ఎండ అంటే చాలామందికి చిరాకు. కానీ చలికాలంలో మాత్రం కాసింత ఎండ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాతావరణం అంతా ముసురుపట్టి చల్లగా ఉన్నప్పుడు వెచ్చని సూర్యకిరణాలు శరీరానికి తగిలితే ఎక్కడలేని హుషారు వస్తుంది. అయితే చాలామంది  ఈ ఎండ వల్ల బద్దకం వదులుతుందని, చలిలో శరీరానికి వెచ్చగా బాగుంటుందని అనుకుంటారు.   అసలు సూర్యకిరణాలు శరీరానికి తగిలితే జరిగేదేంటో పూర్తీగా తెలియదు.  చలికాలం అయినా, వేసవి కాలం అయినా ఉదయాన్నే వెలువడే సూర్యకిరణాల వెలుగులో కొంచెం సేపు గడపడం, వీలైతే ఆ లేత ఎండలో వ్యాయామాలు చెయ్యడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రోజూ సూర్యుని ఎండలో ఉంటే జరిగేదేంటంటే..


విటమిన్-డి

మన శరీరం విటమిన్-డి ని ఎక్కువగా ఉత్పత్తి చేయదు.  అందుకే ప్రతిరోజూ 20-30 నిమిషాలు లేత ఎండలో ఉండాలని   వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.  సూర్యరశ్మి నుండి   విటమిన్ డి చాలా లభిస్తుంది.  సూర్యకిరణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది..

ఉదయాన్నే లేత సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల శరీరంలోని మెలటోనిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు సన్ బాత్ కూడా  మంచి మార్గం.  ఎండలో కూర్చోవడం లేదా నిలబడాల్సిన అవసరం లేదు.  నడవవచ్చు,  ఆడవచ్చు, వ్యాయామాలు చేయవచ్చు.   ఇది  ఒత్తిడిని  తగ్గిస్తుంది.

రోగనిరోధక శక్తి..

సూర్యరశ్మి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  సూర్యరశ్మిలో ఉండడం ద్వారా  చాలా తక్కువ సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతుంది.

ఎముకలకు..

కాల్షియం మాత్రమే కాకుండా బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడంలో విటమిన్ డి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సూర్యకాంతి విటమిన్ డికి అద్భుతమైన మూలం. సూర్యరశ్మిలో 15 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వీలైనంత ఎక్కువ సూర్యరశ్మిని తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు.

నిద్రకు మంచిది..

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు లేత సూర్యరశ్మిలో ఒక గంట సేపు గడిపితే  రాత్రికి మంచి నిద్ర వస్తుంది. దీని వెనుక ఒక కారణం ఉంది. సూర్యరశ్మికి ఎంత ఎక్కువ బహిర్గతం అవుతారో రాత్రి సమయంలో  నిద్రపోతున్నప్పుడు    మెలటోనిన్ ప్రభావితం అవుతుంది. అందుకే మంచి నిద్ర వస్తుంది.

బరువు..

సూర్యకాంతికి, వ్యక్తి బరువుకు  మధ్య లోతైన సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. నిజానికి  ఎండలో గడపడం వల్ల శరీరంలో  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. చలికాలంలో దాదాపు 15 నిమిషాల పాటు సన్ బాత్ చేయడం వల్ల కూడా  బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతారు.

                              *నిశ్శబ్ద.