగా తాగితే శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరంలో వ్యర్థాలు కూడా చెమట రూపంలో, మూత్రం రూపంలో బయటకు  వెళ్లిపోతాయి.

చలి కారణంగా చలికాలంలో దాహం బాగా తగ్గుతుంది.  ఈ కారణంగా నీరు తాగడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండి పని చేసుకునే వారు నీరు తక్కువగా తాగుతుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు.

సీజన్ ఏదైనా సరే.. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీరు తాగాలని అంటారు. అంటే ఇది 8 నుండి 12 గ్లాసుల నీటికి సమానం.

తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోయి అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో నీరు తక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది.  దీని వల్ల చర్మ సంబంధ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి.

నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో జీర్ణాశయానికి ఇబ్బంది ఏర్పడుతుంది.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలం కదా అని నీరు తక్కువగా తీసుకోకూడదు.  కనీసం రెండున్నర నుండి మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి.


                                           *రూపశ్రీ.